ఈ వేసవిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రెండేళ్ల తర్వాత తిరిగి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ చేరడం క్రికెట్ ఫ్యాన్స్‌కు అసలైన మజానిచ్చింది. ఆదివారం చెన్నై, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ వ్యూయర్‌షిప్ పరంగా వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది. బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న సన్‌రైజర్స్, బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ధోనీ సేన మధ్య జరిగిన పోరు కావడంతో.. రికార్డు స్థాయిలో ప్రేక్షకులు ఆ మ్యాచ్ చూశారు. హాట్ స్టార్ మొబైల్ యాప్, వెబ్‌సైట్ ద్వారా ఏకంగా ఒకేసారి 10 మిలియన్ల మంది ఫైనల్ మ్యాచ్ వీక్షించారు. హాట్ స్టార్ ద్వారా మ్యాచ్ చూసిన వారిలో ఎక్కువ మంది మొబైల్ ఫోన్లలో మ్యాచ్ చూసిన వారే కావడం విశేషం. ఒకేసారి ఎక్కువ మంది చూసిన మ్యాచ్‌గా ఐపీఎల్ ఫైనల్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది. అంతకు ముందు సన్‌రైజర్స్, చెన్నై మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌కు హాట్‌స్టార్‌లో 8.4 మిలియన్ల వ్యూయర్‌షిప్ లభించింది. ఈ రికార్డును ఫైనల్ మ్యాచ్ బ్రేక్ చేసింది. ఇంతకు ముందు ఏక కాలంలో ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో వీక్షించిన ఈవెంట్‌గా ఆస్ట్రియాకు చెందిన ఫెలిక్స్ బౌంగర్ట్‌నర్ స్కైడైవింగ్ చేస్తున్న వీడియో రికార్డ్ నెలకొల్పింది. 2012 అక్టోబర్లో స్టార్టోఆవరణం నుంచి హీలియం బెలూన్ సాయంతో ఫెలిక్స్ భూమ్మీదకు దూకాడు. ఈ వీడియోను యూట్యూబ్‌లో ఒకేసారి 8 మిలియన్ల మంది వీక్షించారు.