YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విశాఖ పార్లమెంట్ కు అంబటి

విశాఖ పార్లమెంట్ కు అంబటి

విశాఖపట్టణం, డిసెంబర్ 30,
భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు  సీఎం జగన్  సమక్షంలో వైసీపీలో లాంఛనంగా చేరారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం కూడా కన్ఫామ్ అయిపోయింది. అయితే, ఆయన గుంటూరులో పర్యటిస్తుండగా అక్కడి నుంచే పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ, అందరూ అనుకుంటున్నట్లుగా గుంటూరు కాదు.. మరో ముఖ్యమైన స్థానానికి రాయుడు పేరును పార్టీ పరిశీలిస్తోంది. వైసీపీ సోర్సుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయన్ను వైజాగ్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయించే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన రాయుడు కుటుంబం ఎన్నో ఏళ్లుగా హైదారాబాద్‌లోనే స్థిరపడింది. రాయుడు వైఎస్సార్పీసీ నేతలు చర్చలు సాగిస్తున్నప్పుడే ఆయన గుంటూరు జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తారని వినిపించింది. పెదకూరపాడు, పొన్నూరు, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో అంబటి పోటీ చేసే అవకాశం ఉందనుకున్నారు. ఆయన కూడా ఈ నియోజకవర్గాల్లో పర్యటించారు. వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి మాత్రం మరో విధంగా ఆలోచించారు. అంబటిని వైజాగ్ పార్లమెంట్ బరిలో నిలపాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అంబటి రాయుడుకు చెప్పారని.. ఆయన కూడా అందుకు ఆసక్తిగానే ఉన్నారని పార్టీ ముఖ్య నేతల ద్వారా తెలిసింది. అంబటి రాయుడు వంటి సెలబ్రెటీని అసెంబ్లీకి కాకుండా పార్లమెంట్ కు వాడుకుంటే ఉపయోగం ఉంటుందని జగన్ ఆలోచన. గుంటూరు పార్లమెంట్ స్థానానికి కూడా వైఎస్సార్సీపీకి ఇప్పుడు సరైన అభ్యర్థి లేరు. కిందటి సారి గుంటూరు పార్లమెంట్‌కు పోటీ చేసిన మోదుగుల వేణుగోపాలరెడ్డి పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పనిచేయడం లేదు. ఆయనకు పార్లమెంట్ సీటుపై ఆసక్తి ఉందో లేదో తెలీదు. కాబట్టి అంబటి రాయుడు కూడా గుంటూరు పార్లమెంట్ స్థానానికి సరైన అభ్యర్థే. కానీ పార్టీ అధిష్టానం మాత్రం ప్రస్తుతానికి వైజాగ్ పైనే దృష్టి పెట్టింది. విశాఖపట్నంలో రాయుడును బరిలోకి దింపడానికి ముఖ్య కారణం ఉంది. విశాఖ వైఎస్సార్సీపీకి చాలా ముఖ్యమైన సీటు. మొదటి నుంచీ కూడా జగన్ మోహనరెడ్డి వైజాగ్‌పై తన ఇష్టాన్ని చూపుతున్నారు. స్వయంగా తన తల్లి విజయమ్మను 2014లో పోటీ చేయించారు. ఈ ప్రభుత్వం రాజధానిని వైజాగ్‌కు మార్చేందుకు సన్నాహకాలు చేసింది. కోర్టు అడ్డంకులు లేకుంటే రాజధాని షిప్టింగ్ కూడా అయిపోయేదే. అనేక రకాలుగా విశాఖ వైసీపీకి చాలా ముఖ్యమైన సీటు. కానీ ఇక్కడ ప్రత్యర్థి పార్టీ చాలా బలంగా ఉంది. రాష్ట్ర మంతటా 2019లో వైసీపీ సునామీ సృష్టించినా విశాఖ నగరంలోని నాలుగు సీట్లూ టీడీపీ గెలుచుకుంది. వైఎస్సార్సీపీ ఎంపీ కూడా చాలా తక్కువ మెజార్టీతో గట్టెక్కారు. అక్కడ గెలవాలంటే కచ్చితంగా జనాల్లో బాగా ప్రాచుర్యం ఉన్న వ్యక్తి కావాలి. అందుకే అంబటిని అక్కడ నుంచి బరిలోకి దింపే ఆలోచన చేశారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ఇప్పటికే విశాఖ తూర్పు ఇన్‌చార్జ్‌గా నియమించి ఆయనకు అసెంబ్లీ సీటు ఖాయం చేశారు. 2019 లెక్కల ప్రకారం విశాఖ పార్లమెంట్ పరిధిలో 18 లక్షల 25 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు మార్పులు చేర్పుల తర్వాత 20 లక్షలకు చేరి ఉండొచ్చు.  విశాఖ పార్లమెంట్ పరిధిలో రూరల్ ఓటర్లు చాలా తక్కువ. కేవలం 20 శాతం రూరల్ ఓటింగ్ ఉంటే అర్బన్ ఓటర్లు 80 శాతం ఉన్నారు. పార్లమెంట్ పరిధిలోని విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, గాజువాక, భీమిలి నియోజకవర్గాల్లో మొత్తం అర్బన్ ఓటింగే ఉంది. శృంగవరపు కోటలో మాత్రమే రూరల్ ఓటర్లు ఉన్నారు. 2019 జనసేన తరఫున జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేయడంతో టీడీపీ ఈ పార్లమెంట్ స్థానాన్ని కోల్పోయింది. కేవలం 2,875 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి మతుకుమిల్లి భరత్ ఓడిపోయారు. అసెంబ్లీ స్థానాల్లో టీడీపీకి 11 వేలకు పైగా మెజార్టీ వచ్చినా పార్లమెంట్ కు వచ్చే సరికే జేడీ లక్ష్మీనారాయణకు ఓట్లేశారు. 2019లో వైసీపీకి 35.7శాతం, టీడీపీకి 35.4, జనసేన 23.6శాతం ఓట్లు వచ్చాయి. జేడీ లక్ష్మీనారాయణ 2 లక్షల 87 వేల ఓట్లను సాధించారు. ఈసారి జనసేన - తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నాయి. 2019 లెక్కల ప్రకారమే చూసుకుంటే.. రెండు పార్టీల మధ్య కనీసం 20 శాతానికిపైగా ఓట్ల తేడా ఉంటోంది. అర్బన్ లో వైసీపీపై వ్యతిరేకత పెరిగింది కాబట్టి అధికంగా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఏ రకంగా చూసుకున్నా ఇది టీడీపీకి అడ్వాంటేజ్ ఉన్న సీటు..! వైఎస్సార్సీపీ లెక్క వేరే లాగా ఉంది. కిందటి సారి జనసేన అభ్యర్థిగా జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేశారు కాబట్టి అన్ని ఓట్లు వచ్చాయన్నది వాళ్ల అంచనా.. అదే జేడీ ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి మరోసారి వైజాగ్ లోనే పోటీ చేసే అవకాశాలున్నాయి. ఆ విషయం ఆయన ఇప్పటికే చెప్పేశారు. విశాఖ పార్లమెంట్‌లో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. భీమిలి, గాజువాకతో పాటు.. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో వాళ్ల నెంబర్ చాలా ఎక్కువ. అదే వర్గానికి చెందిన అంబటి పోటీ చేస్తే అడ్వాంటేజ్ ఉంటుందన్న ఆలోచన కూడా ఉంది. ఇక్కడ నార్త్ ఇండియన్ ఓట్లు కూడా కీలకం. వీళ్లు ఇంతకు మందు బీజేపీకి సపోర్టు చేసేవాళ్లు. బీజేపీ పోటీ నామమాత్రం అయింది కాబట్టి దేశవ్యాప్తంగా అందరికీ తెలిసిన రాయుడు లాంటి వాళ్లైతే వాళ్ల ఓట్లు సాధించొచ్చు అన్నఆలోచన కూడా ఉంది. అమరావతి ఎఫెక్ట్, సామాజికవర్గాల లెక్కలు తీసుకుంటే గుంటూరులో పోటీ కూడా అంత తేలికేం కాదు. పోయిన సారి జగన్ ప్రభావంలోనూ గల్లా జయదేవ్ నెగ్గుకు రాగలిగారు. అప్పుడు ఉన్నంత వైసీపీ గాలి ఇప్పుడు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరు కన్నా విశాఖ బెటర్ అని కూడా అంబటి భావించి ఉండొచ్చు. అందుకే జగన్ చెప్పిన దానికి ఆయన ఓకే అన్నారని టాక్ నడుస్తోంది.  

Related Posts