YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఖమ్మం ఖిల్లా ఎవరిది..?

 ఖమ్మం ఖిల్లా ఎవరిది..?
నాలుగేళ్లలో రాజకీయ రూపు రేఖలు మార్చేసుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా.. వచ్చే ఎన్నికల్లో ఎవరి ఖిల్లా కానుందనేది ఆసక్తిగా మారింది. 2014 సాధారణ ఎన్నికల్లో మెజార్టీ అసెంబ్లీ స్థానాలు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌.. ఖమ్మం జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఇక్కడ 10 అసెంబ్లీ స్థానాలుంటే.. కొత్తగూడెంలో మాత్రమే గెలుపొందింది. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల పరిధిలోకి వచ్చే మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని దక్కించుకోగలిగింది. తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లాలో వైసీపీ మూడు అసెంబ్లీ స్థానాలు, ఖమ్మం లోక్‌సభ స్థానంలో విజయం సాధించింది. నాలుగు స్థానాల్లో కాంగ్రెస్‌, సీపీఎం, టీడీపీ ఒక్కో స్థానాల్లో గెలిచాయి. ఎన్నికల తర్వాత టీడీపీ సీనియర్‌ నేత తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎ్‌సలో చేరటంతో ఖమ్మం జిల్లా రాజకీయ సమీకరణాలు మారిపోయా యి. టీఆర్‌ఎస్‌ బలమైన శక్తిగా ఎదుగుతోంది. వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీతోపాటు ఇల్లెందు, ఖమ్మం కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఇప్పటికే ‘కారు’ ఎక్కేశారు. పాలేరులో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అకాల మరణంతో ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ తరఫున తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాను టీఆర్‌ఎ్‌సకు పెట్టని కోటగా మలిచేందుకు ఆయన విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో టీడీపీ, కాంగ్రెస్‌, కమ్యూనిస్టుల ప్రాభవం ఒకప్పటిదిగా చెప్పుకొనే దిశగా జిల్లా రాజకీయ పరిణామాలు మారిపోయాయి.
వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్‌ఎ్‌సలో కొనసాగుతున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున రేగా కాంతారావు పోటీ చేయటం ఖాయమైంది. కాంగ్రె్‌సతో పొత్తు కుదిరితే సీపీఐ ఈ స్థానాన్ని ఆశించే అవకాశం ఉంది. టీడీపీ బరిలోకి దిగుతుందా? లేదా? అనే స్పష్టత రావాల్సిఉంది.. ఇల్లెందు నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలిచి గులాబీ కండువా కప్పుకొన్న ఇల్లెందు ఎమ్మెల్యే కోరెం కనకయ్య.. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్‌ నుంచి బానోతు హరిప్రియ, చీమల వెంకటేశ్వర్లు, డాక్టర్‌ రామచంద్ర నాయక్‌ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీకి ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ, కేడర్‌ లేని దయనీయ స్థితిలో ఉంది. న్యూ డెమోక్రసీ పార్టీ ఇక్కడ రెండుగా చీలిపోయింది. రాయల వర్గం నుంచి నర్సయ్య, చంద్రన్న వర్గం నుంచి సత్యం బరిలో నిలిచే అవకాశం ఉంది.
ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచి.. ఇప్పుడు టీఆర్‌ఎ్‌సలో కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి ఆయన పోటీ చేయటం దాదాపు ఖాయమే. కాంగ్రెస్‌ నుంచి రాఽధాకిశోర్‌, పోట్ల నాగేశ్వరరావు, గ్రానైట్‌ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), నాగండ్ల దీపక్‌ చౌదరి, నరసింహారావు టికెట్లు ఆశిస్తున్నారు. మధిర నియోజకవర్గం నుంచి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఆయనే బరిలోకి దిగనున్నారు. ఇక్కడ టీఆర్‌ఎస్‌ బలంగా లేకపోవడం భట్టికి కలిసొచ్చే అంశమే. టీఆర్‌ఎ్‌స నుంచి బొమ్మెర రామ్మూర్తి మరోసారి పోటీ చేయాలన్న ఉత్సాహంతో ఉన్నారు. ఇక్కడ టీడీపీకి బలమైన అభ్యర్థి లేరు. వామపక్షాల తరఫున ఎవరు పోటీ చేసేది తేలలేదు.
వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై టీఆర్‌ఎ్‌సలో కొనసాగుతున్న బానోతు మదన్‌లాల్‌ వచ్చేసారి టికెట్‌ తనకే దక్కుతుందన్న ధీమాతో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ కొంత బలంగా ఉందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉన్నా.. పోటీ చేసే అభ్యర్థి ఎవరనేది కీలకం కానుంది. కాంగ్రెస్‌ నుంచి రాములు నాయక్‌, రాందాస్‌ నాయక్‌, గిరిబాబు, సైదులు పేర్లు వినిపిస్తున్నాయి. సీపీఐ కూడా పోటీ చేసే ఆలోచనలో ఉంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీడీపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున ఆయన పోటీకి దిగటం లాంఛనమే. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించే సండ్రకు ఈ సారి గట్టి పోటీ ఇవ్వాలని అధికార టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. గత ఎన్నికల్లో సండ్ర చేతిలో ఓడిపోయిన పిడమర్తి రవి మరోసారి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నిలిచే అవకాశం ఉంది. జడ్పీ చైర్‌పర్సన్‌ కవితతోపాటు, దయానంద్‌ పేర్లు కూడా వినిపిస్తున్నా యి. కాంగ్రెస్‌ నుంచి సంబాని చంద్రశేఖర్‌ బరిలో దిగనున్నారు.
కొత్తగూడెంలో టీఆర్‌ఎస్‌ తరఫున సిటింగ్‌ ఎమ్మెల్యే జలగం వెంకటరావు మళ్లీ పోటీ చేయనున్నారు. నియోజకవర్గంలో విపక్షాలు అంత బలంగా లేకపోవటం ఆయనకు కలిసొచ్చే అంశం. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఆయన తోడల్లుడు యడవల్లి కృష్ణ టికెట్‌ ఆశిస్తున్నారు. సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు మరోసారి బరిలోకి దిగబోతున్నారు. టీడీపీ నుంచి సత్యనారాయణ పోటీకి సన్నద్ధమవుతున్నారు.
2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్‌ఎ్‌సలో చేరిన తాటి వెంకటేశ్వర్లు అధికార పార్టీ అభ్యర్థి కానున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ టికెట్‌ ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి ఉంది. టీడీపీ నుంచి మెచ్చా నాగేశ్వరరావు పోటీ చేస్తారో? లే దో తెలియడం లేదు. టీఆర్‌ఎస్‌కు ఇవన్నీ కలిసొచ్చే అంశాలే.
తెలంగాణలో ఏకైక సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య భద్రాచలం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఈ నియోజకవర్గంలోని చింతూరు, వరరామచంద్రాపురం, కూనవరం మండలాలు ఏపీ పరిధిలోకి వెళ్లటం.. ఆ పార్టీకి ఇబ్బంది కలిగించే అంశమే. ప్రస్తుతం ఎమ్మెల్యే సున్నం రాజయ్య వచ్చేసారి భద్రాచలం నుంచి పోటీ చేసేందుకు ఇష్టపడటం లేదనే ప్రచారం సాగుతోంది. ఆయన స్వగ్రామం ఉన్న ఏపీలోని రంపచోడవరం నుంచే పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. రాజయ్య స్థానంలో మాజీ ఎంపీ బాబూరావు బరిలోకి దిగుతారన్న ప్రచారం ఉంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తెల్లం వెంకటరావు పేరు వినిపిస్తోంది. నియోజకవర్గ ఇన్‌చార్జి మానె రామకృష్ణ, బుచ్యయ్య పేర్లూ వినిపిస్తున్నాయి. టీడీపీ నుంచి ఫణీశ్వరమ్మ పేరు ప్రచారంలో ఉంది. కాంగ్రెస్‌ నుంచి పలువురు టికెట్‌ ఆశిస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ దిగ్గజం, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానంలో ఎదురులేకుండా చేసుకునే ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. మరోసారి ఆయన పాలేరు అసెంబ్లీ స్థానం నుంచి బరిలో దిగుతారా ? లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తారా? అనే విషయంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ నుంచి ఇక్కడ దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సోదరుడి కుమారుడు చరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, కందాల ఉపేందర్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. సీపీఎం నుంచి పోతినేని సుదర్శన్‌ బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు. అయితే తుమ్మల స్థాయికి తగిన పోటీనిచ్చే రాజకీయ ప్రత్యర్థి ఇక్కడ లేకపోవటం ఆయనకు కలిసివచ్చే అంశం.
గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఖమ్మం ఎంపీగా ఎన్నికై టీఆర్‌ఎ్‌సలో కొనసాగుతున్న పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి వచ్చేసారి అధికార పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేత రేణుకా చౌదరి, టీడీపీ నుంచి నామా నాగేశ్వరరావు బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. వామపక్షాలు కూడా పోటీకి సిద్ధమవుతున్నాయి. మరోవైపు మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ సిటింగ్‌ ఎంపీ సీతారాం నాయక్‌ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీతారాం నాయక్‌ను అసెంబ్లీకి పోటీ చేయించి, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి మరో గిరిజన నేతను పోటీకి దింపితే ఎలా ఉంటుందన్న చర్చ పార్టీలో నడుస్తోంది. బలరాం నాయక్‌ మళ్లీ కాంగ్రెస్‌ నుంచి బరిలోకి దిగబోతున్నారు.

Related Posts