YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వారసుల కోసం నేతల టెన్షన్ బొత్స నుంచి అయ్యన్న కుమారుడి వరకు

 వారసుల కోసం నేతల టెన్షన్ బొత్స నుంచి అయ్యన్న కుమారుడి వరకు

విశాఖపట్టణం, ఫిబ్రవరి 1,
ఉత్తరాంధ్రలోని పలు పార్టీల్లో కీలక నేతలుగా ఎదిగిన నాయకులు తమ వారసుల రాజకీయ భవితవ్యంపై మథనపడుతున్నారు. గడిచిన 20, 30 ఏళ్ల నుంచి రాజకీయాలు చేస్తూ.. అనేకసార్లు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పని చేసని ముఖ్యమైన నేతలు వచ్చే ఎన్నికల్లో తమ వారసులను రాజకీయ రంగప్రవేశం చేయించి.. శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావించారు. అందుకు అనుగుణంగా గ్రౌండ్‌ను చాలా మంది నాయకులు ప్రిపేర్‌ చేశారు. కానీ, ఆయా నేతలకు పార్టీ అధిష్టానం నుంచి వారసుల రాజకీయ రంగ ప్రవేశానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించకపోవడంతో మరోసారి పోటీ చేయాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది. వారసులను రంగ ప్రవేశం చేయించాలనుకునే వారి జాబితాలో వైసీపీతోపాటు టీడీపీలోనూ ఎక్కువగానే ఉంది. పార్టీ అధినాయకత్వ సూచనలతో సీనియర్‌ నేతలే మరోసారి బరిలోకి దిగాల్సి వస్తుండడంతో వారుసలకు మరికొంత కాలం నిరీక్షణ తప్పని పరిస్థితి ఏర్పడింది. వారుసుల రాజకీయ రంగప్రవేశం చేయించాలని భావించిన నాయకులు జాబితాలో సీనియర్‌ మంత్రి, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ముందు వరుసలో ఉన్నారు. 2024 ఎన్నికల్లో రాజకీయ వారుసుడిని బరిలోకి దించాలని ఆయన ముందు నుంచీ భావిస్తూ వచ్చారు. ఇందుకోసం చాలా కాలం కిందటి నుంచే ఆయన గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేశారు. మాజీ ఎంపీ, తాజా విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, మంత్సి బొత్స సత్యనారాయణ కుమారుడు డాక్టర్‌ బొత్స సందీప్‌ను వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించేందుకు సిద్ధమయ్యారు. డాక్టర్‌ బొత్స సందీప్‌ కూడా గత కొన్నాళ్లు నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. మెడికల్‌ క్యాంపులు, సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్నారు. కానీ, అనూహ్యంగా వైసీపీ అధిష్టానం బొత్స సందీప్‌ పోటీకి క్లియరెన్స్‌ ఇవ్వలేదు. ఈసారి కూడా బొత్స సత్యనారాయణ దంపతులు బరిలో ఉండాలని సీఎం జగన్‌ బలంగా ఆకాంక్షించారు. అందుకు అనుగుణంగానే వారి అభ్యర్థిత్వాలను ఖరారు చేయడంతో సందీప్‌ మరికొంత కాలం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.శ్రీకాకుళంజిల్లాలో వారుసులను బరిలో దించాలని భావిస్తున్న నాయకుల సంఖ్య అధికంగానే ఉంది. స్పీకర్‌ తమ్నినేని సీతారాం తన కుమారుడు చిరంజీవి నాగ్ ను పోటీ చేయించాలని భావించారు. అధిష్టానం నుంచి సానుకూలత రాకపోవడంతో ఆయనే పోటీకి సిద్ధపడుతున్నారు. ఇక్కడ ఆయనకు పోటీగా మరో వ్యక్తి బలంగా పని చేస్తుండడంతో ఇక్కడ పోటీ వాతావరణం నెలకొంది.ఇదే జిల్లాలో సీనియర్‌ మంత్రిగా ఉన్న ధర్మాన ప్రసాదరావు కుమారుడిని బరిలోకి దించాలని భావించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నుంచి నియోజకవర్గం అంతటా ఆయన కుమారుడు రామ్‌ మనోహర్‌ నాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నారు. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు. ధర్మాన ప్రసాదరావు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని, పార్టీకి పని చేస్తానన స్పష్టం చేశారు. కానీ, సీఎం జగన్‌ ఇందుకు అంగీకరించలేదని, మళ్లీ ఆయన్నే బరిలో దిగాలని కోరుతున్నట్టు చెబుతున్నారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో మరోసారి బరిలో నిలిచేందుకు ధర్మాన సిద్ధమవుతున్నారు. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌కూడా వారసుడిని అసెంంబ్లీకి పంపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. గత ఎన్నికల్లో జెడ్పీటీసీగా బరిలోకి దిగిన ఆయన కుమారుడు ధర్మాన కృష్ణ చైతన్య వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి వెళ్లేందుకు అనుగుణంగా పని చేసుకుంటూ వచ్చారు. కానీ, అధిష్టానం నుంచి అనుమతి రాకపోవడంతో మళ్లీ కృష్ణదాస్‌ పోటీకి సిద్ధపడుతున్నారు.తెలుగుదేశం పార్టీలోనూ వారసుల పోటీ ఎక్కువగానే ఉంది. మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు కుమారుడిని ఈ ఎన్నికల్లో బరిలోకి దించేందుకు సిద్ధమయ్యారు. ఎచ్చెర్ల నుంచి రామ్‌ మల్లిక్‌ నాయుడిని బరిలోకి దించాలని భావించి కళా.. పార్టీ నుంచి సానుకూలత రాకపోవడంతో మళ్లీ ఆయనే పోటీకి సిద్ధపడుతున్నారు. మాజీ మంత్రి ప్రతిభా భారతికూడా తన వారసురాలు కావలి గ్రీష్మను పోటీ చేయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గం సీటు కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. కానీ, పార్టీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఎదురు చూస్తున్నారు. విశాఖ జిల్లాలోనూ పలువురు సీనియర్‌ నేతల వారసులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వారసులు రెడీగా ఉన్నారు. ఈ జాబితాలో మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడుకుమారుడు విజయ్‌, బండారు సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు ఉన్నారు. అయ్యన్నపాత్రుడు తనకు నర్సీపట్నం ఎమ్మెల్యే స్థానంతోపాటు కుమారుడికి అనకాపల్లి ఎంపీ స్థానాన్ని కేటాయించాల్సిందిగా అధిష్టానాన్ని కోరుతున్నారు. పార్టీ నుంచి ఇంకా సానుకూల స్పందన రాకపోవడంతో ఎదురు చూపులు తప్పడం లేదు. మాజీ మంత్రి బండారు కుమారుడు గడిచిన ఐదేళ్ల నుంచి పార్టీ వ్యవహారాలను పెందుర్తి నియోజకవర్గంలో చక్కబెడుతున్నారు. కానీ, పార్టీ ఇప్పట్లో అప్పలనాయుడుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ నియోజకవర్గంలో సీటును జనసేనకు ఇచ్చే అవకాశముందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారసుడి పేరు ప్రతిపాదించడం కంటే.. తన పేరుతోనే ముందుకు వెళ్లడం వల్ల ఫలితం ఉంటుందని సత్యనారాయణమూర్తి భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక్కడి లెక్కలు ఆధారంగా అప్పలనాయుడు మరికొంత కాలం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రానున్న ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విజయమే లక్ష్యంగా పోటీకి సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో రాజకీయ అనుభవం లేని వారసులను పోటీలోకి దింపడం వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుందని పార్టీ అధిష్టానాలు భావిస్తున్నాయి. సీనియర్‌ నాయకులు బరిలో దిగితే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని పార్టీ నాయకత్వాలు భావిస్తుండడం వల్లే.. వారసులకు క్లియరెన్స్‌ ఇవ్వడం లేదు. వారసులకు టికెట్లు ఇవ్వడం ద్వారా ప్రత్యర్థి పార్టీలకు విజయావకాశాలను పెంచే అవకాశముంటుందని సర్వేలు ద్వారా పార్టీలు గుర్తించాయి. అందుకే వారసులను ఈసారికి పోటీకి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Related Posts