YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పాత నేతలకు ప్యాకప్....

పాత నేతలకు ప్యాకప్....

తిరుపతి, జనవరి 20,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఈసారి గెలుపు అత్యంత అవసరం. ఇప్పుడు గెలవకపోతే ఇక పార్టీ మనుగడ కూడా కష్టమే. ఈ పరిస్థితుల్లో ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీస్ ఈసారి ఎన్నికల్లో కొన్ని కఠిన నిర్ణయాలనే తీసుకుంటారని చెబుతున్నారు. గెలుపు ఆధారంగానే టిక్కెట్లు ఉంటాయని చెబుతున్నారు. ఫ్యామిలీ ప్యాకేజీలు, సీనియారిటీ, లాయల్టీని పక్కన బెట్టి రియాలిటీ వైపు మొగ్గు చూపుతారంటున్నారు. అందుకోసం సీనియర్ నేతలను కూడా ఈసారి పక్కన పెట్టే అవకాశాలున్నాయి. అందుకోసమే ఆయన అనేక రకాలుగా కసరత్తులు చేస్తున్నారు. సర్వేలతో మాత్రమే కాకుండా లోకల్ క్యాడర్ నుంచి ఫీడ్ బ్యాక్ కూడా చంద్రబాబు తీసుకుంటున్నారు.అందుకే ఈసారి గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్లని.. పార్టీని కష్టకాలంలో అంటిపెట్టుకున్నారని.... జెండా కోసం ఎక్కువ ఖర్చు చేశారని.. ఇవన్నీ ట్రాష్ అని చంద్రబాబు డిసైడ్ అయినట్లుంది. అందుకే ఇప్పటి వరకూ ఎవరికీ చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వలేదు. చివరి నిమిషంలో ఎన్ఆర్ఐలతో పాటు యువకులను పెద్ద సంఖ్యలో బరిలోకి దించుతారన్న సమాచారంతో ఇప్పుడు సీనియర్ నేతలలో టెన్షన్ మొదలయింది. చింతమనేని ప్రభాకర్ వంటి నేతలపైనా అసమ్మతి తీవ్ర స్థాయిలో సొంత పార్టీ క్యాడర్ నుంచి వ్యక్తం అవుతుండటంతో కొత్త వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారని తెలిసింది.వైసీపీ అధినేత జగన్ ముందుగానే అభ్యర్థుల జాబితాను ప్రకటించుకుంటూ వెళుతున్నారు. అది ఒకరకంగా తనకు మంచిదేనని చంద్రబాబు భావిస్తున్నారు. ప్రధానమైన వైసీపీ తన అభ్యర్థులను ప్రకటించిన తర్వాత టీడీపీలో టిక్కెట్ దక్కకపోయినా వారు పార్టీలో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. వైసీపీలోకి వెళ్లినా అక్కడ పెద్దగా హామీ లభించదు. అందుకే కొంత నిదానంగానైనా అభ్యర్థులను ప్రకటించడం మంచిదని చంద్రబాబు మనసులో ఉంది. అందుకే ఇప్పటి వరకూ ఆ తేనెతుట్టను కదలించలేదు. కానీ కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో మాత్రం ఆయన ముందుగానే ఒక స్పష్టత వచ్చినట్లు సమాచారం. అక్కడ అభ్యర్థులకు సిద్ధంగా ఉండాలని కూడా సందేశం పంపుతున్నట్లు తెలిసింది సీనియర్లను పక్కన పెట్టి వారిలో కొందరిని పార్టీ సేవలకు ఉపయోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగే కొందరికి మాత్రం తాము అధికారంలోకి వస్తే శాసనమండలి లేదా రాజ్యసభ పదవి ఇస్తామన్న హామీ ఇవ్వనున్నారు. చంద్రబాబు కూడా జగన్ లాగే ఉండేవాళ్లు ఉంటారు.. వెళ్లే వాళ్లు వెళతారు అని డిసైడ్ అయిపోతున్నారు. పాత వాళ్లకు సీట్లు ఇచ్చినంత మాత్రాన గెలుస్తారన్న గ్యారంటీ లేనప్పుడు కొత్తవారిని తెచ్చి ప్రయోగం చేయడమే మంచిదన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు. అందుకే జగన్ తరహాలోనే చంద్రబాబు కూడా ఎక్కువ మంది పాత, సీనియర్ నేతలను పక్కన పెట్టే అవకాశాలున్నాయి. మరి జాబితా విడుదలయిన తర్వాత కానీ తెలుగు తమ్ముళ్లకు అసలు సంగతి తెలియదు. అప్పటి వరకూ అంతే.

Related Posts