శ్రీకాకుళం, జనవరి 2,
వైసీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు చేర్పులు సిక్కోలు ఎమ్మెల్యేలలో గుబులు పుట్టిస్తోంది. తాడేపల్లి నుంచి ఎప్పుడు ఎవరికి పిలుపు వస్తుందోనన్న టెన్షన్ నెలకొంది. దాదాపు ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను, పార్టీ ఇంఛార్జ్ లను మారుస్తారనే ప్రచారంతో ఉత్కంఠ రేగుతోంది.సిక్కోలులో అధికార పార్టీ రాజకీయాలు వేడెక్కాయి. కొత్త ఏడాదిలో అభ్యర్థులపు ప్రకటిస్తారనే ప్రచారం, చాలామంది సిట్టింగ్ లపై వేటు పడుతుందనే ఊహాగానాల మధ్య జిల్లాలో ఎవరెవరి సీట్లు గల్లంతు అవుతాయి అనే చర్చ ఎక్కువైంది. ముఖ్యంగా జిల్లాలో స్పీకర్ తమ్మినేని సీతారాంతో సహా నలుగురు ఎమ్మెల్యేలు, టెక్కలి ఇంఛార్జ్ ని మారుస్తారనే ప్రచారం హీట్ పుట్టిస్తోంది. సిట్టింగ్ ల స్థానంలో కొత్తగా ఎవరొస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. జిల్లాలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సిదిరి అప్పలరాజు, పాలకొండ ఎమ్మెల్యే కళావతి తప్ప మిగిలిన నాయకులు అందరూ డేంజర్ జోన్ లో ఉన్నట్లు వస్తున్న సమాచారంతో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలసలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. స్పీకర్ పై తిరుగుబాటు చేస్తున్న ఓ వర్గం ఎమ్మెల్యే టికెట్ ఆశతో చురుగ్గా పావులు కదుపుతోంది. జిల్లాలోనే సీనియర్ నేత అయిన సీతారాంని కాదని ఇక్కడ వేరే వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. స్పీకర్ సీతారాం గెలిచిన నాటి నుంచి ఆముదాల వలసలో పార్టీ మూడు గ్రూపులు ఆరు వర్గాలుగా విడిపోయింది. పార్టీ నేతలు సువ్వారీ గాంధీ, చింతాడ రవికుమార్, కోటా బ్రదర్స్ తో తమ్మినేనికి అస్సలు పొదగడం లేదు. వీరంతా తమ్మినేనికి సమాంతరంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో పార్టీ పెద్దలు ఇక్కడ ప్రత్యామ్నాయ నేతను అన్వేషిస్తోందని అంటున్నారు.ఇక ఆముదాల వలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో పరిస్థితి అగ్గి రాజేస్తోంది. ఇక్కడి ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పై తీవ్ర వ్యతికేత కనిపిస్తోంది. మళ్లీ ఎమ్మెల్యే టికెట్ ను కిరణ్ కుమార్ కు ఇస్తే తాము పని చేయలేము అని సీనియర్ నేతలు బల్లాడ జనార్దన్ రెడ్డి, జరుగుళ్ల శంకర్, పైడి శ్రీనివాస్, లుకలాపు అప్పలనాయడు తదితర నేతలు బహిరంగగా ప్రకటిస్తున్నారు.ఎమ్మెల్యేపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నియోజకవర్గానికి కొత్త ఇంఛార్జి వస్తాడనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావును ఎచ్చర్ల బరిలో దింపేందుకు అధిష్టానం ఆలోచిస్తోంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. పాతపట్నం నియోజకవర్గంలోనూ ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డి శాంతికి వ్యతిరేకంగా స్థానిక నేతలు గళం విప్పుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే.. నాయకులు, కార్యకర్తలను దూరం పెట్టేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉండగా మూడు మండలాల్లోని ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు ఎమ్మెల్యేపై తిరుగుబావుటా జెండా ఎగరేశారు. మళ్లీ ఎమ్మెల్యేగా రెడ్డి శాంతిని కొనసాగిస్తే పని చేసేది లేదని తెగేసి చెప్పేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే పీఏలే షాడో ఎమ్మెల్యేలుగా చెలామణి అవుతుండటంతో పరిస్థితి మరింత దిగజారుతోంది.ఎమ్మెల్యే రెడ్డి శాంతిని తప్పించడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కొత్తూరు ఎంపీపీ లోతుగడ్డ తులసి, తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్మన్ మామిడి శ్రీకాంత్, డీసీసీబీ మాజీ ఛైర్మన్ డోల జగన్ పాతపట్నం టికెట్ కోసం ప్రయత్నిస్తురనే ప్రచారం జరగుతోంది.ఇక వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నర్సన్నపేట, రాజాంలోనూ మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. నర్సన్నపేట ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసును ఈసారి శ్రీకాకుళం పార్లమెంటుకు పోటీ చేయించే ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు. ఈ స్థానంలో కృష్ణదాసు కుమారుడు డాక్టర కృష్ణ చైతన్యకు అవకాశం ఇస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.ఇక ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఉన్న రాజాం నియోజకవర్గంలో కూడా మార్పు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే కంబాల జోగులుకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఎవరికి టికెట్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో ప్రస్తుత ఇంఛార్జ్ లను మార్చే ఆలోచన కూడా ఉందని చెబుతున్నారు. ఈ రెండు స్థానాల్లో గెలుపు వైసీపీకి ప్రతిష్టాత్మకం. మరో విధంగా చెప్పాలంటే టెక్కలిలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఓడించాలనేది సీఎం జగన్ టార్గెట్. ఇచ్చాపురంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఒక్కసారి తప్ప ఎప్పుడూ ఓడిపోలేదు. దీంతో ఈ రెండు స్థానాల్లో గెలవాలంటే వైసీపీకి సరైన అభ్యర్థులు ఉండాల్సిందే. టెక్కలిలో ఇంఛార్జిగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను తొలుత ప్రకటించారు సీఎం జగన్.టెక్కలిలో అచ్చెన్నను ఓడిస్తాను అని దువ్వాడ కూడా శపథాల మీద శపథాలు చేశారు. కానీ, అనూహ్యంగా ఆయనకు ఇంటి పోరు ఎదురైంది. దువ్వాడ భార్య వాణి ఆయనకు ఎదురు తిరిగి తను ఇంఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. అదే కాదు రాష్ట్రంలో తాను ప్రకటిస్తున్న తొలి టికెట్ దువ్వాడ వాణియే అంటూ స్వయంగా ప్రకటించారు సీఎం జగన్.అయితే, భార్యభర్తల మధ్య ఇంటి గొడవ రచ్చకెక్కడం, ఒకరంటే మరొకరికి పొసగకపోవడంతో వాణిని కొనసాగిస్తారా? లేదా? అన్న అనుమానం మొదలైంది. టెక్కలి టికెట్ ను గతంలో పోటీ చేసిన తిలక్ తో పాటు ప్రస్తుతం ఈ నియోజకవర్గం ఇంఛార్జ్ గా జెడ్పీ ఛైర్ పర్సన్ పిరియా విజయ భర్త సాయి రాజ్ వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ సాయిరాజ్ పోటీ చేశారు. కానీ ఆయనకు పోటీగా మాజీ ఎమ్మెల్యే నరేశ్ కుమార్ అగర్వాల్, సీనియర్ నేతలు నట్టు రామారావు, నట్టు నరేందర్ టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో నరేశ్ కుమార్ అగర్వాల్ అలియాస్ లల్లూ మాత్రమే టీడీపీపై పైచేయి సాధించిన చరిత్ర ఉంది. దీంతో వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ నాయకత్వం ఇచ్చాపురం ఇంఛార్జిని మారుస్తుందా? అనే చర్చకు దారితీస్తోంది.మొత్తానికి గత ఎన్నికల్లో 8 చోట్ల గెలిచిన వైసీపీ ఈసారి భారీ మార్పులకు తెరతీసే అవకాశం కనిపిస్తుండటంతో ఎవరికి షాక్ తగులుతుంది? ఎవరికి లక్ వరిస్తుంది? అనేది ఉత్కంఠ రేపుతోంది.