కర్ణాటకలో బీజేపీని నిలువరించడానికి కూటమిగా ఏర్పడి గద్దెనెక్కిన కాంగ్రెస్- జేడీఎస్‌ల మధ్య పదవుల పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ పంచాయితీ ఢిల్లీకి చేరడంతో సోమవారం కాంగ్రెస్ నేతలను కలుసుకుని చర్చించారు. ముఖ్యంగా ఆర్థిక శాఖ విషయంలో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు మంగళవారం నాటికి పదవుల పందేరం కొలిక్కి వస్తుందని కుమారస్వామి పేర్కొన్నారు. ఢిల్లీలోని గులాం నబీ అజాద్ నివాసంలో కాంగ్రెస్ నేతలతో కుమారస్వామి సోమవారం భేటీ అయ్యారు. దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన ఈ భేటీలో కీలకమైన ఆర్థిక శాఖ తమకే కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబట్టినట్టు తెలుస్తోంది. సంఖ్యా బలం ప్రకారం ఆ శాఖ తమకే దక్కాలని కాంగ్రెస్ నేతలు వాదించగా, ఈ విషయం గురించి జేడీఎస్ అధినేత దేవెగౌడతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని సీఎం కుమారస్వామి వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇక 2004లోనూ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్- జేడీఎస్ కూటమి మధ్య ఇలాంటి ఒప్పందమే జరిగిందని నేతలు గుర్తుచేస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్ నేత ధరమ్‌సింగ్ సీఎం పదవి చేపట్టగా, జేడీఎస్ తరఫున సిద్ధ రామయ్య డిప్యూటీ సీఎంతోపాటు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి విడిపోయిన తర్వాత 2006లో బీజేపీ మద్దుతుతో జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఈ సమయంలో కుమారస్వామి సీఎం పదవి చేపడితే, బీజేపీ నేత యడ్యూరప్ప డిప్యూటీ సీఎం అయ్యారు. అప్పుడు యడ్డీకి ఆర్థిక శాఖ బాధ్యతలను అప్పగించారు. అయితే ప్రస్తుతం ఇలా కుదరదని జేడీఎస్ వాదిస్తోంది. ఆర్థిక శాఖతోపాటు విద్యుత్, జల వనరులు, పంచాయితీ రాజ్ లాంటి కీలక శాఖలపై కూడా చర్చించారు. వీటిని కూడా తామే తీసుకుంటామని జేడీఎస్ అంటోంది. విద్యుత్, పంచాయితీ రాజ్ శాఖలను తన సోదరుడు రేవణ్ణకు అప్పగించాలని కుమారస్వామి యోచిస్తున్నారు. అయితే ఆ బాధ్యతలను తనకే అప్పగించాలని, సిద్ధ రామయ్య హయాంలో తానే ఆ శాఖను నిర్వహించానని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అంటున్నారు. జంతు సంరక్షణ, కార్మిక, మత్స్య, యువజన సర్వీసులు, మహిళ శిశు సంక్షేమ శాఖలను జేడీఎస్ తీసుకోవాలని, కీలకమైనవి తమకు అప్పగించాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ వాదన సమంజసం కాదని జేడీఎస్ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశాల నుంచి వచ్చిన తర్వాత, ఆయన్ని కలిసి కాంగ్రెస్ నేతలు తమ నిర్ణయం ప్రకటిస్తారని కుమారస్వామి పేర్కొన్నారు.