ఒంగోలు, జనవరి 27,
వైసీపీ తరఫున వచ్చే ఎన్నికలకు సంబంధించి దాదాపు టికెట్లు దక్కించుకున్న నాయకులకు కునుకు పట్టడం లేదు. కొన్నాళ్ల కిందట వరకు.. తమకు టికెట్ దక్కుతుందా? లేదా? అని నాయకులకు నిద్ర పట్టేది కాదు. కానీ, ఇప్పుడు టికెట్ దక్కిన తర్వాత కూడా.. వారికి నిద్ర కరువవుతోంది. దీనికి కారణం.. కేడర్. వచ్చే ఎన్నికల్లో ఎంత ఉద్ధండుడైన నాయకుడైనా గెలుపు గుర్రం ఎక్కాలంటే.. కేడర్ సహకారం అవసరం. కానీ, ఆ కేడరే ఇప్పుడు వారికి సెగ పెడుతోంది. ఒకవైపు.. ప్రతిపక్షాల రగడతోనే ఇబ్బందులు పడుతున్న నాయకులకు సొంత కేడర్ కూడా సహకరించని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం.. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగులకు సీటు దక్కక పోవడం.. వారి చేతిలోనే కేడర్ ఉండడం.. వారంతా టికెట్లు ఆశించి భంగ పడడం... దీంతో కేడర్‌ను కనుసైగలతోనే శాసించి కొత్తవారికి సహకరించకుండా దూరం పెడుతున్న పరిణామాలు.. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో నూ కనిపిస్తున్నాయి. ఉదాహరణకు కొండపి లో మంత్రి ఆదిమూలపు సురేష్‌కు టికెట్ కన్ఫర్మ్ చేశారు. కానీ, ఇక్కడి కేడర్ అంతా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కనుసన్నల్లో పనిచేస్తోంది. కానీ, బాలినేని విషయంలో వైసీపీ వ్యవహారం వివాదంగా నడుస్తోంది. దీంతో కేడర్.. ఆదిమూలపు మాటను పట్టించుకో వడం లేదు. ఆయనకు టికెట్ ఇచ్చి.. పదిహేను రోజులు అయినా.. కేడర్ ఆయన సమావేశాలకు రావడం లేదు. దీంతో తాను నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఎర్రగొండపాలెం నుంచి ప్రత్యేక బస్సులు పెట్టి.. కేడర్‌ను తరలించుకునే పరిస్థితిలో మంత్రి ఉన్నారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే కమ్ మాజీ మంత్రి మేకతోటి సుచరిత ను తాడికొండకు బదిలీ చేశారు. ఈమె పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడి కేడర్.. మొత్తం ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కు, ప్రస్తుత ఎమ్మెల్యే శ్రీదేవి కి అనుకూలంగా రెండు వర్గాలుగా చీలిపోయింది. దీంతో సుచరితను ఎవరూ పట్టించు కోవడం లేదు. పోనీ.. ప్రత్తిపాడు నుంచి తెచ్చుకుందామన్నా.. అక్కడి నుంచి కూడా ఎవరూ రావడం లేదు. దీంతో నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలన్నా.. డ్వాక్రా సంఘాల మహిళలే దిక్కు అవుతున్నారు.అయితే.. మీడియా ఎఫెక్ట్‌తో వీరిని కూడా పిలవడం లేదు. ఇక, అరకు ఎంపీగా ఉన్న గొట్టేటి మాధవిని అరకు అసెంబ్లీకి పంపించారు. ఇక్కడ కూడా ఆమెకు ఇదే పరిస్థితి ఏర్పడింది. ఈమె కార్యక్రమాలకు ఎవరూ రాకపోగా.. ఆయా కార్యక్రమాల్లో వ్యతిరేక నినాదాలు చేస్తూ.. బ్యానర్లు కడుతూ.. కేడర్.. సెగ పుట్టిస్తోంది. సహకరించండి మహప్రభో అన్నా.. పట్టించుకునేవారు లేకుండా పోయారు. విజయవాడ వెస్ట్ లో.. షేక్ ఆసిఫ్‌కు టికెట్ ఇచ్చారు. కానీ, ఈయనది కార్పొరేటర్ స్థాయి. దీంతో ఆయనకు కీలక నేతలు దూరంగా ఉంటున్నారు. పైగా.. ఉదయం కార్యక్రమాలకు టిఫెన్ కూడా పెట్టడం లేదని.. ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడి ఎమ్మెల్యే కమ్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును సెంట్రల్ నియోజకవర్గానికి పంపించారు. అయితే.. చిత్రం ఏంటంటే.. వెల్లంపల్లికి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది. సెంట్రల్ నియోజకవర్గంకేడర్ అంతా.. ప్రస్తుత ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతిలోనే ఉంది. కానీ, ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన తన కేడర్‌ను కట్టడి చేశారు. ఫలితంగా మల్లాది వర్గం.. వెల్లంపల్లికి దూరం పాటిస్తోంది. దీనిని ఊహించిన వెల్లంపల్లి.. నేరుగా ఎమ్మెల్యే ఇంటి తలుపే తడుతున్నారు. ఆయనను ప్రసన్నం చేసుకుని.. కేడర్‌ను దరిచేర్చుకునేందుకు నానా ప్రయాస పడుతున్నారు. ఇలా..అనేకనియోజకవర్గాల్లో పరిస్తితి నాయకులకు కంటిపై కునుకు పట్టనివ్వడం లేదు. ఈ నేపథ్యంలో నేరుగా సీఎం జగన్ జోక్యం చేసుకోవాలన్నది వారి విన్నపం. కనీసం అప్పుడైనా కేడర్ లైన్‌లో పడుతుందని ఆశిస్తున్నారు.