YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాజు వర్సెస్ రాజు

రాజు వర్సెస్ రాజు

ఏలూరు, జనవరి 23,
అది టీడీపీకి కంచుకోట నియోజకవర్గం. అలాంటి చోట ఇప్పుడు సీటు నీకా నాకా అంటూ వర్గపోరు సాగుతోంది. ఓవైపు సిట్టింగ్‌ ఎమ్మెల్యే.. మరోవైపు మాజీ ఎమ్మెల్యే టికెట్‌ నాదే అంటే నాదే అంటూ పోటీపడుతున్నారు. సీటు తమకే వస్తుందన్న ధీమాతో ఎవరికి వారు ప్రచారం సైతం ప్రారంభించారు. దీంతో ఎవరి వైపు ఉండాలో తెలియక కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ఇద్దరు నేతల మధ్య ఈ కోల్డ్‌ వార్‌ను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఇంతకీ ఆ సెగ్మెంట్‌ ఏది ? అక్కడ పోటీపడుతున్నా నాయకులెవరు ? తెలుసుకుందాం రండి.ఇది పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గం. 2019 వైసీపీ హవాలోనూ ఈ జిల్లాలో గెలిచిన రెండు నియోజకవర్గాల్లో ఇది ఒకటి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి మంతెన రామరాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన శివరామరాజు పార్టీ బలోపేతానికి తనదైన శైలిలో కృషి చేశారు. ఆయనకున్న ఫాలోయింగ్‌ను చూసిన పార్టీ అధిష్టానం.. 2019లో నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థిగా రంగంలోకి దింపింది. అయితే.. ఆ ఎన్నికల్లో శివరామరాజు ఓటమి పాలయ్యారు. అప్పుడు శివరామరాజు సూచనతోనే మంతెన రామరాజుకు ఉండి టికెట్‌ కేటాయించింది టీడీపీ అధిష్టానం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఆయన.. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక క్యాడర్‌ను తయారు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే.. మరోసారి ఉండి నుంచే పోటీచేసే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. తనకు బెర్త్‌ కన్ఫార్మ్‌ అయ్యిందని.. పోటీచేసేది తానేని ప్రకటించి ప్రచారం సైతం ప్రారంభించారుఇటీవలి కాలంలో ఇరువురు నేతల మధ్య అంతర్గతంగా పోరు మొదలైంది. ఉండి నుంచి మరోసారి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే… ఉండిలో శివరామరాజు ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్నే సిట్టింగ్‌ ఎమ్మెల్యే వాడుతూ వస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో తన పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సూచించడంతో.. ఎమ్మెల్యే మరోచోట టీడీపీ ఆఫీస్‌ను ఓపెన్‌ చేశారు. దీంతో ఏ కార్యాలయానికి వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు స్థానిక కార్యకర్తలు.మూడేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శివరామరాజు.. ఇటీవలి కాలంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గత ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ చేసినంత మాత్రాన తను సిట్టింగ్ కాకుండా పోనని.. ఉండి ప్రజల ఆశీర్వాదంతో ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేది తానేనని శివరామరాజు చెబుతున్నారు. మరోవైపు.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రామరాజు కూడా.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన ప్రణాళిక రచించుకుంటున్నారు. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని.. ఇప్పటికే ఒకసారి ఛాన్స్‌ ఇచ్చిన వారికి అవకాశమెలా ఇస్తారని మంతెన రామరాజు అంటున్నారు.మొత్తంగా ఉండి టీడీపీ రాజకీయం శివరామరాజు వర్సెస్‌ రామరాజు అన్న చందంగా మారడంతో వర్గపోరు తారస్థాయికి చేరింది. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఉండి నియోజకవర్గంలో కేడర్ విడిపోవడం వల్ల వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటని కార్యకర్తలు, అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.

Related Posts