విజయవాడ, జనవరి 20,
కృష్ణా జిల్లాలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీలో నేతలు పక్క చూపులు చూస్తున్నారు. టిక్కెట్లు దక్కని వారు పక్క పార్టీలోకి వెళ్లాలని డిసైడ్ అవుతున్నారు. ఇప్పటికే పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టిడిపిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 21న చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అయితే ఆయన ఒక్కరే వస్తారా? లేకుంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలను తన వెంట తెస్తారా? అన్న చర్చ బలంగా జరుగుతోంది.కొలుసు పార్థసారధి సీనియర్ నేత. రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా మంత్రిగా వ్యవహరించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తారు అన్న పేరు ఉంది. అందుకే పార్థసారధిని క్యాబినెట్ లోకి తీసుకోలేదు. అప్పటినుంచి ఆయన అసంతృప్తి గానే ఉన్నా.. పార్టీలో సర్దుకొని ముందుకు సాగారు. కానీ ఇప్పుడు టిక్కెట్ నిరాకరించడంతో మనస్తాపానికి గురయ్యారు. ఆయన స్థానంలో మంత్రి జోగి రమేష్ కు బాధ్యతలు అప్పగించడానికి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే టిడిపిలో చేరి జగన్ అహంకారానికి గట్టి దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. తాను ఒక్కడినే కాకుండా.. వీలైనంత ఎక్కువమందిని టిడిపిలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఆదిశగా ప్రయత్నాలు చేస్తున్నారుఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పులుసు పార్థసారధిని కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసిపి ఆవిర్భావం నుంచి కృష్ణమూర్తి పని చేస్తున్నారు. ఆయనకు సరైన గుర్తింపు లభించలేదు. ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. కానీ అది అమలు చేయలేకపోయారు. టీటీడీ చైర్మన్ గా కూడా కృష్ణమూర్తి పేరు వినిపించింది. అటు రాజ్యసభ సీటు కూడా కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్సీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కృష్ణమూర్తి మాత్రం తనకు గురజాల టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. కానీ జగన్ నుంచి సానుకూల స్పందన రాలేదు. అటు టిడిపిలో చేరాలని నిర్ణయించుకున్న కొలుసు పార్థసారధిని కృష్ణమూర్తి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. టికెట్ ఇవ్వకుంటే మాత్రం పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు జంగా కృష్ణమూర్తి సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు ఏలూరు జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా సైతం వీరిని కలవడం విశేషం. ఈయన కూడా వైసీపీలో టికెట్ దక్కలేదు. అయితే ఈ పరిణామాలు చూస్తుంటే పార్థసారథి పెద్ద నెట్వర్క్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీలోని అసంతృప్తవాదులను టిడిపిలోకి తీసుకెళ్లేందుకు పెద్ద ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.