విజయవాడ, డిసెంబర్ 29,
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోసం అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు వేగవంతం చేసారు.సుమారు 60 స్థానాలకు కొత్త ముఖాలు రానున్నాయి. ఇప్పటికే పలు స్థానాలకు ఇంచార్జిలు మార్పు చేసిన వైసీపీ అధినేత.. మరిన్ని స్థానాలకు ఇంచార్జిలు ప్రకటించే దిశగా కసరత్తు చేస్తున్నారు. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్లతో సమావేశంలో సీట్ల ప్రకటనపై కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధినేత వచ్చే ఎన్నికల కోసం అభ్యర్ధుల ఎంపిక పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు సీఎం జగన్. ఇప్పటికే 11 స్థానాలకు ఇంచార్జిల మార్పుతో మొదటి జాబితా ప్రకటించిన వైసీపీ అధిష్టానం. మలివిడత జాబితా కోసం కసరత్తు చేస్తోంది.మొదటి లిస్ట్ తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు రాయలసీమకు చెందని పలువురు ఎమ్మెల్యేలతో వన్ టూ వన్ సమావేశమయ్యారు సీఎం జగన్. సీటు ఎందుకు ఇవ్వలేకపోతున్నదనే దానిపై సర్వే నివేదికలను అభ్యర్ధుల ముందుంచారు. పార్టీ అధికారంలోకి రాగానే సీటు కోల్పోయిన వారందరినీ ఆదుకుంటామని చెప్పుకొస్తున్నారు. వారం క్రితమే రెండో లిస్ట్ విడుదల అవుతుందని అందరూ భావించినప్పటికీ కాస్త ఆలస్యం అయింది. తాజాగా బుధవారం తాడేపల్లి కేంద్రంగా కీలక సమావేశాలు జరిగాయి. నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకూ అభ్యర్ధుల ఎంపికపైనే సీఎం ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాయలసీమకు చెందిన ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు.ఇలా క్యాంప్ ఆఫీస్ కి వచ్చిన వారిలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్,కొట్టు సత్యనారాయణ, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ, కదిరి ఎమ్మెల్యే సిద్దా రెడ్డితో పాటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ ఉన్నారు. సీఎం నిర్ణయం ఎలా ఉన్నా పార్టీ గెలుపుకోసం పనిచేస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తాను మాత్రం నియోజకవర్గం అభివృద్ది పై చర్చించేందుకే క్యాంప్ ఆఫీస్ కు వచ్చానన్నారు ధర్మశ్రీ.. తనకు చోడవం టిక్కెట్ వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.సీఎం క్యాంప్ ఆఫీస్ లు ఎమ్మెల్యే లు క్యూ కడుతుండగా మరోవైపు ప్రకాశం జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డితో ఆ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. మంత్రి సురేష్, ఎమ్మెల్యే బాలినేని, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి ఉన్నారు. కొండెపి సీటు అంశంపై చర్చించినట్లు తెలిసింది. ఇక సాయంత్రం పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. వచ్చే నెలలో అమలు చేసే కీలక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని దానిపై దిశానిర్దేశం చేసినట్లు సజ్జల చెప్పారు.పార్టీ అభ్యర్థుల ఎంపికపైనా చర్చించినట్లు సజ్జల తెలిపారు. జిల్లాలవారీగా మార్పులు, చేర్పులపై సీఎం జగన్ వారికి దిశానిర్ధేశం చేసినట్లు తెలిసింది. ఎవరెవరికి సీట్లు ఇవ్వడం లేదనే విషయాన్ని రీజినల్ కోఆర్డినేటర్ల వద్ద చర్చించినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో 60 సీట్లకు అభ్యర్థుల ఎంపిక పై ప్రకటన రానుంది. జనవరి ఒకటి నుంచి ప్రారంభించే పెన్షన్ల పెంపు కార్యక్రమంలో కొత్త ఇంఛార్జీలు పాల్గొనేలా సీఎం ముందుకెళ్తున్నారు.