YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వైసీపీకి వరుస షాక్ లు

వైసీపీకి వరుస షాక్ లు

కాకినాడ, జనవరి  22 
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ కి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. నేతలు వరుసబెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ గుడ్ బై చెబుతున్నారు. తెలుగుదేశం, జనసేన కండువాలు కప్పుకుంటున్నారు.  ఎప్పుడు ఎవరు వైసీపీకి ఝలక్ ఇస్తారో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ వైసీపీలో ఉన్న నాయకులు...రేపు ఉంటారో లేదో తెలియడం లేదు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందిన కీలక నేతలంతా ఒక్కొక్కొరుగా పార్టీని వీడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రీజినల్ కో-అర్డినేటర్లు నచ్చజెబుతున్నా పట్టించుకోవడం లేదు. కొందరికి సీఎంవో నుంచి పిలుపు వచ్చినా వెళ్లడం లేదు. కొందరు ముఖ్యమంత్రి జగన్ తో మాట్లాడిన తర్వాత కూడా పార్టీకి బై బై చెప్పేస్తున్నారు. మొన్న మాజీ మంత్రి పార్థసారథి, నిన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, తాజాగా శెట్టిబలిజ యాక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చారు. పార్టీకి రాం రాం చెబుతున్నట్లు సుభాష్ ప్రకటించారు. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.  అమలాపురానికి చెందిన వైసీపీ యువజన నేత, శెట్టిబలిజ యాక్షన్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సుభాష్ వైసీపీ రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నట్లు ప్రకటించారు. శనివారం 5వేల మంది అనుచరులతో ర్యాలీగా వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు వెల్లడించారు. జిల్లాలో మంత్రి విశ్వరూప్, మరికొంత మంది సొంత పార్టీ నేతలు అనేక ఇబ్బందులు పెట్టారని వాసంశెట్టి సుభాష్ వాపోయారు. ఇబ్బందుల పాల్జేసిన వారికి అసెంబ్లీ టికెట్ ఇవ్వొద్దని చెప్పినా...వైసీపీ హైకమాండ్ పట్టించుకోలేదన్నారు. జిల్లా పేరు మార్పుపై జరిగిన అల్లర్ల కేసులోనూ...తమ సామాజిక వర్గాన్ని ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరినా...హైకమాండ్ పట్టించుకోలేదన్నారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా పార్టీ నాయకత్వంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఎమ్మెల్యే ఎలిజా ఇప్పటికే పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.  వైసీపీ అధిష్ఠానం మోసం చేసిందని, వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. తాజాగా తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి తిరుగుబావుట ఎగురవేశారు. ఓ ఎంపీ చెప్పిన మాట విని...తనకు సీటు లేకుండా చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని, రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. మరోవైపు రెండోసారి అధికారంలోకి రావడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రూపొందిస్తున్నారు. నాలుగు జాబితాలను రిలీజ్ చేశారు. సర్వేల్లో రిపోర్టులు అనుకూలంగా లేకపోతే...ఒక్క ఛాన్స్‌ ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. గెలిచే వారికే టికెట్‌ అని చెప్పేస్తున్నారు.  అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రత్యర్థులు ఎత్తులు చిత్తయ్యేలా...కూటమికి ఝలక్‌ ఇచ్చేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా...మంత్రులయినా...మాజీ మంత్రులైనా...ఎంపీలయినా సరే...దుకాణం సర్దుకోవాల్సిందేనని ఖరాఖండిగా చెబుతున్నారు. ఎన్నికల బరిలోకి దించితే గెలుస్తున్నారా లేదా అన్న దానికే సీఎం జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారు.

Related Posts