YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ధర్మవరంలో ట్రైయాంగిల్ ఫైట్

ధర్మవరంలో ట్రైయాంగిల్ ఫైట్

అనంతపురం, డిసెంబర్ 23,
ఒకరు మూడు దశాబ్దాల రాజకీయ నేపథ్యమున్న బలమైన కుటుంబం నుంచి వచ్చిన నాయకుడు. అదృష్టం కలిసొస్తే పరీక్షించుకోవాలనుకుంటున్న లీడర్‌ మరొకరు. అంగ బలం, అర్థ బలం రెండూ దండిగా ఉన్న బలమైన నాయకుడు ఇంకొకరు. ఇలా ముగ్గురూ ఒకే నియోజకవర్గంలో పోటీకి సిద్ధపడుతున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉంటే.. ఆయనపై పోటీ చేసే అభ్యర్థి విషయంలో ప్రతిపక్షం నుంచి ఇంకా ఒక క్లారిటీ రావడంలేదు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై పోటీ చేసేందుకు ప్రతిపక్షం నుంచి అభ్యర్థుల కొరత లేదు గానీ గట్టి పోటీ ఉంది.తెలుగుదేశం పార్టీ నుంచి పరిటాల శ్రీరామ్ ధర్మవరం రేసులో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా తనకు టికెట్ కేటాయించాలని ధర్మవరం జనసేన ఇన్‌చార్జ్ చిలుకం మధుసూదన్ రెడ్డి కూడా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక బీజేపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పోటీచేసి తీరతానంటున్నారు. గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీలోకి వస్తారని కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. కానీ సూరి మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీ నుంచే బరిలో ఉంటారా? ఒకవేళ టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఏర్పడితే ఈ ముగ్గురిలో ఎవరు ధర్మవరం బరిలో ఉంటారన్న ప్రశ్న తలెత్తుతోంది.పరిటాల రవీంద్ర వారసుడిగా పరిటాల శ్రీరామ్ ఈసారి ధర్మవరంలో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని ఆశపడుతున్నారు. అయితే శ్రీరామ్ ఆశలకు రెండు రకాలుగా ప్రమాదం పొంచి ఉంది. మూడుపార్టీల మధ్య పొత్తు కుదిరి జనసేన టికెట్ ఆశిస్తే పరిటాల శ్రీరామ్ పరిస్థితి ఏంటి? మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల టీడీపీలోకి తిరిగొచ్చి టికెట్ రేసులో నిలిస్తే, అప్పుడేం చేయాలని ఆలోచనలో పడ్డారట పరిటాల శ్రీరామ్. అటు జనసేన నాయకుడు చిలకం మధుసూదన్ రెడ్డి కూడా ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. సొంతబలం కన్నా టీడీపీతో పొత్తునే ఆయన ఎక్కువగా నమ్ముకున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్లకు రెండు వైపులా ఆఫర్స్ రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మూడు పార్టీల మధ్య పొత్తుంటే బీజేపీ తరపున ధర్మవరంలో గోనుగుంట్ల పోటీచేసే అవకాశం ఉంది. టీడీపీ అధినేత మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తే మాజీ ఎమ్మెల్యేగా ధర్మవరం టికెట్ ఆశించే ఛాన్స్‌ కూడా ఉంది.మొత్తానికి అధికారపార్టీలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని మార్పులున్నా, సిట్టింగ్‌ సీట్లో స్ట్రాంగ్‌గా ఉన్నారు కేతిరెడ్డి. ధర్మవరం నుంచి మరోసారి పోటీకి ఆయన సిద్ధమవుతున్నారు. కానీ ఆయన ప్రధాన ప్రత్యర్థి ఎవరన్నదే ఇంకా క్లారిటీ రాకపోవటంతో.. వన్ వర్సెస్ త్రీగా అన్నట్లున్నాయ్‌ రాజకీయ సమీకరణాలు. ఇటువైపు నేనొక్కడినే.. అటువైపు ఆ ముగ్గురిలో ఎవరు బరిలో తేలితే.. ఆ ఒక్కడితో నేను తేల్చుకుంటా అంటున్నారు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.

Related Posts