విశాఖపట్టణం, జనవరి 4,
ఏపీ పొలిటికల్ సర్కిల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్రోల్ అయినట్టు.. మరే నాయకుడు కాలేదు. కోడి ముందా? గుడ్డు ముందా? అన్న కామెంట్ తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అయ్యారు. అది మొదలు ఆయన ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతుంది. నేటిజెన్లకు ఆకట్టుకుంటుంది. ప్రతి అంశాన్ని విశ్లేషించి మాట్లాడినట్టే కనిపిస్తారు కానీ.. ఎందుకు అమర్నాథ్ అంటే ఒక రకమైన భావన ఏర్పడింది. చివరకు ఇంటర్వ్యూలు చేసేవారు సైతం ఆయన ఫీలింగ్స్ ను చూసి నవ్వుకోక తప్పడం లేదు. అయితే నిన్నటి వరకు వైసిపి లో అభ్యర్థుల మార్పు విషయంలో చాలా రకాలుగా మాట్లాడారు. మార్పు జాబితాలో తన పేరు ఉండేసరికి ఆయనకు నోట మాట రావడం లేదు. కక్కలేక .. మింగలేని పరిస్థితి ఆయనది.అనకాపల్లి కి కొత్తగా భరత్ కుమార్ అనే నేతను ఇన్చార్జిగా నియమించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ కన్ఫర్మ్ అయినట్టే. అయితే అమర్నాథ్ ను గాలిలో పెట్టారు. కనీసం ఎంపీగానో, పక్క నియోజకవర్గం ఇన్చార్జిగానో నియమించలేదు. అనకాపల్లిలో తన పరిస్థితి బాగాలేదని అమర్నాథ్ కు సైతం తెలుసు. ప్రభుత్వంతో పాటు తనపై వ్యతిరేకత పెరిగిందని.. వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని కూడా తెలుసు.అయినా సరే అతడు సినిమాలో బ్రహ్మానందం చేసే అతి మాదిరిగా చాలా విన్యాసాలు చేశారు. తనకు తాను బలవంతుడునని చెప్పే ప్రయత్నం చేశారు. నిన్నటికి నిన్న దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేస్తే ఎగతాళి చేసి మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా తనకు ఒక నియోజకవర్గం లేకుండా పోవడంతో ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయ్యారు.అమర్నాథ్ చోడవరం, ఎలమంచిలి వంటి నియోజకవర్గాల పై ఆశలు పెట్టుకున్నారు. కానీ అక్కడ సీనియర్లు కరణం ధర్మశ్రీ, కన్నబాబు రాజులు ఉన్నారు. వారిని తప్పించి అమర్నాథ్ కు ఇవ్వడం వృధా ప్రయాస అన్నది జగన్ కు తెలిసినట్లు ఉంది. అందుకే హోల్డ్ లో పెట్టారు. కనీసం ఎక్కడ ఛాన్స్ ఇస్తారో కూడా హింట్ ఇవ్వలేదు. ఇప్పుడు అనకాపల్లి కి దూరం కావాల్సి వచ్చింది. సొంత నియోజకవర్గానికి కానివాడిగా మారిపోయారు. పోనీ చోడవరంలో వేలు పెడితే ధర్మశ్రీ ఊరుకోరు.. ఎలమంచిలి లో పెడితే కన్నబాబు రాజు కస్సుబుస్సు లాడుతారు. దీంతో కుడితి లో పడ్డ ఎలక మాదిరిగా అమర్నాథ్ పరిస్థితి అయిపోయింది.అమర్నాథ్ కు అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది. అది కూడా ప్రకటన లేదు. అటు చోడవరం, ఇటు ఎలమంచిలి సీట్లు మారుస్తారని ప్రచారం జరిగినా.. అందులో కూడా స్పష్టత లేదు. అసలు మార్చే ఉద్దేశం ఉందా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. దీంతో అమర్నాథ్ పరిస్థితి ఏమిటన్నది ఆయనకే తెలియడం లేదు. ఈ పరిస్థితి వస్తుందని తెలియక మార్పుల విషయంలో లేనిపోని మాటలు అనేశారు. గొప్పలకు పోయారు. పైగా దాడి వీరభద్ర రావు లాంటి సీనియర్లకే సలహా ఇచ్చారు.. టికెట్లు రాని వాళ్ళు వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవాలని ఉచిత సలహా ఇచ్చారు. తనకు టిక్కెట్ రాకపోయినా పర్వాలేదు.. ఊరు రా వైసిపి జెండా పట్టుకుని తిరుగుతానని పెద్ద పెద్ద మాటలు అనేశారు. ఇప్పుడు మార్పు జాబితాలో తన పేరు ఉండడంతో కుక్కటి పేనుల అమర్నాథ్ మౌనాన్ని ఆశ్రయించారు.