కడప, జనవరి 19,
ఏపీ పీసీసీ చీఫ్ గా త్వరలోనే బాధ్యతలు తీసుకునేందుకు వైఎస్ షర్మిల సిద్ధమవుతున్నారు. ఈ నెల 22 తర్వాతే ఆమె బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వైఎస్ఆర్ సమాధి సందర్శించి బాధ్యతలు తీసుకోనున్నారు షర్మిల. కడపకు వెళ్లే సమయంలో భారీ బలప్రదర్శన చేయాలని యోచిస్తున్నారు. పార్టీల సీనియర్లను అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఎంపికైన షర్మిల.. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 22న బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధం చేసుకుంటున్నారు. ఈలోగా మరోసారి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలిసి, తేదీని ఫిక్స్ చేసుకునే దిశగా వైఎస్ షర్మిల యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. అయితే, విజయవాడలో ఆంధ్రరత్న భవన్ లో పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడానికి ముందుగానే వైఎస్ఆర్ స్మృతివనం దగ్గరికి వెళ్లి వైఎస్ ఘాట్ కి నివాళి అర్పించనున్నారు షర్మిల. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఒక్క కడప జిల్లా నుంచే కాకుండా పక్కనే ఉన్న కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి కూడా భారీగా జనసమీకరణ చేయటానికి, భారీ ప్రదర్శనగా వైఎస్ఆర్ సమాధి దగ్గరికి వెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు షర్మిల.పీసీసీ అధ్యక్షురాలిగా ఎంపికయ్యాక మొదటి కార్యక్రమానికి భారీ జనసమీకరణ చేపట్టాలనే నిర్ణయానికి షర్మిల వచ్చారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని తన సన్నిహితులతో చెప్పారు షర్మిల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎదిగిన విధానం, ఒక సామాన్య కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఏ విధంగా ఎదిగారు? ఎంతమందిని రాజకీయపరంగా పైకి తీసుకొచ్చారు? అనే అంశాలను మరోసారి షర్మిల గుర్తు చేసుకునే అవకాశం ఉంది.దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లను తనదారిలోకి తీసుకొచ్చే దిశగా షర్మిల వ్యూహం రచిస్తున్నారు. షర్మిలకు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వొద్దు అని హర్షకుమార్ లాంటి కొంతమంది సీనియర్లు బహిరంగంగానే ప్రకటనలు చేసిన సంగతి తెలిసిందే. అలాంటి అసంతృప్తవాదులను, సీనియర్లను తన దారిలోకి తెచ్చుకునేలా, తనపై ఉన్న వ్యతిరేకతను పూర్తిగా పొగొట్టుకునేలా షర్మిల యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. వారితో కలిసి ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా అడుగులు వేయటానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకున్నారు షర్మిల