చెన్నై, ఫిబ్రవరి 3,
తమిళనాట తిరుగులేని హీరోగా రాణించిన దళపతి విజయ్ తాజాగా ‘తమిళగ వెట్రి కళగం’ పేరిట ఓ రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పరిణామం తమిళనాడులో మాత్రమే కాకుండా మొత్తం దేశ రాజకీయాల్లోనే సంచలనంగా మారింది. గతంలో తమిళనాట సినీ ప్రముఖులు రాజకీయాల్లో రాణించిన చరిత్ర ఉంది. మరి విజయ్ అదే కోవలోకి వెళ్తారా..? లేదంటే సినిమాల్లో టాప్ హీరోగా రాణించినట్లే.. రాజకీయాల్లోనూ సత్తా చాటుతారా..? అన్నది వేచి చూడాలి. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వంటి సినీ ప్రముఖులు తమిళనాట రాజకీయాలను శాసించారు. ఇక కమల్ హాసన్, విజయకాంత్ వంటి హీరోలు పార్టీ పెట్టి పెద్దగా రాణించలేకపోయారు. విజయ్ ఎవరికి సరసన నిలుస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉండగా.. విపక్షంలో ఏఐడీఎంకే ఉంది. దివంగత నేత కరుణానిధి నిష్క్రమణ అనంతరం స్టాలిన్ ఎంతో విజయవంతంగా పార్టీని నడిపిస్తున్నారు. అయితే జయలలిత మృతి చెందిన తర్వాత తమిళనాడులో పొలిటికల్ గ్యాప్ ఏర్పడింది. అన్నా డీఎంకేను సమర్థంగా నడిపించే లీడర్లు ఎవరూ కనిపించడం లేదు. ఆ గ్యాప్‌ను పూడుద్దామని బీజేపీ భావించినప్పటికీ పెద్దగా వర్కవుట్ కాలేదు. అందుకే విజయ్ దీన్ని మంచి సమయంగా ఎంచుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని విజయ్ ప్రకటించారు. ఆ తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికలనే ఆయన టార్గెట్‌గా పెట్టుకున్నారు. సహజంగా తమిళ ప్రజలు స్వాభిమానులు.. జాతీయ పార్టీలను కనీసం దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. అందుకే తమిళనాట కాంగ్రెస్, బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ద్రవిడ మూలాలున్న డీఎంకే, అన్నా డీఎంకే మాత్రమే ఆ రాష్ట్రంలో దశాబ్ధాల పాటూ రాజకీయాలను శాసించాయి. ఇక తాజాగా విజయ్ అదే ఆశతో సొంత పార్టీని స్థాపించారు. ప్రస్తుతం తమిళ ప్రజలకు డీఎంకే పెద్ద ఆశగా ఉంది. ఆ తర్వాత వారికి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ కనిపించడం లేదు. ఈ అవకాశాన్ని విజయ్ సద్వినియోగం చేసుకోవాలని భావించారు. అయితే గతంలో తమిళ ప్రజల అస్థిత్వం కోసం పుట్టుకొచ్చిన అనేక పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. కమల్ హాసన్, విజయ్ కాంత్ పార్టీలు పెట్టి బొక్క బోర్లా పడ్డారు. కేవలం ఎంజీఆర్ ఒక్కరే తమిళనాట పార్టీ పెట్టి సక్సెస్ ఫుల్‌గా నడిపారు. కరుణానిధి అప్పటికే ఉన్న పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. జయలలిత విషయంలోనూ అదే జరిగింది. అయితే ప్రస్తుతం తమిళనాటు విజయ్ అగ్రహీరో. తమిళనాడు వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. విజయ్ లాగానే అభిమానగణం ఉన్న రజనీకాంత్ పార్టీ పెడదామని భావించి వెనక్కి తగ్గారు. ఆరోగ్య కారణాలు, ఇతర సమస్యల వల్ల ఆయన పార్టీ పెట్టే ఆలోచనకు, రాజకీయాలకు కూడా దూరం జరిగారు. విజయ్ కి ప్రస్తుతం ఆ సమస్య లేదు. ఆయన రాష్ట్రం మొత్తం చుట్టేయగలరు. కాబట్టి విజయ్ ఇప్పుడు ఏ ఎజెండాతో జనంలోకి వెళ్లబోతున్నారు. ప్రజలను ఆకట్టుకొనేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారన్నది వేచి చూడాలి. గత కొన్నేండ్లుగా సినీ హీరోలు రాజకీయాల్లో పెద్దగా రాణించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారాజ్యం, జనసేన పార్టీలను స్థాపించిన చిరంజీవి, పవన్ కల్యాణ్ సక్సెస్ అవ్వలేకపోయారు. చిరంజీవి ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకోగా.. పవన్ కల్యాణ్ మాత్రం ఇంకా తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వారికి ఓ సామాజికవర్గం అండగా ఉన్నప్పటికీ రాణించలేపోయారు. మరి విజయ్ ఏ తరహా రాజకీయాలు చేస్తారు..? ప్రజలను ఎలా ఆకట్టుకుంటారో..? వేచి చూడాలి.