విజయవాడ, ఫిబ్రవరి 6,
విచారణ తంతు ఎప్పుడో ముగిసింది.! నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, టీడీపీ రెబల్స్‌లో ఒకరు స్పీకర్ ముందు హాజరై వివరణ కూడా ఇచ్చేశారు!. మరి, స్పీకర్ నిర్ణయం ఏంటి?. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతోన్నవేళ స్పీకర్ ఏం చేయబోతున్నారు?. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు?.జనవరి 29నే స్పీకర్‌కు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి.. నేరుగా స్పీకర్ ముందు హాజరై తమ వాదనలు వినిపించారు. అయితే, తమపై అభియోగాలకు ఆధారాలు కావాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో తమ వాదనలు వినిపించేందుకు నాలుగు వారాల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కానీ, గడువు ఇచ్చేందుకు కుదరదని తేల్చిచెప్పిన స్పీకర్ కార్యాలయం.. లిఖితపూర్వక సమాధానాలు అందాయంటూ రెబల్ ఎమ్మెల్యేలకు అక్నాలెడ్జ్‌మెంట్ పంపింది. ఇక, నలుగురు టీడీపీ రెబల్ ఎమ్మె్ల్యేల్లో ఒక్కరే స్పీకర్ ముందు హాజరయ్యారు. వాసుపల్లి గణేష్ మాత్రమే వివరణ ఇవ్వగా… వివిధ కారణాలతో కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్ ఇప్పటివరకు అస్సలు హాజరే కాలేదు. అలాగే, జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా వివరణ ఇవ్వలేదు. దాంతో, రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. స్పీకర్ నోటీసులపై ఆల్రెడీ హైకోర్టును ఆశ్రయించారు YCP రెబల్ ఎమ్మెల్యేలు. అయితే ఈ దశలో జోక్యం చేసుకోలేమని చెబుతూనే, విచారణను వాయిదా వేసింది ధర్మాసనం. దాంతో, రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై న్యాయసలహా తీసుకున్నారు స్పీకర్. మరి, ఈ 9మంది రెబల్స్‌పై స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారు?. ఎమ్మెల్యేలు కోరినట్టుగా గడువు ఇస్తారా? లేక అనర్హత వేటేస్తారా?. వాట్ నెక్ట్స్? ఏం జరగబోతోంది?.