విజయవాడ, డిసెంబర్ 21,
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి మెుదలైంది. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అభ్యర్థుల కసరత్తుకు తెరలేపారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌సైతం అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మెుదలు పెడతారని తెలుస్తోంది. యువగళం నవశకం బహిరంగ సభద్వారా ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే ఏపీలో షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ఎన్నికల తేదీల నిర్వహణపై చర్చ రాజకీయ వర్గాల్లో మెుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు మరింత ముందు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది? షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరగడం ఖాయంగా సమాచారం. తెలంగాణలో 15 రోజులు ముందు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో ఈసారి 21 రోజుల కంటే ముందే ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత ఏపీలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ మెుదలైంది. అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుండటంతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. దీంతో ఎన్నికలు ఈ సారి ఎప్పడూ లేనంత ఉత్కంఠ కలిగిస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉందని ఇది తమకు కలిసి వస్తుందని చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ నమ్మకంగా ఉన్నారు. ఎన్నికల వేళ సీఎం జగన్ సిట్టింగ్‌లకు మారుస్తున్న నేపథ్యంలో ఆ వ్యతిరేకత తనకు కలిసి వస్తుందన్నారు. ఇదే సమయంలో టీడీపీ, జనసేన వచ్చే నెలలో అభ్యర్దులను ఖరారు చేయనుంది.ఏపీలో నిర్ణీత షెడ్యూల్ కంటే 21 రోజులు ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని తెలుస్తోంది.ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో సీఎం వైఎస్ జగన్ ఇవే సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీ అధికార వర్గాల సమాచారం మేరకు ఏపీలో ఫిబ్రవరి 15-20 మధ్య ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో బోగస్ ఓట్ల పైన వైసీపీ, టీడీపీ పోటా పోటీగా ఇస్తున్న ఫిర్యాదుల పైన ఎన్నికల సంఘం ఆరా తీస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలోనూ ఎన్నికల దిశగా కసరత్తు మెుదలైనట్లు తెలుస్తోంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, పోలింగ్ కేంద్రాల వివరాలను ఎన్నికల అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఓటర్లకు నమోదు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికలు అంటే 2019లో మార్చి 3న ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. కానీ ఇప్పుడు ఫిబ్రవరి 10-15 మధ్యన విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఆంధ్రప్రదేశ్‌తో పాటుగా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల పైన కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి సిద్ధమని అన్ని రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యమని అటు టీడీపీ ఇటు జనసేన పార్టీలు కలిసి ఉమ్మడి కార్యచరణ చేపట్టాయి. మరోవైపు ఈసారి అధికారంలోకి వస్తే రాబోయే మరో 10ఏళ్లు అధికారంలో ఉండొచ్చని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీ నియోజకవర్గంలో గెలుపును అన్ని రాజకీయ పార్టీలు సీరియస్‌గా తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈసారి 21 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉందంటూ ప్రచారం వస్తుండటంతో రాజకీయ పార్టీలు టికెట్ల కేటాయింపుపై మరింత దృష్టి కేంద్రీకరించారు. ఏది ఏమైనప్పటికీ వచ్చే ఎన్నికలు ఒక సమరాన్ని తలపించేలా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.