విజయవాడ, డిసెంబర్ 23,
వైసీపీలో మార్పు ఎఫెక్ట్ ఎన్నికల్లో ఎలా ప్రభావం చూపుతుందో గాని.. ప్రస్తుతం పార్టీలో ఎంపీ మిథున్‌రెడ్డి పాత్రను కీలకంగా మార్చేసింది. తనకు అప్పగించిన రెండు జిల్లాలు.. తన తండ్రి, మంత్రి పెద్దిరెడ్డి ఇన్‌చార్జిగా ఉన్న రెండు జిల్లాల బాధ్యతలను చూస్తున్న ఎంపీ మిథున్‌రెడ్డి.. ఇప్పుడు ఎమ్మెల్యేల మార్పుచేర్పుల వ్యవహారంలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వైసీపీలో ఎవరినోట విన్నా మిథున్‌రెడ్డి పేరే వినిపిస్తోంది.అధికార వైసీపీలో ఇప్పుడు ఎక్కడ విన్నా.. ఎవరి నోట విన్నా.. ఎంపీ మిథున్‌రెడ్డి కోసమే చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యేల మార్పు నిర్ణయాన్ని సీఎం జగన్ కంటే ముందుగా.. ఎంపీ మిథున్‌రెడ్డే తెలియజేస్తుండటం.. అసంతృప్తులు, అసమ్మతులు పెద్దవి కాకుండా చూసుకోవడం ఎంపీ మిథున్‌రెడ్డి పనిగా మారడంతో పార్టీలో క్రియాలశీలకంగా మారారు.ప్రస్తుతం రాజంపేట ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న మిథున్‌రెడ్డి తొలి నుంచి సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడనే పేరు ఉంది. పైగా చిత్తూరు జిల్లాలో ఎంపీ మిథున్‌రెడ్డి కుటుంబానికి భారీ అనుచరగణం ఉంది. ఆయన తండ్రి పెద్దిరెడ్డి మంత్రిగా ఉండగా, బాబాయ్ ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. దీంతో సీమలో మిథున్‌రెడ్డి అత్యంత కీలక నేతగా గుర్తింపు పొందారు.ఇక ప్రస్తుతం పార్టీలో నెంబర్ 2గా చెప్పుకునే ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల వంటివారు ఎందరో ఉన్నా.. వారెవరికీ అప్పగించని బాధ్యతలను ఎంపీ మిథున్‌రెడ్డికి అప్పగించారు సీఎం జగన్. సిట్టింగుల్లో మార్చాలనుకుంటున్న ఎమ్మెల్యేలను నచ్చజెప్పి.. వారు పార్టీ లైన్ దాటకుండా చూసే బాధ్యతను మిథున్‌రెడ్డికే అప్పగించారు సీఎం జగన్.. ఏ ఎమ్మెల్యేను ఎందుకు తప్పించాల్సి వస్తుందో.. ఎన్నికల తర్వాత వారికి ఎలాంటి ప్రాధాన్యం కల్పించనున్నారనే విషయాలను మిథున్‌రెడ్డే వారికి చేరవేస్తున్నారు. మెజార్టీ నేతలను సీఎం వద్దకు వెళ్లకుండానే తన చాతుర్యంతో సమస్య జటిలం కాకుండా సెట్ చేస్తున్నారు మిథున్‌రెడ్డి.గోదావరి జిల్లాల సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న మిథున్‌రెడ్డి, తన తండ్రి పెద్దిరెడ్డి సమన్వయకర్తగా ఉన్న ఉమ్మడి చిత్తూరు, అనంతపురం వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. ఈ నాలుగు జిల్లాల్లో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు ఉండటం.. గోదావరి తీర్పు.. అధికారానికి దగ్గర చేస్తుందనే సెంటిమెంట్ వల్ల మిధున్‌రెడ్డిపై భారం మోపారు సీఎం. ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తుండటం వల్ల ఇప్పుడు ఎమ్మెల్యేల మార్పు ఎపిసోడ్‌లోనూ మిథున్‌రెడ్డి సేవలనే వినియోగిస్తున్నారు సీఎం జగన్.ఇప్పటివరకు మార్పు ప్రకటించిన అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడా అసంతృప్తి కనిపించకపోవడానికి.. తెరవెనుక మిథున్‌రెడ్డి నడిపిన మంత్రాంగమే కారణమనే ప్రచారం ఉంది. మార్చుదామనునకున్న స్థానాల్లో ద్వితీయ శ్రేణి నేతలతో మాట్లాడుతూ.. ధిక్కారం వినిపించే వారిని ఒంటరిని చేసే ప్లాన్ పక్కాగా అమలు చేయడం వల్ల ఇప్పటివరకు జగన్ మార్క్ మార్పు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోందంటున్నారు.