YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

రాంగ్ డైరక్షన్ లో గులాబీ పార్టీ

రాంగ్ డైరక్షన్ లో గులాబీ పార్టీ

హైదరాబాద్,  జనవరి 22,
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర కూడా కాలేదు. గట్టిగా నలభై రోజులు మాత్రమే అయింది. అయితే పదేళ్ల పాటు రెండు టర్మ్‌లు ప్రభుత్వం  నిర్వహించిన  బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం సమయం ఇవ్వాలనుకోవడం లేదు.  అనేక హామీలు ఇచ్చారని ఉన్న పళంగా అమలు చేయాలని విమర్శలు ప్రారంభించారు. ఆరు గ్యారంటీ హామీలను  వంద రోజుల్లో అమల్లోకి తెస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఉచిత బస్సు పథకాన్ని రెండు, మూడు రోజుల్లోనే అమల్లోకి తెచ్చేసింది. మిగతా పథకాల కోసం దరఖాస్తులు తీసుకుంది. ప్రస్తుతం అవి ప్రాసెస్‌లో ఉన్నాయి. ఏది ఏమైనా వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ తగ్గడం లేదు. రోజు రోజుకు విమర్శల వేడి పెంచుతూనే ఉన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా మరో పరీక్ష రాజకీయ పార్టీలకు ఎదురుగా ఉంది. అదే పార్లమెంట్ ఎన్నికలు. జమిలీ ఎన్నికలు వద్దనుకున్న కేసీఆర్ గతంలో ఆరు నెలల ముందుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది. అసెంబ్లీ ఎన్నిక్లలో ఓడిపోయిన వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కోవాల్సి వస్తోంది. గతం కంటే బీజేపీ మెరుగ్గా ఉంది. జాతీయ స్థాయి అంశాలపై ఓటింగ్ జరగడం ఖాయంగా మారింది. తెలంగాణ అంశాలు వెనుకబడిపోతున్నాయి. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చే సరికి జాతీయ అంశాలపై ఓటింగ్ జరగడంతో బీజేపీ నాలుగు సీట్లు గెల్చుకుంది. కాంగ్రెస్ కూడా మూడు సీట్లు గెల్చుకుంది. బీఆర్ఎస్ తొమ్మిది సీట్లకు పరిమితమయింది. ఈ సారి అధికారంలో లేదు. అప్పటికన్నా బీజేపీ ఇప్పుడు బలంగా కనిపిస్తోంది ఎనిమిది మంది  ఎమ్మెల్యేలు ఇప్పుడు బీజేపీకి ఉన్నారు.  కాంగ్రెస్ అధికారంలో ఉంది. రెండు జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ తన పోరాటాన్ని కొనసాగించడం అంత తేలిక కాదు. అసలు బీఆర్ఎస్ ప్రస్తావన లేకుండా  కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోలింగ్ సాగితే బీఆర్ఎస్ ఘోరమైన ఫలితాల్ని చూడాల్సి వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకే స్థానిక క్యాడర్ కాంగ్రెస్ బాట పడుతున్నారు. మన్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లో ఉన్న  క్యాడర్ అంతా కాంగ్రెస్ వైపు పరుగులు పెడుతున్నారు. వారిని ఆపడం బీఆర్ఎస్ పెద్దలకు సాధ్యం కావడం లేదు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గత ఎన్నికల్లో సాధించిన సీట్లు అయినా సాధించకపోతే బీఆర్ఎస్ పార్టీని ఫోర్స్ గా నడపడం సాధ్యం కాదు. వలసలు పెరిగిపోతాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ బీఆర్ఎస్ నేతల్ని పంచుకునే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ మళ్లీ పుంజుకోవడం కష్టమన్న్  భావనకు వస్తే ఆ పార్టీలోని నేతలంతా తలోదారి చూసుకుంటారు. అందుకే.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మెరుగైన ఫలితాల్ని సాధించాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే సమయం కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరాటం ప్రారంభించిందన్న వాదన వినిపిస్తోంది అప్పుడేనా అని కాంగ్రెస్ పార్టీ నుంచి.. ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా బీఆర్ఎస్ మాత్రం తగ్గకూడదని డిసైడయింది. ముప్పై యూట్యూబ్ చానళ్లు ఉంటే గెలిచేవాళ్లమని కేటీఆర్ అనుకున్నట్లుగా.. ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తప్పు జరగకూడదని పెద్ద ఎత్తున యూట్యూబ్ చానళ్లను రంగంలోకి దించుతున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ ను కూడా రంగంలోకి దించుతున్నారు. ముందు ముందు బీఆర్ఎస్ కార్యకర్తల్ని రోడ్లపైకి ఎక్కించే కార్యక్రమం కూడా ఉంటుందని  చెబుతున్నారు . పార్లమెంట్ ఎన్నికలకు మోర నెలన్నరలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మొదటి విడతలోనే ఎన్నికలు జరుగుతాయి. అంటే ఎలా చూసినా రెండు నెలల సమయం ఉంది. కాంగ్రెస్‌కు వంద రోజుల సమయం ఇస్తే ఆ లోపు లోక్ సభ ఎన్నికలు పూర్తయిపోతాయి. ఆ తర్వాత చేయగలిగిందేమీ ఉండదు. అందుకే  బీఆర్ఎస్ తొందరపడుతోంది.బీఆర్ఎస్ ఇప్పుడే కాంగ్రెస్ పై పోరాటం చేయడానికి.. ఆ పార్టీపై వ్యతిరేకత ఉందని చెప్పడానికి ప్రయత్నించేందుకు తొందరపడటానికి మరో కారణం కూడా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పది కన్నా తక్కువ లోక్ సభ సీట్లు సాధిస్తే.. ప్రజామోదం కోల్పోయిందని.. ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించి..
ప్రభుత్వాన్ని మార్చవచ్చన్న ఆలోచన కూడా బీఆర్ఎస్ కు ఉందంటున్నారు. బీజేపీ సహకారంతో ఇలాంటివి ఇతర ప్రభుత్వాల్లో జరిగాయి. అందుకే కాంగ్రెస్ ను వీలైనంత తక్కువ స్థానాలకు పరిమితం  చేయాలని అప్పుడే యుద్ధం ప్రారంభించారని అంటున్నారు. అయితే ప్రభుత్వానికి కనీస సమయం ఇవ్వకుండా.. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న  నేతలు పోరాటం ప్రారంభిస్తే ప్రజలు స్పందించ అవకాశాలు తక్కువగా ఉంటాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ బీఆర్ఎస్‌కు మరో మార్గం లేదు. ఎవరేమనుకున్నా యుద్ధరంగంలోకి దిగాల్సిందే. అదే చేస్తోంది.

Related Posts