తిరుపతి, జనవరి 30,
తిరుపతి జిల్లా వైసీపీలో సత్యవేడు సెగ కాక రేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ధిక్కార స్వరం రీసౌండ్ ఇస్తోంది. మంత్రి పెద్దిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేసిన ఎమ్మెల్యే ఆదిమూలం తనకు సత్యవేడు టికెట్ దక్కకపోవడం వెనుక పెద్దిరెడ్డి కుట్ర ఉందని ఆరోపించడం కలకలం రేపింది. మరో పార్టీతో చేతులు కలిపిన ఎమ్మెల్యే ఆదిమూలం లోపాయికారీ ఒప్పందం చేసుకుని పార్టీపై నిందలు వేస్తున్నారని అధికార పక్షం కౌంటర్ ఇస్తోంది.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టిక్కెట్టు చేజారిన అధికార పార్టీ ఎమ్మెల్యేల స్వరం స్వపక్షంలో సెగ పుట్టిస్తోంది. సర్వేలు సామాజిక సమీకరణలు వైసీపీలో సమన్వయకర్తల మార్పుకు కారణం కాగా టిక్కెట్టు దక్కని ఎమ్మెల్యేల అసమ్మతి రాగం ఇప్పుడు ఆ పార్టీలో చర్చగా మారింది. రాయలసీమ జిల్లాల్లో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి పెద్దిరెడ్డిపైనే వ్యాఖ్యలు చేసేందుకు కారణం అయ్యింది. మొన్న ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు, నేడు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వంతు అయ్యింది. పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబును మార్చిన వైసీపీ.. సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు స్థానచలనం కల్పించింది. ఎమ్మెల్యే ఆదిమూలంకు తిరుపతి ఎంపీగా పోటీ చేసేందుకు ఛాన్స్ ఇచ్చిన వైసీపీ.. తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడు సమన్వయకర్తను చేసింది. వైసీపీ హై-కమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని ముందుగా స్వాగతించిన ఎమ్మెల్యే ఆదిమూలం.. ఆ తర్వాత అసంతృప్తి వ్యక్తం చేశారు.సత్యవేడు వైసీపీ కార్యకర్తల సమన్వయ సమావేశాన్ని రెండు రోజుల క్రితం తిరుపతిలో నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం విమర్శలకు దిగడం కొత్త చర్చకు దారి తీసింది. తనకు టికెట్ దక్కకుండా మంత్రి పెద్దిరెడ్డి కుట్ర చేశారని ఆరోపించడం హాట్ టాపిక్ అయింది. పెద్దిరెడ్డి పెత్తనం ఏంటని ప్రశ్నించిన ఆదిమూలం తాను చేసిన తప్పేంటో చెప్పకుండా టికెట్ నిరాకరించడం, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా.. సత్యవేడులో తన ప్రమేయం లేకుండా పెద్దిరెడ్డి ఫ్యామిలీ వ్యవహరించడాన్ని ఎమ్మెల్యే ఆదిమూలం వ్యతిరేకించారు. ఎమ్మెల్యే ఆదిమూలం.. పెద్దిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేయగా ఆదిమూలంను ఎమ్మెల్యే చేసిందే మంత్రి పెద్దిరెడ్డి అని మంత్రి రోజా అన్నారు. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో కష్టపడుతున్న పెద్దిరెడ్డిపై ఎమ్మెల్యే ఆదిమూలం చేసిన ఆరోపణలు బాధ కలిగించాయన్నారు మంత్రి ఆర్కే రోజా. ఇలా తిరుపతి జిల్లా వైసీపీలో కాక రేపుతున్న సత్యవేడు సెగ కొనసాగుతుండగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ధిక్కార స్వరంపై అధిష్టానమే చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ విప్ కొరుముట్ల శ్రీనివాసులు అంటున్నారు.సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్న ఆదిమూలంకు తిరుపతి ఎంపీ టికెట్ కేటాయిస్తే వైసీపీ అధిష్టానంపై నిందలు వేయడం తగదన్న ఎంపీ గురుమూర్తి.. ఇతర పార్టీల వైపు ఆదిమూలం చూస్తూ ఇలాంటి ఆరోపణలు చేయడం తగదన్నారు. మంత్రి పెద్దిరెడ్డి కుట్రతోనే సత్యవేడు టికెట్ దక్కలేదని ఎమ్మెల్యే ఆదిమూలం ఆరోపణలు చేయడాన్ని తప్పుపట్టారు. మంత్రి పెద్దిరెడ్డి ఫ్యామిలీపై ఆదిమూలం చేసిన వ్యక్తిగత విమర్శలను ఉపసంహరించుకోవాలని సత్యవేడు సమన్వయకర్తగా పనిచేస్తున్న ఎంపీ గురుమూర్తి డిమాండ్ చేశారు. మరో పార్టీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న ఎమ్మెల్యే ఆదిమూలం పార్టీపై విమర్శలు తగదన్నారు ఎంపీ గురుమూర్తి.