విశాఖపట్నం
అల్లూరి జిల్లా అరకు నియోజకవర్గంలో నిర్వహిస్తోన్న రా కదలిరా బహిరంగసభకు చంద్రబాబు విశాఖ నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో బయలుదేరారు. కానీ, రూట్ విషయంలో పైలట్ అయోమయానికి గురయ్యారు. ఏటీసీ సూచనలను పైలట్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడంతో సమస్య ఏర్పడింది. హెలీకాప్టర్ రాంగ్ రూట్లో వెళ్తున్నట్లుగా గుర్తించిన ఏటీసీ వెంటనే పైలట్ను అప్రమత్తం చేసింది. దీంతో హెలికాప్టర్ను పైలట్ తిరిగి విశాఖకు తీసుకొచ్చారు.మళ్లీ వెనక్కి వచ్చి నిర్దేశించిన మార్గంలో అరకు బయలుదేరిన హెలికాప్టర్.. సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది. ఈ ఘటనతో కొద్దిసేపు ఉత్కంఠ నెలకుంది. హెలికాప్టర్ నడిపిన పైలట్, ఏటీసీ సిబ్బందికి మధ్య సమన్వయలోపం వల్లే ఇలా జరిగింది.విశాఖకు విమానంలో చేరుకున్న చంద్రబాబు.. అక్కడ నుంచి అరకు వెళ్లేందుకు హెలికాప్టర్ సిద్ధం చేసుకున్నారు. వాయుమార్గంలో ప్రయాణానికి సమీపంలోని విమానాశ్రయ ఏటీసీ క్లియరెన్స్ తప్పనిసరి.. దీంతో వారిచ్చిన రూట్ మ్యాప్ ప్రకారం అరకు వెళ్లేందుకు హెలికాప్టర్ బయలుదేరింది.కానీ, పైలట్ కొంత గందరగోళానికి గురి కావడంతో నిర్దేశిత మార్గంలో కాకుండా వేరే దారిలో హెలికాప్టర్ ప్రయాణించింది. ఈ విషయాన్ని తక్షణమే గుర్తించిన ఏటీసీ.. పైలట్ను హెచ్చరించింది. ఏటీసీ సూచనలతో వెనక్కి మళ్లించిన పైలట్.. తిరిగి సరైన మార్గంలో చాపర్ను తీసుకెళ్లారు. విశాఖ మన్యంలో మావోయిస్టుల ప్రాబల్యం, చంద్రబాబు జడ్ ప్లస్ భద్రత ఉన్న నేత కావడంతో హెలికాఫ్టర్ దారి తప్పిందని తెలియడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. అయితే కాసేపటికే మళ్లీ సరైన దారిలోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.