YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ ఆఫీసుల్లో కోటంరెడ్డి ప్రచారం

ప్రభుత్వ ఆఫీసుల్లో కోటంరెడ్డి ప్రచారం

నెల్లూరు, డిసెంబర్ 22,
ఏపీలో ఎన్నికలకు టైమ్ దగ్గరపడింది. అధికార పార్టీ కూడా ఈసారి హడావిడి పడుతోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసి ఏపీలో సీఎం జగన్ సిట్టింగ్ లను ఎడాపెడా మార్చేస్తున్నారు. అటు టీడీపీ కూడా అభ్యర్థుల విషయంలో కసరత్తులు చేస్తోంది. అభ్యర్థులు ఖరారైన స్థానాల్లో మాత్రం నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికలకోసం సమాయత్తమవుతున్నారు. ఒక్కడినే ఒంటరిగా అనే కార్యక్రమం చేపట్టారు. అటు ఆయన కుటుంబ సభ్యులు కూడా రూరల్ నియోజకవర్గ పరిధిలో ప్రచారం మొదలు పెట్టారు. ఒక్కడినే ఒంటరిగా అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి గడప తొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రతి ఇంటికి వెళ్లి వారిని పలకరిస్తున్నారు. వ్యాపార సముదాయాలను కూడా వదిలిపెట్టడంలేదు. అన్ని ప్రాంతాలకు వెళ్తున్నారు కోటంరెడ్డి. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఆయన ప్రచారం నిర్వహించడం విశేషం. నెల్లూరు నగరంలో ఉన్న సోమశిల, తెలుగు గంగ కార్యాలయాల్లో ఒక్కడే - ఒంటరిగా కార్యక్రమం చేపట్టారు కోటంరెడ్డి. సోమశిల, తెలుగు గంగ కార్యాలయాల్లో ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరించారు. తెలుగుదేశం పార్టీనుండి తాను పోటీచేస్తున్నానని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. సోమశిల, తెలుగు గంగ కార్యాలయం ఉద్యోగస్తుల నుంచి కూడా మంచి స్పందన లభించిందని తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రెండుసార్లు ఆయన వైసీపీ టికెట్ పై పోటీ చేశారు. మూడోసారి ఇప్పుడు టీడీపీ టికెట్ పై ఆయన పోటీ చేయబోతున్నారు. ప్రత్యర్థిగా ప్రస్తుత నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి బరిలోదిగే అవకాశముంది. నెల్లూరు రూరల్ లో కోటంరెడ్డికి భారీ అనుచరగణం ఉన్నా.. ప్రస్తుతం వారంతా ఆదాల వర్గంలో చేరిపోయారు. కోటంరెడ్డి బయటకొచ్చినా, అనుచరులు మాత్రం అధికార పార్టీలోనే ఉన్నారు. ఎన్నికలనాటికి  పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కోటంరెడ్డికి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆ స్థానంలో ఎవరు గెలిచినా గెలవకపోయినా.. ఎన్నికల తర్వాత ద్వితీయ శ్రేణి నాయకులు అధికార పార్టీలోకే వచ్చి చేరతారు. అంటే అప్పుడు వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకుంటే అక్కడే ఉండిపోతారు, లేదా టీడీపీ అధికారంలోకి వస్తే కోటంరెడ్డి వైపు వచ్చేస్తారు. సో ద్వితీయ శ్రేణిపై పెద్దగా ఆశలు పెట్టుకోవడం కష్టం. అందుకే జనంపైనే నమ్మకం పెట్టుకున్నారు కోటంరెడ్డి.కోటంరెడ్డి కష్టాల్లో ఉన్నా కూడా కొందరు నేతలు మాత్రం ఆయనతో మిగిలిపోయారు. వారికి తోడు సంస్థాగతంగా టీడీపీకి ఉన్న బలం కూడా ఆయనకు మద్దతుగా మారింది. ఇక ప్రజల్లో ఆయన మార్పు తీసుకు రావాలి. అందుకే ఇప్పటినుంచే కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గం అంతా కలియదిరుగుతున్నారు. ఏ ఒక్క ఓటుని కూడా వృథా కానీయకుండా చూడాలనుకుంటున్నారు కోటంరెడ్డి. నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క ఓటరునీ పలకరించాలనే సంకల్పంతో ముందుకు కదిలారు. ఓవైపు ఆయన, మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు కూడా జనంలోకి వెళ్తున్నారు. ఈ ప్రచారంలో భాగంగానే ప్రభుత్వ కార్యాలయాలు కూడా చుట్టేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఏదీ లేకపోవడంతో ఆయన ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లి మరీ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గతంలో రెండు పర్యాయాలు తనకు అండగా నిలబడినందుకు కృతజ్ఞతలు తెలుపుతూనే, మూడోసారి కొత్తగా సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నానని, తనను ఆదరించాలని కోరుతున్నారు కోటంరెడ్డి.

Related Posts