వచ్చే నెల 7వ తేదీన పెద్ద వింత జరగబోతున్నది. తన జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆ రోజున రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) నిర్వహించే ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెళ్లి ప్రసంగించనున్నారు. ఆరెస్సెస్ ప్రచారక్‌లుగా శిక్షణ పొందుతున్న వారికి ప్రణబ్ సూచనలు చేయనున్నారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది.అయితే కాంగ్రెస్‌కు బద్ధ శత్రువైన సంఘ్ ఆఫీస్‌కు వెళ్లి ప్రణబ్ ప్రసంగించడం ఏంటని చాలా మంది ఆశ్చర్యం వ్యక్తంచేశారు. దీనిపై కాంగ్రెస్‌ను ప్రశ్నించగా.. నో కామెంట్ అనేసింది. ప్రణబ్ ముఖర్జీనే అడగండి. నో కామెంట్ అనడం తప్ప మేమేమీ స్పందించలేం. అయితే మా సిద్ధాంతాలకు, వాళ్ల సిద్ధాంతాలకు చాలా తేడా ఉంది అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి టామ్ వడక్కన్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆరెస్సెస్ డైరెక్షన్‌లో నడుస్తుందన్న విషయం తెలిసిందే. సంఘ్ దేశాన్ని మతపరంగా విడగొడుతున్నదని, ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్‌తో నడిపిస్తున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీయే విమర్శిస్తుంటారు.అలాంటి సంఘ్ నిర్వహించే కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రణబ్ అంగీకరించడమే ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రణబ్ తమ దగ్గరికి రావడానికి అంగీకరించారంటే ఇన్నాళ్లూ ఆరెస్సెస్, హిందుత్వపై లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం దొరికినట్లే అని సంఘ్ నేత రాకేశ్ సిన్హా అన్నారు. అయితే ఆరెస్సెస్‌ను ఎప్పుడూ ద్వేషించే వ్యక్తిని ముఖ్య అతిథిగా పిలుస్తున్న సంఘ్ ఈ విషయంపై మరోసారి ఆలోచించుకోవాలని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ అన్నారు.
ప్రణబ్ వస్తే తప్పేంటి
తాము నిర్వహించబోయే ఓ కార్యక్రమానికి హాజరుకావాలంటూ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆర్‌ఎస్‌ఎస్ ఆహ్వానించింది. ఆ ఆహ్వానంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి గడ్కరీ స్పందించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నిర్వహించే వేడుకకు.. ప్రణబ్ వస్తే సంతోషమే అని అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రావడంలో తప్పేముందన్నారు. దేశ సౌభాగ్యం కోసం ఆర్‌ఎస్‌ఎస్ పనిచేస్తున్నదని, రాజకీయంగా దేశంలో ఎటువంటి అస్పృశ్యత ఉండకూడదని గడ్కరీ అన్నారు.