బద్వేలు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎన్నికల సంఘం వేగం పెంచింది. ఎన్నికల ప్రకటన ఎప్పుడు వచ్చి సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారులకు చెప్పింది. అత్యవసరంగా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఎన్నికల సన్నద్ధతతో పాటు ఓటర్ల జాబితా నవీకరణపై తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించింది. ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే ఈసీ మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించింది. సునిశితమైన, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లతో పాటు 1,200 మంది ఓటర్లకు పైబడి ఉన్న పోలింగ్ స్టేషన్లకు తప్పనిసరిగా వెబ్ టెలీకాస్టింగ్ సౌకర్యం కల్పించాలని చెప్పింది. వెబ్ కాస్టింగ్‌పై నివేదిక పంపాలని ఆదేశించింది. జిల్లాల్లో కనీసం 50 శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్ టెలీకాస్టింగ్ కవర్ అయ్యేలా చూడాలని చెప్పింది. పోలింగ్ స్టేషన్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. దివ్యాంగులు, వయోవృద్ధుల ఓటర్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పింది.