YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

కౌలు రైతుకు దారేది...

 కౌలు రైతుకు దారేది...
కౌలు రైతులు కన్నీరు పెడుతున్నారు. గుర్తింపు లేక దిగాలు చెందుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం గా చేపట్టి అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేయకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. పెట్టిన పెట్టుబడికి గిట్టుబాటు ధర కాకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. గత్యంతరం లేని స్థితిలో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన స్థితిలోకి నెట్టబడుతున్నారు. ఆదుకుంటుందనుకున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితి లో కొట్టుమిట్టాడుతున్నారు. రైతు బాంధవుడిగా కీర్తించబడుతున్న సిఎం కెసిఆర్ స్వయంగా కౌలు రైతులకు వర్తించదనడంతో ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సుమారు 1 లక్ష మంది కౌలు రైతులున్నారు. ఉత్పత్తిలో 40 శాతం ఉన్న వీరిని గుర్తించడంలో నిర్లక్షం జరుగుతుందని పలువురు రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించుకున్న ప్రకారం కూడా కౌలు గుర్తింపు కార్డులు అందించలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.75వేల 903 మందికి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకున్న లక్షం ఇప్పటి వరకూ పూర్తికాకపోవడం కౌలు రైతుల పట్ల నిర్లక్షానికి నిదర్శనంగా నిలుస్తోందనే అభిప్రాయాలున్నాయి. 2013- 14లో 12 వేల 136 మందికి, 2015-16లో 9వేల 867 మందికి మాత్రమే అందించి మిగతా వారికి గుర్తింపు కార్డులు అందించడం విస్మరించడం, ఈ ఏడాది పూర్తిగా ఈ ప్రక్రియనే మూలనపడేయడం గమనార్హం. దీంతో కౌలు రైతులు గుర్తింపుకు నోచుకోవడం లేదని, మరో వైపు ఆదుకుంటుందనుకున్న ప్రభుత్వం రైతు బంధు పథకం వర్తింపజేయడంలోనూ విస్మరించడం సరైంది కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెట్టిన పెట్టుబడికి సరైన మద్దతు ధర కల్పించకపోవడం, రుణాలు మంజూరు చేయకపోవడం కౌలు రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని పలువురు రైతు సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఆసరా అవుతుందనుకున్న రైతు బంధు పథకాన్ని సైతం వర్తింపజేయకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు.పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, కౌలు రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ సెక్యూరిటీతో కూడిన బ్యాంక్ రుణాలు అందించాలని, రైతు బంధు పథకాన్ని వర్తింపజేయాలని కౌలు రైతులు కోరుతున్నారు.ః

Related Posts