పాట్నా, జనవరి 27
నితీశ్ కుమార్ మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారన్న వార్తల నేపథ్యంలో ఆర్జేడీ,కాంగ్రెస్ అప్రమత్తమయ్యాయి. కీలక భేటీలకు పిలుపునిచ్చాయి. భవిష్యత్ వ్యూహాలపై చర్చించనున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర బిహార్‌లో ఎంటర్ అవనున్న నేపథ్యంలో కీలక మార్పులు చేసే అవకాశాలున్నాయి. పబ్లిక్ మీటింగ్స్‌ని ఎక్కడెక్కడ నిర్వహించాలో పునరాలోచనలో పడింది కాంగ్రెస్ హైకమాండ్. ప్రస్తుతం అనుకున్న ప్రకారమైతే...కిషన్‌గంజ్, పుర్నియా, కటిహర్‌లో మీటింగ్స్ ఉన్నాయి. అయితే...నితీశ్ నిర్ణయాన్ని బట్టి వీటిలో ఏమైనా మార్పులు చేయాలా అనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది ప్రస్తుతం బిహార్‌లో. ఎప్పుడైనా నితీశ్ కుమార్ అధికారికంగా ఆ ప్రకటన చేసే అవకాశముంది. అందుకే ముందుగానే అప్రమత్తమవుతున్నాయి ఆర్జేడీ,కాంగ్రెస్ పార్టీలు. అటు జేడీయూ మాత్రం పక్కా ప్లాన్‌తోనే ఈ యూటర్న్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే...అప్పుడే క్యాబినెట్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులపైనా చర్చలు జరిగాయట. అసెంబ్లీ స్పీకర్‌గా ఎవరిని నియమించాలన్నదీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో నితీశ్ కుమార్ చాలా తొందర పడ్డారని, అందుకే బీజేపీ చకచకా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందనీ సమాచారం. అసలే సీట్ల పంపకాల్లో కాంగ్రెస్ పెద్దగా చొరవ చూపించలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమిలోని నేతలే కాంగ్రెస్‌పై తప్పు నెట్టేస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ వల్లే కూటమిలో ఇన్ని చీలికలు వచ్చాయని కాస్త గట్టిగానే చెప్పారాయన. కానీ...ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పైగా ఇండియా కూటమికి తనను కన్వీనర్‌గా నియమించలేదని నితీశ్ కుమార్ అసహనంతో ఉన్నారని సమాచారం. కూటమిలో తనకు పెద్దగా ప్రాధాన్యత లేదని నితీశ్ భావించారని, అందుకే మళ్లీ బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారన్న వాదనలూ గట్టిగానే వినిపిస్తున్నాయి. దీనికి తోడు బిహార్‌తో పాటు పలు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన వ్యూహాలపైనా కాంగ్రెస్‌తో సరిపడలేదని తెలుస్తోంది. ఇలా ఒకటికి ఒకటి తోడై ఆయనను కూటమికి దూరం చేశాయి. లోక్‌సభ ఎన్నికల ముందు ఎందుకీ రిస్క్‌లు అనుకున్నారేమో..అందుకే వెంటనే సేఫ్‌గేమ్ మొదలు పెట్టారు నితీశ్ కుమార్. మళ్లీ బీజేపీతో కలిస్తే అని భావించినట్టు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇండియా కూటమిని వీడిపోతున్నారన్న వార్తల నేపథ్యంలోనే సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ప్రతిపక్ష కూటమి తరపున ఆయన బలంగా నిలబడి ఉంటే కచ్చితంగా ప్రధాని అయ్యే వారని జోష్యం చెప్పారు. ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు అఖిలేశ్. ప్రతిపక్ష కూటమిలోని కీలక నేతలందరికీ ప్రధాని అభ్యర్థిగా నిలబడే అర్హత ఉందని, కానీ ఆ పదవికి సరైన వ్యక్తి నితీశ్ కుమార్ మాత్రమేనని అన్నారు. ఈ కూటమి ఏర్పాటు చేయడంలో నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన ఇలా యూటర్న్ తీసుకుంటారని అనుకోలేదని విచారం వ్యక్తం చేశారు.