YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బెజవాడ బ్రదర్స్ స్వయంకృత ఆపరాధం

బెజవాడ బ్రదర్స్ స్వయంకృత ఆపరాధం

విజయవాడ, జనవరి 4,
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేస్తోన్న ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఝలక్ ఇచ్చారు. ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరి టిక్కెట్ గల్లంతైతే మరొకరికి స్థాన చలనం తప్పలేదు. దీనికి వారి స్వయంకృతమే కారణమని ప్రచారం జరుగుతోంది. వైసీపీ నియోజక వర్గాల సమన్వయకర్తల మార్పులు చేర్పుల్లో విజయవాడలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ను సెంట్రల్‌ నియోజక వర్గానికి మార్చారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు టిక్కెట్ నిరాకరించారు. టిక్కెట్‌ దక్కిన వెల్లంపల్లికి సంతోషం దక్కలేదు. సీటు కోల్పోవడంతో మల్లాది విష్ణుకు భంగపాటు తప్పలేదు.మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఇద్దరు 2009 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. విష్ణు కాంగ్రెస్‌ పార్టీ తరపున గెలిస్తే, వెల్లంపల్లి ప్రజారాజ్యం నుంచి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2014ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. 2019లో ఇద్దరు మళ్లీ వైసీపీ నుంచి గెలిచారు. సామాజిక సమీకరణల్లో భాగంగా వెల్లంపల్లికి మంత్రి పదవి కూడా దక్కింది. విష్ణు కూడా మంత్రి పదవి ఆశించినా బ్రహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కతుందని భావించినా నిరాశ తప్పలేదు.వెల్లంపల్లి, మల్లాది విష్ణులపై విజయవాడలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. మంత్రి పదవి దక్కిన తర్వాత వెల్లంపల్లి సొంత సామాజిక వర్గం తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు.రకరకాల కారణాలతో విజయవాడ వ్యాపార వర్గాల్లో వెల్లంపల్లిపై అసంతృప్తి పెరిగిపోయింది. సొంత సామాజిక వర్గంపై వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి.ఇక అవినీతి ఆరోపణలు ఉన్న వారిని ప్రోత్సహించడం, నామినేటెడ్ పదవుల్లో క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడే వారికి చోటు కల్పించడం, కాల్‌ మనీ వ్యాపారాలు చేసే వారికి అండగా నిలవడం వంటి విమర్శలు తీవ్రమయ్యాయి. నాలుగున్నరేళ్లలో నియోజక వర్గంలో పెద్దగా అభివృద్ధి చేయలేకపోవడం మైనస్‌గా మారింది.టౌన్‌ ప్లానింగ్‌ విభాగాన్ని చెప్పు చేతల్లో పెట్టుకుని నిర్మాణదారులపై వేధింపులకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి.కార్పోరేషన్‌లో చీఫ్‌ ప్లానర్‌గా సుదీర్ఘ కాలం తన అనుచరుడిని ఉంచడం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.వెరసి స్థానికంగా ఆయన గెలవడం ఖాయమని తెలిసి మరో నియోజక వర్గానికి మార్చాల్సి వచ్చిందని చెబుతున్నారు.విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. నగరంలో కార్పొరేషన్‌ కోట్ల రుపాయల ఖర్చుతో నిర్మించిన ఫుడ్‌ కోర్టులో స్టాళ్లకు అనుమతుల విషయంలో విష్ణుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. రైతు బజార్లలో స్టాళ్ల కేటాయింపులో సైతం ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నారని ప్రచారం జరిగింది. ఇళ్ల నిర్మాణం, టౌన్ ప్లానింగ్ అనుమతుల విషయంలో ఎమ్మెల్యే అనుచరుల తీరుతో సామాన్య ప్రజలు విసిగిపోయారు.ఇక కార్పొరేషన్‌లో ఆధిపత్య పోరు కూడా విష్ణుపై వ్యతిరేకత పెరగడానికి కారణం అయ్యింది. సెంట్రల్ నియోజక వర్గం పరిధిలోని డివిజన్ల కార్పొరేటర్లలో కొందరు నేరుగా వైసీపీ కీలక నేతల వ్యాపారాల్లో భాగస్వాములుగా ఉండటం కూడా విష్ణు అవకాశాలను గండికొట్టింది. గత ఎన్నికల్లో కేవలం 25ఓట్లతో గెలిచిన అభ్యర్థి కావడంతో ఈసారి గెలవడం కష్టమేనని భావించి టిక్కెట్ నిరాకరించినట్టు చెబుతున్నారు.

Related Posts