YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాలినేనికి జగన్ మార్క్ వార్నింగ్

బాలినేనికి జగన్ మార్క్ వార్నింగ్

ఒంగోలు, జనవరి 19,
ఎట్టకేలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎం జగన్ ను కలుసుకున్నారు. గత కొంతకాలంగా సీఎంను కలిసేందుకు బాలినేని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మూడు రోజులు పాటు విజయవాడలో హోటల్ లో ఉండి సీఎంను కలిసేందుకు బాలినేని ప్రయత్నించారు. కానీ అపాయింట్మెంట్ లభించకపోవడంతో అసంతృప్తితో హైదరాబాద్ వెళ్ళిపోయినట్లు వార్తలు వచ్చాయి. చివరకు సంక్రాంతి వేడుకలకు సైతం సొంత నియోజకవర్గం ఒంగోలుకు దూరమయ్యారు. ఇటువంటి తరుణంలో సీఎం జగన్ అపాయింట్మెంట్ లభించడం బాలినేనికి ఉపశమనం కలిగించే విషయమే.రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి బాలినేని వెంటబెట్టుకుని ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లారు. అయితే తనను కలిసిన బాలినేనికి జగన్ షాక్ ఇచ్చారు. వాసన్న ఎలా ఉన్నావ్ అంటూ ప్రశ్నించారు. ఒంగోలు నుంచి పోటీకి దిగుతావా? గిద్దలూరు వెళ్తావా? అని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే బాలినేని నీళ్లు నములుతూ మాగుంట శ్రీనివాసులు రెడ్డి విషయాన్ని ప్రస్తావించారు. ఆయన ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని చెప్పేలోగా.. ఆయన గురించి ఎందుకబ్బా? ఆయన గురించే మాట్లాడేందుకు వచ్చావా? ఆయన గురించి అయితే మాటలు ఏమీ వద్దు.. మాగుంట ప్రస్తావన ఎందుకు? నీ సంగతి చెప్పు అని తేల్చి చెప్పినట్లు సమాచారం.ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ విషయంపై స్పష్టత కావాలని బాలినేని కోరినట్లు సమాచారం. ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం సేకరించిన భూమికి రూ.170 కోట్లు పరిహారంగా ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బులు ఇచ్చాకనే ఒంగోలులో పోటీ చేస్తానని నేను ప్రకటించా. ఆ డబ్బు ఇంతకుముందు ఇస్తామన్నారు అని చెప్పగా… డబ్బులు ఇస్తే ఒంగోలులో చేస్తావ్.. లేదంటేగిద్దలూరు వెళ్తావు కదా?.. ఆ డబ్బులు సంగతి చూద్దాం.. రెండు రోజుల్లో ఈ విషయంపై స్పష్టతనిస్తానని జగన్ తేల్చి చెప్పినట్లు సమాచారం.అయితే సీఎం జగన్ వ్యవహార శైలి చూసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాగుంట శ్రీనివాసుల రెడ్డికి సీటు లేదని ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు. సీఎం జగన్ అసహనంగా ఉన్నారంటే పరిస్థితి చేయి దాటి పోయిందని బాలినేని గ్రహించారు. ఇప్పుడు బాలినేనిది కక్కలేక మింగలేని పరిస్థితి. ఇప్పటికే మాగుంట టిడిపి వైపు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే బాలినేనికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకవైపు వైసీపీ హై కమాండ్ సహకారం లేకుండా పోవడం, మరోవైపు ప్రజా వ్యతిరేకతతో ఒంగోలులో ఓటమి ఖాయమని బాలినేని భయపడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఇళ్ల పట్టాల భూమికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారా? చేయరా? అన్న అనుమానం కూడా వెంటాడుతోంది. ఇప్పుడు బాలినేనికి ఏం చేయాలో పాలు పోవడం లేదు.

Related Posts