మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 247 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆతిథ్య జట్టుకు 241 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఓవర్‌నైట్ స్కోరు 49/1తో ఆట ప్రారంభించిన భారత్ మూడో రోజు ఆటలో కాస్త నిలకడగా ఆడింది. మురళీ విజయ్ (25), పార్దీవ్ పటేల్ (16), కేఎల్ రాహుల్ (16), పుజారా (16) ఔటైనా అజింక్య రహానె (48; 68 బంతుల్లో 6 ఫోర్లు), కెప్టెన్ విరాట్ కోహ్లీ (41; 79 బంతుల్లో 6ఫోర్లు) బ్యాట్‌ను బౌండరీ వైపు ఝళిపించారు. భువనేశ్వర్ కుమార్ (33; 76 బంతుల్లో 2ఫోర్లు), మహ్మద్ షమి (27; 28 బంతుల్లో 1ఫోర్, 2సిక్స్‌లు) పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఇక పాండ్య (4) చేతులేత్తేయగా, ఇషాంత్ (7; 16 బంతుల్లో 1ఫోర్; నాటౌట్)గా నిలిచాడు. దీంతో భారత్ 80.1 ఓవర్లలో 10 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసి అలౌట్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్, రబాడ, మోర్కెల్ తలో మూడు వికెట్లు తీయగా, నిగిడి ఒక వికెట్ తీసుకున్నారు. లక్ష్యం నిర్దేశించిన భారత్ సఫారీలను కట్టడి చేస్తోందో లేదో చూడాలి.
సఫారీల లక్ష్యం 241
టీమిండియా నిర్దేశించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. తొలి ఓవర్‌లోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్‌గా దిగిన ఎకె మార్కమ్ (4) పరుగులకే చేతులేత్తేశాడు. దక్షిణాఫ్రికా 8.3 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 17 పరుగులు చేయగా, ఇల్గర్ (11), ఆమ్లా (2) పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు. భారత బౌలర్లలో షమీకి ఒక వికెట్ దక్కింది.