విజయవాడ, జనవరి 23,
వైసీపీ నేతలకు లిస్టుల టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే నాలుగు జాబితాలు వచ్చేశాయి. నాలుగోదే ఫైనల్ లిస్టా? లేదంటే ఇంకెన్ని వస్తాయి? ఒకవేళ వస్తే తమ పేరు ఉంటుందా? ఊడుతుందా? ఇలా వైసీపీ ప్రజా ప్రతినిధులకు జాబితా గుబులు పట్టుకుంది. ఏ లిస్ట్ ఏ సీట్లకు ఎసరు పెడుతుందో తెలియడం లేదు.ఏపీలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎక్కడైతే ప్రక్షాళన అవసరమో అక్కడ నిర్మొహటంగా చేసుకుంటూ వెళ్తోంది. ఇప్పటికే నాలుగు లిస్టులు ప్రకటించిన పార్టీ హైకమాండ్. ఇదే ఫైనల్ లిస్ట్ అని అంతా భావించారు. కానీ, 5వ జాబితాపై ఫోకస్ పెట్టారు వైసీపీ పెద్దలు.వైసీపీ హైకమాండ్ లిస్టుల మీద లిస్టులు రిలీజ్ చేస్తుంటే.. కొందరు ఎమ్మెల్యేలు ఎక్కడ తమ సీటుకు ఎసరు వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. ఇప్పటివరకు 68 చోట్ల మార్పులు చేర్పులు చేపట్టారు. 58 స్థానాల్లో అసెంబ్లీ ఇంఛార్జ్ లను, 10 స్థానాల్లో పార్లమెంట్ ఇంఛార్జ్ లను ప్రకటించారు.ముందుగా ఊహించిన సీట్లే కాదు అసలు ఊహించని సెగ్మెంట్లలో కూడా మార్పులు జరిగిపోతున్నాయి. పార్లమెంటు, అసెంబ్లీ అన్న తేడా లేదు.. అవసరం అనుకున్న ప్రతీ చోట ఇంఛార్జిలు తారుమారు అవుతున్నారు. నా సీటుకి డోకా లేదు అనుకున్న వారికి కూడా తాడేపల్లి ఆఫీసు నుంచి పిలుపు వస్తోంది. పిలుపు వచ్చిందంటే చాలు మార్పు లేదంటే నో టికెట్. ఈ రెండే ఆప్షన్లు వినిపిస్తున్నాయి.ఇలా ఇప్పటికే 28మందికి టికెట్ ఇవ్వలేము అని తేల్చేశారు. మరికొందరిని మాత్రం వేరే సెగ్మెంట్ కు మార్చేశారు. మొదటి రెండు లిస్టుల్లో అనుకున్న చోట్ల మార్పులు జరిగాయి. ఇక మూడు, నాల్గొవ జాబితాలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పెడన లేదా మైలవరం వస్తుంది అనుకున్న జోగి రమేశ్ కు పెనమలూరు టికెట్ ఇచ్చి షాక్ ఇచ్చారు.ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణ స్వామికి ఎవ్వరూ ఊహించని విధంగా చిత్తూరు ఎంపీ టికెట్ కట్టబెట్టారు. చిత్తూరు ఎంపీగా ఉన్న ఎన్ రెడ్డప్పకు గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం బాధ్యతలు అప్పజెప్పారు. ప్రస్తుతం హోం మినిస్టర్ గా ఉన్న వనితకు కూడా ట్రాన్సఫర్ తప్పలేదు. వనితను కొవ్వూరు నుంచి గోపాలపురానికి మార్చేశారు.ఇన్నాళ్లూ ధీమాగా ఉన్న వైసీపీ నేతలు ఈ మార్పులు చేర్పులు చూసి కంగుతింటున్నారు. 5వ లిస్టులో మారినా మారొచ్చనే టెన్షన్ పడుతున్నారు. తమ ఫోన్ కు ఏ కాల్ వచ్చినా తాడేపల్లి ఆఫీసు నుంచి కావొచ్చని ఆందోళన చెందుతున్నారు కొందరు నేతలు. మరి మున్ముందు వైసీపీ హైకమాండ్ ఇంకెన్ని ట్విస్టులు ఇస్తుందో చూడాలి.