YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

గెలిచే అవకాశం లేని వారికి నో టిక్కెట్లు

గెలిచే అవకాశం లేని వారికి నో టిక్కెట్లు

విజయవాడ, డిసెంబర్ 29,
ఏపీలో అధికార వైఎస్సార్సీపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు సాధారణ ప్రజానీకంలో సైతం ఆసక్తి కలిగిస్తున్నాయి. పలు నియోజక వర్గాల్లో అభ్యర్థుల మార్పు, స్థాన చలనం, కొత్తవారికి సీట్లు అంటూ పూటకో ప్రచారం జరగడం అందరినీ ఆకర్షిస్తోంది.2019 అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 151మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి గెలిచారు. నాలుగున్నరేళ్ల తర్వాత వారిలో మూడో వంతు మందికి ఖచ్చితంగా స్థాన చలనం, సీటు దక్కకపోవడం వంటి కష్టాలు ఎదురయ్యాయి. దీనికి ఎమ్మెల్యేల స్వీయ తప్పిదాలే కారణంగా కనిపిస్తోంది.అసంతృప్తి ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధుల్లో చాలా మంది అధికారంలో ఉన్న నాలుగేళ్లలో ఏ మాత్రం పట్టించుకోకపోవడం ప్రధాన సమస్యగా మారింది. దీనికి తోడు ఎవరికి వారు సొంతంగా అనుచరుల్ని ఏర్పాటు చేసుకుని అందినకాడికి సంపాదించుకునే పనిలో నిమగ్నమై నియోజక వర్గాలను పట్టించుకోవడం మానేశారు. ప్రధానం పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున అసంతృప్తి మూటగట్టుకున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు అసంతృప్తి ఎదుర్కొంటున్న నియోజక వర్గాల్లో సమస్యలు ఒకే తరహాలో ఉంటున్నాయి.గ్రామాలు, పట్టణాల్లో అభివృద్ధి లేకపోవడం, సంక్షేమ పథకాలకు మాత్రమే పరిమితం కావడం, రోడ్లు, డ్రెయిన్లు, పారిశుధ్యం, తాగునీరు వంటి కనీస సౌకర్యాల విషయంలో ఎమ్మెల్యేలు శ్రద్ధ తీసుకోకపోవడం వారికి శాపాలుగా మారాయి.పట్టణ ప్రాంతాల్లో అయితే ఎమ్మెల్యేలు నియోజక వర్గాలను తమ సామంత రాజ్యాలుగా భావించారు. టౌన్‌ప్లానింగ్‌, మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌ అనుమతులతో సంబంధం లేకుండా సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఎమ్మెల్యే అనుచరులకు కప్పం కట్టుకోవాల్సిన పరిస్థితులు కల్పించారు. ప్రైవేట్ సైన్యాలను ఏర్పాటు చేసుకుని అందినంత వసూలు చేశారు. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో మధ్య తరగతి ప్రజలు ఇల్లు కట్టుకోవాలంటే భయపడే పరిస్థితులు కల్పించారు. ఇంటి ముందు నిర్మాణ సామాగ్రి కనిపిస్తే బలవంతపు వసూళ్లు సాధారణం అయిపోయాయి.ఎమ్మెల్యేలకు కీలక అనుచరులుగా ఉన్న కార్పొరేటర్లు వారి చెప్పు చేతల్లో ఉండే చోటా నాయకులతో ఈ వసూళ్ల దందా నడిపించారు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో అదుపాజ్ఞల్లో ఉంచారు. వాలంటీర్లతో కూడిన సచివాలయ వ్యవస్థ, ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించడం వంటి కార్యక్రమాలకు తమ ప్రమేయం లేకుండా పోతోందని చాలా మంది గగ్గోలు పెట్టారు. వాలంటీర్లను తమకు అనుసంధానించాలని ఒత్తిడి చేయడంతో చాలా చోట్ల ఎమ్మెల్యేల పతనం ప్రారంభమైంది.కోవిడ్‌ తర్వాత చాలా నియోజక వర్గాల్లో ప్రైవేట్ దందాలకు ప్రజాప్రతినిధులు తెరతీశారు. ఇక నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ కోసం పనిచేసిన వారిని కాకుండా తమ అక్రమాలకు అండగా నిలిచే వారికి పెద్ద పీట వేశారు. చివరకు దేవాలయాల పాలకమండళ్లలో సైతం రౌడీషీటర్లు, క్రికెట్ బెట్టింగ్ నేరాలకు పాల్పడిన వారు, కాల్ మనీ వ్యాపారులకు కొంతమంది అవకాశం కల్పించారు. ఇలాంటి తప్పిదాలన్నీ ఎమ్మెల్యేలకు చుట్టుకున్నారు. ఎన్ని సర్వేలు చేసినా వారికి గెలిచే అవకాశాలు లేవని తేలడంతో కొత్త ముఖాలతో ఎన్నికలకు వెళ్లేందుకు వైసీపీ సిద్ధం అవుతోంది.2019 ఎన్నికల్లో గెలిచిన వారిలో చాలా మంది ఎమ్మెల్యేలు స్థానికంగా బలం లేకపోయినా, వైసీపీ హవాలో గెలిచిన వారే కావడంతో ఈ సారి కూడా అలాంటి అదృష్టమే వరిస్తుందని వైసీపీ భావిస్తోంది. ఇది ఎంతమేరకు ఫలిస్తుందో చూడాలి. దీంతో పాటు సామాజిక సమీకరణలు, ఓటు బ్యాంకుల ఆధారంగా నియోజక వర్గాలకు అభ్యర్థులను ఖరారు చేస్తోంది. ఇదే విజయాన్ని చేకూరుస్తుందని వైసీపీ విశ్వాసంతో ఉంది.

Related Posts