YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

28 నుంచి రేషన్ కార్డులు...

 28 నుంచి రేషన్ కార్డులు...

హైదరాబాద్, డిసెంబర్  23,
తెలంగాణలో ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల  కోసం దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అర్హులంతా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం కోసం నిబంధనలు, అర్హతల గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ఆధారంగా రేషన్ కార్డు తీసుకోవడానికి రూల్స్ ఈ విధంగా ఉన్నాయి..
—గ్రామీణ ప్రాంతాల్లో రూ.2 లక్షల ఆదాయం లోపు ఉన్నవారే అర్హులు
—మాగాణి 3.5 ఎకరాలు, బీడు భూములైతే 7.5 ఎకరాలలోపు ఉండాలి
—గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.15 వేల లోపు ఆదాయం
అయితే రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్ర జనాభా 3 కోట్ల 95 లక్షలు కాగా.. తెలంగాణలో రేషన్ లబ్ధిదారులు 2 కోట్ల 85 లక్షల మంది ఉన్నారు. దీంతో చాలా మంది అనర్హులకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయన్న వాదన చాలా రోజులుగా ఉంది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం అనర్హులకు కార్డులు తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో రేషన్‌ కార్డు ఉండి ఇప్పుడు ఆర్థికంగా స్థిరపడితే వారిని అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదాయం ఎక్కువ ఉంటే రేషన్‌ కార్డు సరెండర్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కింది వారు రేషన్ కార్డు తీసుకోవడానికి అనర్హులుగా నిర్ణయించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం.
—ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌, ఇన్‌కం ట్యాక్స్‌, సేల్స్‌ ట్యాక్స్‌ చెల్లించినా అనర్హులే
—డాక్టర్లు, లాయర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు రేషన్‌ కార్డుకు అనర్హులే
—పైన ఇచ్చిన నిబంధనల పరిధిలోకి రాని వారిని కూడా రేషన్ కార్డు పొందేందుకు అనర్హులుగా నిర్ణయించే ఛాన్స్ ఉంది.
ఇంకా ఏళ్లుగా రేషన్ తీసుకోని వారిని కూడా అనర్హులుగా ప్రకటించే ఛాన్స్ ఉంది.
గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా చేశాయి. దీంతో ఎలాగైనా రేషన్ కార్డులను పొందేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు అనేక మంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య అధికంగా ఉందన్న చర్చ ఉంది. దీంతో రేషన్ కార్డును కేవలం రేషన్ కు మాత్రమే పరిమితం చేయాలన్న ఆలోచన కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. తద్వారా ప్రభుత్వం రాయితీపై రేషన్ దుకాణాల ద్వారా అందించే సరుకులను అర్హులకు మాత్రమే అందించే అవకాశం ఉంటుందన్న చర్చ సాగుతోంది. మరో వారం రోజుల్లో రేషన్ కార్డు తీసుకోవడానికి నిబంధనలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Related Posts