YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హస్తం కైవసం అవుతున్న స్థానిక సంస్థలు

హస్తం కైవసం అవుతున్న స్థానిక సంస్థలు

మహబూబ్ నగర్, జనవరి 27,
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావంతో స్థానిక సంస్థల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఛైర్మన్లు, అధ్యక్షులుగా ఉన్న పురపాలికలు, మండల పరిషత్‌ల్లో అవిశ్వాస రాజకీయలు జోరందుకున్నాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినవారు, ప్రస్తుతం కాంగ్రెస్‌కు మద్దతు తెలిపేవారు పెరుగుతుండడంతో స్థానిక సంస్థలు ఒక్కొక్కటిగా హస్తం పార్టీ కైవసం అవుతున్నాయి.రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలోని స్థానిక సంస్థలు, మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల రచ్చ కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని కోస్గి మున్సిపాలిటీలో అవిశ్వాస పరీక్షలో నెగ్గి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ముందు పార్టీలో చేరిన కౌన్సిలర్లతో బలం పెంచుకున్న కాంగ్రెస్ అనంతరం ఛైర్ పర్సన్ పై అవిశ్వాసానికి తెరలేపింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఉమ్మడి పాలమూరు జిల్లాలో జరిగిన మున్సిపల్ అవిశ్వాసంలో ఓడడంతో బీఆర్ఎస్ పార్టీకి తొలి షాక్ తగిలింది. కోస్గి మున్సిపాలిటీలో మొత్తం 16 మంది కౌన్సిలర్లు ఉండగా.. ఒకరు మరణించారు, మరొకరిపై అనర్హత వేటు కొనసాగుతోంది. దీంతో ప్రస్తుతం 14 మంది కౌన్సిలర్లు పాలకవర్గంలో కొనసాగుతున్నారు.అయితే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ చెరో ఏడు స్థానాల్లో గెలవగా.. ఇద్దరు ఇండిపెండెంట్లుగా ఎన్నికయ్యారు. ఎక్స్ అఫిషియో సభ్యుల మద్దతుతో నాలుగేళ్ల క్రితం చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. 15వ వార్డుకు చెందిన కౌన్సిలర్ మేకల శిరిషను మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ అన్నపూర్ణ, మరో ఇద్దరు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కౌన్సిలర్ల సంఖ్యా బలం సంపాదించింది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సైతం ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో మున్సిపల్ ఛైర్మన్ మేకల శిరిషపై అవిశ్వాసానికి కౌన్సిలర్లు సిద్ధపడ్డారు. ఈ నెల 4వ తేదిన జిల్లా కలెక్టర్‌కు 11మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటిసులు అందజేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి 10 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఒకరు స్వతంత్ర కౌన్సిలర్ హాజరయ్యారు. మొత్తం సభ్యుల్లో 11మంది కోరంగా నిర్ణయించిన అధికారులు అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించారు. సమావేశానికి హాజరైన 11మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్ధతు తెలుపుతూ చేతులు ఎత్తారు. దీంతో ఛైర్ పర్సన్ మేకల శిరిషపై అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాసంపై ఓటింగ్ జరుగుతున్న క్రమంలో ప్రస్తుత మున్సిపల్ ఛైర్ పర్సన్ మేకల శిరిష సమావేశానికి హాజరుకావడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. అవిశ్వాసంపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశానని.. ఇప్పుడు ఓటింగ్ ఎలా నిర్వహిస్తారని ప్రిసైడింగ్ అధికారిగా ఉన్న ఆర్డీవో రామచందర్‌తో వాగ్వాదానికి దిగింది. దీంతో సమావేశంలో కొంత అనిశ్చితి నెలకొంది. న్యాయస్థానం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదని ప్రిసైడింగ్ అధికారి వెల్లడించారు. నిబంధనల మేరకు అవిశ్వాసంపై సమావేశం నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో పోలీసుల జోక్యంతో మున్సిపల్ ఛైర్ పర్సన్ మేకల శిరిషను బయటకు పంపించారు అధికారులు. ఇక అవిశ్వాసం నెగ్గడంతో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే నూతన మున్సిపల్ ఛైర్ పర్సన్ ను ఎన్నుకుంటామని వెల్లడించారు. తదుపరి మున్సిపల్ చైర్ పర్సన్ రేసులో 13వ వార్డు కౌన్సిలర్ బెజ్జు సంగీత పేరు కాంగ్రెస్ పార్టీ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం

Related Posts