న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గురువారం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టే క్రమంలో నిర్మలా కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. 2014లో ప్రధాని మోదీ అధికారం చేపట్టినప్పుడు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతమై ప్రజలకు ఉపాధి లభించేలా ప్రజా ప్రయోజనాల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు రూపొందించారు. అన్ని వర్గాలు, ప్రజలందరి సమ్మిళిత వృద్ధి, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం.' అని పేర్కొన్నారు.మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశపెట్టే క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి ప్రభుత్వం సబ్‌కా సాథ్ సబ్ కా వికాస్ లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పద్దుని ప్రవేశ పెడుతోందని స్పష్టం చేశారు. అందుకే రెండోసారి కూడా తమ ప్రభుత్వాన్ని భారీ మెజార్టీతో గెలిపించారని తేల్చి చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పదేళ్లుగా ప్రభుత్వం పని చేస్తోందని తెలిపారు. ఈ పదేళ్లలో పేదలకు ఇళ్ల నిర్మాణ విషయంలోనూ ఎంతో పురోగతి సాధించామని వివరించారు. సామాజిక న్యాయం కేవలం నినాదంగా మిగిలిపోకుండా నిజం చేశామని అన్నారు. అర్హులందరికీ సామాజిక న్యాయం చేయడమే సెక్యులరిజం అని తేల్చి చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పద్దు ఉంటుందని హామీ ఇచ్చారు. ఆత్మనిర్భర భారత్ దిశగా దేశం దూసుకుపోతోందని అన్నారు. దేశ యువతకి భవిష్యత్‌పై భరోసా పెరిగిందని, ఆ ఆకాంక్షలకు తగ్గట్టుగానే తమ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. మరోసారి భారీ మెజార్టీతో ప్రజలు తమని ఆశీర్వదిస్తారన్న నమ్మకముందని చెప్పారు. పేదలు, మహిళలు, యువతపైనే తమ ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెడుతోందని తేల్చి చెప్పారు నిర్మలా సీతారామన్. వాళ్ల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయడమే తమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. "గత పదేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. సానుకూల దిశగా ఆర్థిక రథం సాగిపోతోంది. ప్రజల ఆశీర్వాదంతో 2014లో తొలిసారి ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ సమయానికి సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అనేదే లేదు. ఆ విషయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. కానీ మా ప్రభుత్వం ఈ లక్ష్యంతోనే పని చేసింది. ఆ సవాళ్లన్నింటినీ అధిగమించింది"
- నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆశా కార్యకర్తలకు, అంగన్‌వాడీలకు గుడ్‌న్యూస్ చెప్పారు. కేంద్ర ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకంలో వీళ్లనూ అర్హులుగా చేరుస్తామని కీలక ప్రకటన చేశారు. అయితే...ఇందుకోసం ఎంత బడ్జెట్ ప్రవేశపెడుతున్నారన్నది మాత్రం వెల్లడించలేదు. గత బడ్జెట్‌లో ఈ స్కీమ్ కోసం రూ.7,200 కోట్లు కేటాయించారు. మొత్తంగా కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కింద రూ.88,956 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఆయుష్మాన్ భారత్ పథకం కింద అర్హులందరికీ రూ.5 లక్షల మేర ఆరోగ్య బీమా అందిస్తారు. అంతే కాదు. ఈ కార్డ్ ద్వారా వాళ్లు వైద్యం చేయించుకునేందుకూ అవకాశముంటుంది. పైగా ఇది క్యాష్‌లెస్ సర్వీస్. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 30.6 కోట్ల కుటుంబాలకు లబ్ధి జరుగుతోందని కేంద్రం వెల్లడించింది. పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 6.2 కోట్ల హాస్పిటల్ అడ్మిషన్స్ జరిగాయి. మొత్తంగా రూ.79,157 కోట్ల మేర నిధులు ఖర్చయ్యాయి. ఎలాంటి నగదు, పత్రాలు లేకుండానే ఈ లబ్ధి పొందేలా వెసులుబాటు కల్పించింది కేంద్రం. పదేళ్లలో రికార్డు స్థాయిలో మౌలిక వసతులు కల్పించామని అన్నారు నిర్మలా సీతారామన్. 11.8 కోట్ల మంది అన్నదాతలకు రకరకాల పథకాల ద్వారా లబ్ధి చేకూర్చామని వివరించారు. ప్రపంచమంతా ఆర్థిక పరంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న సమయంలో భారత్ దిక్సూచిగా నిలిచిందని అన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలోనూ G20 సదస్సుని విజయవంతంగా పూర్తి చేయగలిగామని వెల్లడించారు. యూరప్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం చరిత్రాత్మక నిర్ణయం అని ప్రశంసించారు.దేశవ్యాప్తంగా 92 యూనివర్సిటీలు ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. యువతకు నాణ్యమైన విద్య అందించాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యం అని వివరించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 70 వేల ఇళ్లు కట్టించి ఇచ్చామని స్పష్టం చేశారు. భారత్‌కి ఆకాశమే హద్దు అని తేల్చి చెప్పారు. స్కిల్ ఇండియా పథకం కింద 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ అందించినట్టు వివరించారు నిర్మలా సీతారామన్. ప్రజల సగటు ఆదాయం 50% మేర పెరగడంతో పాటు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని చెప్పారు.