కాకినాడ ఫిబ్రవరి 5
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఏ చిన్న అవకాశం వదలకూడదని భావిస్తున్నాయి. అయితే ఉభయగోదావరి జిల్లాలతో పాటు కోస్తాంధ్ర పై రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని జగన్ భావిస్తున్నారు. అటు అమరావతి రాజధాని ఇష్యూ తో పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం ద్వారా అధికారంలోకి రావాలని టిడిపి, జనసేన గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాయి.గుంటూరు, కృష్ణాజిల్లాలో వైసిపి పై ఒక రకమైన వ్యతిరేకత ఉంది. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసి.. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని జగన్ సర్కార్ పై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. అయితే సంక్షేమ పథకాలతో ప్రజల ఆగ్రహాన్ని అధిగమించవచ్చని జగన్ భావిస్తున్నారు. అయితే ఆ రెండు జిల్లాల్లో స్వీప్ చేయాలని టిడిపి, జనసేన భావిస్తున్నాయి. ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాల్లో ఆ కూటమికి ఏకపక్ష విజయాలు దక్కుతాయని విశ్లేషణలు ఉన్నాయి. వీటికి కృష్ణా, గుంటూరు తోడైతే అధికారానికి కావలసిన మెజారిటీ స్థానాలు ఈ నాలుగు జిల్లాల్లో దక్కించుకోవచ్చు అని ఆలోచన చేస్తున్నారు. అమరావతిని నిర్వీర్యం చేయడం ద్వారా ప్రజల ఆశలను, ఆకాంక్షలను జగన్ దూరం చేశారని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయేది తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం అని తేల్చి చెప్పేందుకు ఒక రకమైన ప్రయత్నం ప్రారంభించినట్లు తెలుస్తోంది.కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మారుమూల ప్రాంతాలకు సైతం కొంతమంది పెద్దలు వెళుతున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారు నేరుగా అక్కడి రైతులతో సమావేశం అవుతున్నారు. ఎకరా రూ.30 లక్షల ధర ఉన్న ప్రాంతంలో రూ.90 లక్షలకు బేరం ఆడుతున్నారు. పది రూపాయల ప్రామిసరీ నోటు పై ఒప్పందం చేసుకుంటున్నారు. లక్ష రూపాయలు అడ్వాన్స్ గా చెల్లిస్తున్నారు. వాటిపై ఎటువంటి ఆధార్ కార్డు నెంబర్లు ధృవీకరించడం లేదు. మరి కొద్ది రోజుల్లో మిగతా మొత్తం చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుందామని చెప్పుకొస్తున్నారు. ఒకవేళ మేము రాకున్నా లక్ష రూపాయల అడ్వాన్స్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతున్నారు. అటు ఎటువంటి ఆధార్ ధ్రువీకరణ లేకపోవడం.. అడ్వాన్స్ రూపేనా ఇచ్చిన లక్ష రూపాయలు తిరిగి ఇచ్చే అవకాశం లేకపోవడంతో రైతులు కూడా సంతకం పెడుతున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో టిడిపి అధికారంలోకి వస్తుందని ఒక రకమైన లాజిక్ ప్లే చేసేందుకేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ రెండు జిల్లాల్లో ఇప్పటికే వైసీపీపై వ్యతిరేక భావన ఉంది. దానిని పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకునేందుకు ఈ సీక్రెట్ ఒప్పందం అని తెలుస్తోంది. టిడిపి అధికారంలోకి వస్తుందని ఒక నమ్మకం కల్పించడం ద్వారా.. ఆ రెండు జిల్లాల్లో ఏకపక్ష విజయానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.