విజయవాడ, జనవరి 2
వంగవీటి ఈ పేరు కృష్ణా జిల్లాలోనే కాదు యావత్ ఏపీలోనే ఈ కుటుంబానికి మంచి ఫాలోయింగ్ ఉంటుంది. వంగవీటి మోహన రంగ తనయునిగా వంగవీటి రాధాకు మాస్ ఇమేజ్ ఉంది. కమ్మ సామాజికవర్గాన్ని తీవ్రంగా ప్రభావితం చేయగలరన్న ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వంగవీటి రాధాను తిరిగి వైసీపీలోకి చేర్చుకునేందుకు జోరుగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం రాధాతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. వైసీపీలోకి తిరిగి రావాలని రాధాను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చ తరువాత తన నిర్ణయాన్ని మాత్రం మిథున్ రెడ్డితో పంచుకోలేదు. అంటే చేరతా అన్నట్లా.. లేక చేరనన్నట్లా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేగింది. పార్టీ వీడినప్పటి నుంచి రాధాను తిరిగి ఆహ్వానించేందుకు మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రయత్నం చేశారు. అయితే వీరి మాటలకు అప్పట్లో స్పందించలేదు రాధా. అయితే ఈ సారి వంగవీటి రాధాతో పాటు కాపు సామాజిక వేత్త ముద్రగడ పద్మనాభంను కూడా వైసీపీలోకి తీసుకురావాలని భావిస్తున్నారు పార్టీ నేతలు. దీనిపై చర్చలు కూడా జరుగుతున్నాయి. ఆయన పార్టీలో చేరుతారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాధా కూడా చేరే అవకాశాలు ఉన్నాయాన్న అనుమానం చాలా మందిలో కలుగుతోంది.వంగవీటి రాధా రాజకీయ ప్రస్థానం ఒకసారి చూసినట్లయితే..2004 లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో చేరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో దిగి ఓటమి చవిచూశారు. ఆపై వైసీపీ కండువాకప్పుకుని 2014 ఎన్నికల్లో తిరిగి తూర్పు నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. అయితే టీడీపీ అభ్యర్ధి బోండా ఉమామహేశ్వర రావు చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరిన రాధా పోటీకి దూరంగా ఉండి.. అప్పటి పార్టీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు. మొన్న జరిగిన లోకేష్ పాదయాత్రలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ఈయనకు కృష్ణాజిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేసినా టికెట్ ఇస్తామని హామీ ఇచ్చింది.ఇక ఒకానొక సమయంలో జనసేనలోకి కూడా వెళ్తారన్న వార్తలు వినిపించాయి. నాందెండ్ల మనోహర్.. వంగవీటి రాధాతో చర్చలు జరిగినట్లు ప్రచారం సాగింది. అయితే తాజాగా మిధున్ రెడ్డి వెళ్లి కలవడం రాజకీయంగా కొంత ఆసక్తి నెలకొంది. ఆయన వైసీపీలోకి తిరిగి వస్తారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. దీనికి కారణం వైసీపీ ఆయనను బయటకు పంపించలేదు. ఆయనే కావాలని వెళ్లిపోయారు. పార్టీ వీడే ముందు కూడా సీఎం జగన్, రాధాకు టీడీపీతో జాగ్రత్తగా ఉండమని సూచించారు. ఈ వార్తలు కూడా అనేక మాధ్యమాల్లో ప్రసారం అయ్యాయి. పైగా గతంలో రాధాపై రిక్కీ నిర్వహించారన్న ప్రచార నేపథ్యంలో కొడాలి నాని జగన్ ను కలిసి రాధాకు భద్రత ఇవ్వాలని కోరారు. దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం జగన్ గన్ మెన్లను ఇచ్చేందుకు సిద్దమైంది. అయితే రాధా దీనిని తిరస్కరించారు. తనకు ఎలాంటి భద్రత అవసరం లేదన్నారు. అంటే రాధా పార్టీ వీడినా ఆయనను వెన్నంటే ఉంటూ మంచి చేసే కార్యక్రమాలకు వైసీపీ పూనుకుంది. దీంతో పార్టీతో ఎలాంటి విభేదాలు లేవు.. కేవలం చిన్నపాటి అసంతృప్తే అన్నది స్పష్టం అవుతోంది. దీంతో రాధా వైసీపీలో చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై మాస్ లీడర్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.