YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎడ్ల బండి నుంచి హెలికాప్టర్ దాకా..మేడారం జాతర

ఎడ్ల బండి నుంచి హెలికాప్టర్ దాకా..మేడారం జాతర

-  850 ఏళ్ల నుంచి మేడారం జాతర

- 1996లో రాష్ట్రపండుగగా గుర్తింపు.. 

- తెలంగాణ కుంభమేళాగా వినుతి

 మేడారం.. ఓ ఆదివాసీ పల్లె. పట్టుమని వెయ్యి మంది కూడా లేని ఆ మారుమూల అటవీప్రాంతం రెండేళ్లకోసారి భక్తకోటిత పరవశించిపోతుంది. ఆ దృశ్యం ఇప్పుడు మరోసారి ఆవిష్కారమవు తోంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం. ఈ జాతరను 12 శతాబ్దంలో కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి కాలం నాటి నుంచి నిర్వహిస్తున్నట్టు చరిత్ర చెబుతోంది. కానీ జాతర ప్రాచుర్యంలోకి వచ్చింది మాత్రం 20వ శాతాబ్దం సగంలోనే అని చెప్పాలి. ఎంతో మహోన్నత చరిత్ర కలిగిన మేడారం జాతరకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు తరలిరావడం విశేషం. సమ్మక్క సారలమ్మ జాతర(మేడారం) ను తెలంగాణ కుంభమేళాగా ప్రజలు భావిస్తుంటారు. గత నాలుగైదు సంవత్సరాల క్రితం వరకు జాతర సమయంలో మినహా ఇతర రోజుల్లో జన సంచారం చాలా అరుదు. దీనికితోడు అటవీ ప్రాంతం కావడంతో క్రూరమృగాలు సంచరిస్తుంటాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. జాతరప్పుడే కాకుండా సాధారణ రోజుల్లోనూ జనం సమ్మక్క, సారలమ్మ దర్శనార్థం ఏడాదంతా  రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఎడ్లబండ్లు, కాలినడకన తప్ప.. ఇక్కడికి వచ్చేందుకు మరే రవాణ సదుపాయం లేదు. ఇప్పుడు ఏకంగా హెలికాప్టర్ ద్వారా భక్తులు వస్తుండడం గమనార్హం. 


మేడారం జాతర మొదట్లో బయ్యక్కపేట అనే కుగ్రామంలో జరిగేది. అప్పట్లో ఆ గ్రామంలో ఉండే కోయ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేకపోవడం జాతరను సరిగ్గా నిర్వహించేవారు కాదు. ఎప్పుడూ తలా ఇంత మొత్తంలో విరాళాలు వేసుకు చిన్నగా నిర్వహించేవారు. కాలక్రమంలో చందా వంశీయులు భూపతయ్య, రామన్న, జోగయ్య మధ్యలో వివాదాలు పొడచూపి జాతర నిలిచిపోయింది. దీంతో జాతరపై నీలినీడలు కమ్ముకున్నాయి. అప్పటి తహసీల్దార్ 1944 సంవత్సరంలో బయ్యక్కపేటలో జాతర నిర్వహించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా జాతరను జరిపించలేకపోయింది. దీంతో జాతరను అప్పటి నుంచి మేడారం పూజారులైన వడ్డెలకు అప్పగించారు. ఇక 1946 నుంచి జాతరను మేడారంలో నిర్వహించడం మొదలుపెట్టారు. ఇదంతా అప్పటివరకు నామమాత్రంగానే జరిగింది. తొలిసారిగా 1962 సంవత్సరంలో సమ్మక్క తల్లిని కీకారణ్యంగా మేడారంలో గద్దెపై ప్రతిష్టించారు. అనంతరం అక్కడే కోయ కుటుంబాలు, ఇతరులు కలిసి జాతర చేసేవారు. 1968లో జాతర దేవాదాయ శాఖ పరిధిలోకి చేరింది. ప్రత్యేకంగా జాతరకు ధర్మకర్తల మండలిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాలక్రమేణా జాతరకు ప్రాచుర్యం పెరగడంతో పాటు ఆదాయం ఎక్కువగా సమకూరడం మొదలైంది. దీంతో 1996 ఫిబ్రవరి 2న జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. 1998 సంవత్సరంలో మేడారానికి రూ.3 కోట్లు నిధులు మంజూరు చేసి శాశ్వత నిర్మాణాలు చేపట్టారు.
మేడారం జాతర గురించి నాణేనికి ఓవైపు..
సమ్మక్క, సారలమ్మ జాతరకు సంబంధించి రెండు ఉదంతాలు ప్రచారంలో ఉన్నాయి. కేవలం పాత తరం నుంచి చెప్పుకుంటూ వస్తున్న కొన్ని విషయాలే.. రానురాను వీరి చరిత్రగా మారిందనే ప్రచారం లేకపోలేదు. అసలు ఈ సమ్మక్క ఎవరు? ఎందుకీ జాతర.. అనేది చాలామందికి తెలియని విషయం.   ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల పొలాసను పాలించే గిరిజన దొర మేడరాజుకు సమ్మక్క అడవిలో దొరికింది. మేడరాజు తన మేనల్లుడు మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకు సమ్మక్కతో వివాహం జరిపించాడు. ఈ దంపతులకు సారలమ్మ, జంపన్న, నాగులమ్మలు సంతానం. కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు రాజ్యవిస్తర ణలో భాగంగా పొలాసపై దండే త్తాడు. దీంతో మేడరాజు తన అల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజు వద్దకు వచ్చి అజ్ఞాతవాసం గడుపుతాడు. ఇదిలావుంటే.. పగిడిద్దరాజు, కోయ రాజులు కాకతీయులకు సామంతులుగా ఉండేవారు. కరువు కాటకాల వల్ల వీరు కాకతీయ రాజులకు కప్పం చెల్లించలేకపోతారు. ఓవైపు కప్పం చెల్లించకపోవడం.. మరోవైపు పొలాస పాలకుడు మేడరాజుకు ఆశ్రయం కల్పించడంతో ప్రతాపరుద్రుడు ఆగ్రహంతో మాఘ శుద్ధ పౌర్ణమి రోజు తన సైన్ంయతో మేడారం గ్రామంపై దండెత్తాడు. ఈ యుద్ధంలో సంప్రదాయ ఆయుధాలతో పాల్గొన్న పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, నాగులమ్మ, జంపన్నలు వేర్వేరు ప్రాంతాల నుంచి సైన్యంతో తలపడతారు. కాకతీయ బలగాలతో వీరోచితంగా పోరాడిన సమ్మక్క గాయపడడంతో చిలకలగుట్ట వైపు వెళుతుంది. ఆమెను అనుసరిస్తూ వెళ్లిన అను చరులకు ఆమె ఆచూకీ లభించలేదు. చిలకల గుట్టపై ఒక పుట్ట వద్ద కుంకుమ, పసుపు ఉన్న భరిణె దొరుకుతుంది. ఆ పుట్టను సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండు సంవత్స రాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారక్క జాతర జరుగుతోంది. పగిడిద్ద రాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు వీరోచితంగా పోరాడి మరణిస్తారు.  ఈ వార్త విన్న జంపన్న.. అవమానాన్ని తట్టుకోలేక.. అక్కడే ఉన్న సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పటి నుంచి సంపెంగ వాగు కాస్త జంపన్న వాగుగా మారింది.


నాణేనికి మరోవైపు..
ఎక్కడో కోయలు తమ చూట్టూ ఉన్న అడవిని కొట్టుకుని భూమిని సాగు చేసుకున్నారు. ఇక్కడే సమ్మక్క కోయవారికి పొలంలో పసిపాప రూపంలో దొరికిందనే కథ ఒకటి ప్రచారంలో ఉంది. పెరిగి పెద్దదైన సమ్మక్క ఈ గూడెంలో ఉండలేనని తనను తీసుకెళ్లి గుట్టపై వదిలి రమ్మని వారిని కోరిందని.. ఆమె కోరిక ప్రకారమే గూడెనికి దగ్గరగా ఉన్న కొండ దగ్గర వదిలేసి వచ్చారని కథ ప్రచారంలో ఉంది. కొండపక్కనే ఉన్న నీటి కుంటలో సమ్మక్క స్నానం చేసేందని కోయలు చెబుతారు. అందుకనే ఈ బావిని వీరు ‘జలకంబాయి’ అని పిలుస్తున్నారు. సమ్మక్కను కొండపై వదిలి వచ్చిన దగ్గర నుంచి ఆమె మనిషి రూపంలో తిరిగి ఎప్పుడూ కనిపించలేదని కోయలు అంటారు. అప్పటి నుంచే ఈమెను దేవతగా కొలవడం ప్రారంభించారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. సమ్మక్క, సరళవ్వ, సడలమ్మ అనే పేర్లతో అప్పట్లో సమ్మక్కను కొలిచేవారు. ముఖ్యంగా సడలమ్మ అనే సమ్మక్కను వ్యవహరించేవారని కోయ తలపతులు(పెద్దలు) రాసిన జాతర ఖర్చుల పత్రంలో ఉందని ఇప్పటికీ కోయలు చెబుతూనే ఉన్నారు. కాలక్రమేణా అది సమ్మక్క సారలమ్మ జాతరను ప్రాచుర్యంలోకి వెళ్లిందని కోయదోరలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts