YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ పార్టీలోకి గడల..

కాంగ్రెస్ పార్టీలోకి గడల..

ఖమ్మం, ఫిబ్రవరి 3,
పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ మాజీ డైరెక్టర్, డాక్టర్ గడల శ్రీనివాస రావు కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి ఆయన సిద్ధమయ్యారు. ఖమ్మం, సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలలో ఏదో ఒక టికెట్‌ను ఆయన ఆశిస్తున్నారు. ఈ మేరకు ఈ రెండు సీట్లకు శుక్రవారం గాంధీ భవన్లో లో గడల శ్రీనివాసరావు తరపున ఎంపీ టికెట్ కోసం ఆయన సన్నిహితుడు రాము అప్లికేషన్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 60 స్థానాల్లో కొత్త అభ్యర్థులను కాంగ్రెస్ నిలబెట్టింది. రాజకీయాలపై ఆసక్తి ఉన్న, ప్రజాసేవ చేయాలనే ఆకాంక్ష ఉన్న విద్యావంతులకు టికెట్లు ఇచ్చి ప్రోత్సాహించింది. 52 మంది కొత్తవారు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే ప్రజాసేవ, రాజకీయాలపై ఆసక్తి ఉన్న డాక్టర్ గడల శ్రీనివాసరావు కాంగ్రెస్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు.ప్రజారోగ్య సంచాలకులుగా శ్రీనివాసరావు కరోనా సమయంలో తన పనితీరుతో సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కొత్తగూడెం వాస్తవ్యులైన గడల, తన తండ్రి పేరిట ట్రస్ట్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఒక దశలో ఆయనకు కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని బీఆర్‌‌ఎస్ ఆఫర్ చేసిందనే ప్రచారం జోరుగా వినిపించింది.. ఈ నేపథ్యంలోనే ఆయన కొత్తగూడెంలో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారు. ఆయనకు టికెట్ కన్ఫామ్ అని అందరూ భావించినప్పటికీ చివరలో ఆయనను పక్కనబెట్టిన కేసీఆర్‌.. వనమాకే టికెట్ ఇచ్చారు. గడలను కేసీఆర్ నమ్మించి మోసం చేశాడన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరిగింది. గడల కూడా మనస్తాపానికి గురయ్యారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ప్రస్తుతం సర్వీసులోనే ఉన్న గడల దీర్ఘకాలిక సెలవులో కొనసాగుతున్నారు.గడలకు కుల సమీకరణాలు కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీసీ వ్యక్తికి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన గడలకు ఇది కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. మరోవైపు, రాష్ట్రంలో మున్నూరు కాపు ఎమ్మెల్యే ఒక్కరే ఉన్నారు. రాష్ట్ర జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులకు ప్రాతినిథ్యం కల్పించాలను పార్టీ భావిస్తే, ఎక్కడో ఒకచోట గడలకు టికెట్ వచ్చే అవకాశం ఉంటుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Related Posts