YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సుజనా చౌదరి దారెటు

సుజనా చౌదరి దారెటు

విజయవాడ, ఫిబ్రవరి  5,
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో సుజనా చౌదరి ఒకరు. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. రాజ్యసభ పదవి ఇచ్చి.. కేంద్రమంత్రిగా కూడా అవకాశం ఇచ్చారు. అటువంటి సుజనా చౌదరి ఎన్నికల తరువాత బిజెపిలో చేరారు. చంద్రబాబు దగ్గరుండి బిజెపిలోకి పంపించారని కామెంట్ ఇప్పటికీ ఉంది. బిజెపిని తెలుగుదేశం పార్టీకి దగ్గర చేయాలని గత ఐదు సంవత్సరాలుగా సుజనా చౌదరి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ఆ ప్రయత్నాలేవీ పెద్దగా ఫలించలేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో బిజెపి కూడా ఒక నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి వచ్చింది.అయితే బిజెపి అనుకూల నిర్ణయం తీసుకుంటే ఒకలా..వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే మరోలా.. సుజనా చౌదరి డిసైడ్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పొత్తుకు బిజెపి అంగీకరిస్తే ఆ పార్టీ అభ్యర్థిగా..లేకుంటే తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది.ప్రస్తుతం గుంటూరు, విజయవాడ లోక్ సభ స్థానాలు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనవి. గత రెండు ఎన్నికల్లో ఈ రెండు సీట్లను టిడిపి సాధిస్తూ వచ్చింది. జగన్ ప్రభంజనంలో సైతం విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గల్లా జయదేవ్ లు టిడిపి అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం కేశినేని నాని పార్టీకి దూరమయ్యారు. వైసీపీలో చేరారు. అటు గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి నిష్క్రమించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఈ రెండు చోట్ల బలమైన అభ్యర్థులను బరిలో దించాలని టిడిపి భావిస్తోంది. అయితే ఈ రెండింటిలో ఒకచోట పోటీలోకి దిగాలని సుజనా చౌదరి భావిస్తున్నారు. అయితే అది ఎంతవరకు సాధ్యం అన్నది చూడాలి.సుజనా చౌదరిది కమ్మ సామాజిక వర్గం.గుంటూరు, కృష్ణా పార్లమెంట్ స్థానాల పరిధిలో ఆ సామాజిక వర్గం అధికం. దీంతో ఒకచోట సుజనా చౌదరిని రంగంలోకి దించితే సునాయాస విజయం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. అయితే బిజెపి పొత్తుకు సమ్మతిస్తే సుజనా చౌదరికి లైన్ క్లియర్ అయినట్టే. ఎందుకంటే సుజనా చౌదరి బిజెపి కంటే.. టిడిపి నాయకత్వానికి ఇష్టుడైన నేత. పేరుకే బిజెపి పొత్తు సీటు కానీ.. సుజనా చౌదరి చంద్రబాబుకు సొంత మనిషి. అయితే బిజెపి పొత్తుకు ముందుకు రాకుంటే మాత్రం సుజనా చౌదరి టిడిపిలో చేరే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆ రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఒకరిద్దరు ఎన్నారైలు సైతం తమ ప్రయత్నాల్లో ఉన్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే సుజనా చౌదరికి టిడిపి టికెట్ ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే వీలైనంతవరకు బిజెపిని పొత్తు కోసం ఒప్పించేందుకు సుజనా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అప్పుడే ప్రత్యక్ష ఎన్నికల్లో ఎంపి కావాలన్నా తన కోరిక నెరవేరే అవకాశం ఉంది.

Related Posts