అనంతపురం, డిసెంబర్ 30,
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ను జగన్ పక్కన పెట్టారు. కనీసం అసెంబ్లీ సీటుకు కూడా ఆయన పేరు పరిగణించలేదు. గత ఎన్నికల ముందు అనూహ్యంగా తెరపైకి వచ్చిన మాధవ్ కు హిందూపురం ఎంపీ సీటు ఇచ్చారు. ఆయన అంచనాలకు అనుగుణంగా ఎంపీగా మాధవ్ గెలుపొందారు. అయితే గత ఐదేళ్లుగా మాధవ్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఆయన మార్పు అనివార్యంగా మారింది. అయితే ఇప్పుడు మాధవ్ ను తప్పించడంతో ఎవరు పోటీ చేస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే సరైన అభ్యర్థిని బరిలో దించేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.ఉమ్మడి అనంతపురం జిల్లాలో పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. సర్వేల్లో సైతం ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడే అభ్యర్థులపై వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్పు చేయాలని జగన్ భావిస్తున్నారు. హిందూపురం ఎంపీ స్థానంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా శాంత అనే మహిళను తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆమెతో పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆమె కర్ణాటక కు చెందిన శ్రీరాములు సోదరి. ఈయన గతంలో బిజెపి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా పని చేశారు. గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ సామ్రాజ్యంలో ఆయనది కీలక పాత్ర. 2009లో కర్ణాటక నుంచి తన సోదరి శాంతను ఎంపీగా పోటీ చేయించి గెలిపించుకున్న సందర్భాలు ఉన్నాయి.గాలి జనార్దన్ రెడ్డి, బళ్లారి శ్రీరాములు ఒకప్పుడు జగన్ వ్యాపార భాగస్వామ్యులేనని ఆరోపణలు ఉండేవి. గత రెండు ఎన్నికల్లో బళ్లారిలో కాంగ్రెస్ పార్టీ గెలుపు పొందుతూ వస్తోంది. ఇటీవల ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డి తో పాటు బళ్లారి శ్రీరాములు సామ్రాజ్యాలు కూలిపోయాయి. బిజెపి టిక్కెట్ రాదని తెలుసుకున్న గాలి జనార్దన్ రెడ్డి సొంత పార్టీ పెట్టుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఒక్కరే గెలిచారు. బళ్లారి నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేయాలని శ్రీరాములు భావిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే హిందూపురం అభ్యర్థి కోసం జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడే శాంత పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె ఎంపిక దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. ఇప్పటికే ఇతర అవసరాల కోసం రాజ్యసభ సీట్లను బయట రాష్ట్రాల వారికి కేటాయించారు. ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, పరిమళ్ నత్వానీ లకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా లోక్ సభ అభ్యర్థులను సైతం పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిని పార్టీలో సీనియర్లు తప్పుపడుతున్నారు.