విశాఖపట్టణం, ఫిబ్రవరి 8
విశాఖపట్నం అనగానే గుర్తుకొచ్చేవాటిలో ఒకటి ప్రకృతి రమణీయమైన సముద్రం కాగా మరొకటి ఆంధ్రులు ఉద్యమించి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో 1966లో చేపట్టిన పోరాటాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ఇప్పుడు మళ్లీ అదే నినాదంతో పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంతో రాష్ట్రంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నా జగన్ సర్కారు మాత్రం ఏమి పట్టనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.విశాఖలో ఉక్కు కర్మాగారం సాధన ఉద్యమంలో 32 మంది ప్రాణత్యాగం చేశారు. పదహారు వేల మందికిపైగా నిర్వాసితులు 22 వేల ఎకరాలు తమ భూములను స్వలాభం చూసుకోకుండా కారుచౌకగా ప్రభుత్వానికి అప్పగించారు. అనేక త్యాగాల ఫలితంగా 1990లో ప్రారంభమైన విశాఖ ఉక్కు పరిశ్రమ 2021 నాటికి వార్షిక టర్నోవర్ రూ. 20 వేల కోట్లకు చేరి రూ. 945 కోట్లు నికర లాభం సాధించిందంటే, ఈ ఘనత విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో శ్రమిస్తున్న కార్మికులకు, అధికారులకే దక్కుతుంది.2021 నుండి విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ప్రభుత్వం వివక్ష ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్‌లో రూ. 910 కోట్లు కేటాయించి అంచనాల సవరణతో రూ. 603 కోట్లకు తగ్గించారు. 2023-24 బడ్జెట్‌లో కేటాయింపులను రూ. 683 కోట్లకు పరిమితం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధుల కేటాయింపులు తగ్గుతున్నా రాష్ట్రంలోని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం తన బాధ్యతగా కేంద్రాన్ని ప్రశ్నించ లేదు.దేశంలో కార్పొరేట్ వ్యవస్థ ఆధిపత్యం నడుస్తున్న ప్రస్తుత కాలంలో పారిశ్రామికవేత్తల కళ్లు పచ్చగా సాగుతున్న విశాఖ ఉక్కుపై పడ్డాయి. రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ పెద్దలు కూడా పరోక్షంగా దీనికి సహకరించడం రాష్ట్ర ప్రజల దురదృష్టకరం. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం ఫైనాన్షియల్ సబ్‌కమిటి 27.01.2021న ప్రకటించగా దీనికి వ్యతిరేకంగా స్టీల్‌ప్లాంట్ కార్మికులు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు ఉత్తరాంధ్ర చర్చావేదిక తరుపున వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తూ సంబంధిత మంత్రిత్వ శాఖలకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలిచ్చారు.
విశాఖ స్టీలు ప్లాంటుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి చొరవేది?
విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత రెండు సంవత్సరాలుగా కార్మికసంఘాలు, వివిధ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడంతో సమస్య పరిష్కారం కాకపోగా, మరింత జఠిలంగా మారింది.విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు గతంలో నిర్వహించిన ప్రజాగర్జన సభలో ఉద్యమానికి మద్దతుగా ఉంటామని చెప్పిన అధికార వైఎస్‌ఆర్‌సీపీ తన బాధ్యతను విస్మరించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రయవేటీకరణను అడ్డుకునే అవకాశమున్నా వైఎస్‌ఆర్‌సీపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. న్యాయమైన ఈ అంశంపై అన్ని రాజకీయపార్టీలు మద్దతును జాతీయస్థాయిలో కూడగట్టడంలో వైఎస్‌ఆర్‌సీపీ విఫలమైంది.కర్మాగారం కింద ఉన్న 22 వేల ఎకరాల భూములపై కన్నువేసిన కార్పొరేట్ సంస్థలకు కర్మాగారాన్ని నడిపే ఆలోచన ఏ కోశాన లేదు. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో లోపాయికారి ఒప్పందాలు జరుగుతున్నట్లు, కోట్ల రూపాయల నిధులు చేతులు మారే అవకాశం ఉన్నట్లు ఈ ప్రాంత ప్రజలలో ఉన్న అనుమానాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.విశాఖ స్టీల్ ప్లాంట్‌కు స్వంత గనులు లేకపోవడం వల్ల సంవత్సరానికి 2 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. 2021-22 వార్షిక టర్నోవర్ రూ. 20 వేల కోట్లు వరకు ఉన్నా కర్మాగారం నష్టాల్లో ఉందనే నెపంతో ప్రయివేటీకరణకు తలుపులు తెరిచారు. ఇందులో భాగంగా ఒడిస్సా మినరల్ డెవలప్‌మెంట్ కంపెనీకి విశాఖ ప్లాంట్ గనుల కోసం 2400 కోట్ల రూపాయలు డబ్బులు చెల్లించినా ప్రయివేటీకరణ కుట్రలో భాగంగా మైనింగ్ తవ్వకాలకి అనుమతులు ఇవ్వలేదు.2024లో రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయం కాబట్టి కేంద్ర ప్రభుత్వంపై కలిసికట్టుగా ఒత్తిడి తెచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ముందు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలను ఒక సదావకాశంగా మల్చుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రయత్నించకపోతే చివరి అస్త్రం జారవిడ్చుకున్నట్టు అవుతుంది.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణతో తమ బతుకులు రోడ్డున పడుతాయని ఉత్తరాంధ్ర ప్రజలు మధనపడుతున్నా ఇవేమీ పట్టని ముఖ్యమంత్రి జగన్, ఆయన మంత్రివర్గ సహచరులు రాజధాని తరలించడంపై దృష్టి పెట్టారు. విశాఖను రాజధాని చేద్దామనుకున్నా ప్రధాన ఆదాయ వనరులైన విశాఖ స్టీల్ ప్లాంట్ లేకుండా ఆర్థికంగా ఎలా నెట్టుకొస్తామనే ఆలోచన కూడా జగన్ ప్రభుత్వం చేయడం లేదు.విశాఖ నగరం అభివృద్ధిలో కీలకమైనవి కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు. అందులో సింహభాగం విశాఖ స్టీల్ ప్లాంట్‌దే. దాదాపు 30 వేల మంది ప్రత్యక్షంగా, మరో లక్ష మంది పరోక్షంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి జీవిస్తున్నారు.
నాడు ఈక్విటీగా మార్చి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశం తెరమీదకు రావడం ఇది మొదటిసారి కాదు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పి.వి.నరసింహారావు ప్రధాని మంత్రిగా ఉన్న సమయంలోనే ఈ ప్రయివేటీకరణ ప్రతిపాదనలు వచ్చాయి. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కలిసికట్టుగా పి.వి.నరసింహారావు గారిని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను విన్నవించగా ఆయన పెద్దమనస్సుతో అప్పుడు ప్లాంటుకు చెందిన ఎనిమిది వేల కోట్ల రూపాయల రుణాలలో నాలుగు వేల కోట్ల రూపాయాల రుణాలను కేంద్ర ప్రభుత్వం ఈక్విటీగా మార్చారు. అంతేకాక మరో రెండు వేల కోట్ల రుణాలను కూడా మాఫీ చేశారు.వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 1600 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఆదుకున్నారు.డా. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో దివంగత నేత, అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ముందు చూపుతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు బాటలు వేశారు. అందులో భాగంగా 12000 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖ స్టీల్ ప్లాంట్ సామర్థ్యాన్ని 3 మిలియన్ టన్నుల నుండి 7.3 మిలియన్ టన్నులకు పెంచి స్టీల్‌ప్లాంట్‌ను కాపాడిన ఘనత దివంగత నేత డా.వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డికి దక్కుతుంది.2021 ఫిబ్రవరి 2న కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ ప్రకటన చేయగా జగన్ సర్కారు మాత్రం మొక్కుబడిగా లేఖలు రాసి చేతులు దులుపుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మాంగనీసు, సిలికా ముడిపదర్థాలను ప్లాంట్‌కు లభించకుండా గనుల పునరుద్ధరణ లీజులను పథకం ప్రకారం తొక్కిపెట్టి ప్రయివేటీకరణకు పరోక్షంగా సహకరిస్తోంది.విశాఖ ఉక్కుకు మాదారంలోని డోలమైట్ గని లీజును తెలంగాణ 20 ఏళ్లు పొడిగించినా, ఏపీలోని విజయనగరం జిల్లా గర్భాంలోని మాంగనీస్ గనులు, నెల్లిమర్లలోని సిలికా, అనకాపల్లిలోని క్వార్డ్స్, మైనింగ్ లీజును జగన్ సర్కార్ పొడిగించ లేదు. కీలకమైన ఉక్కు, బొగ్గు పార్లమెంటరీ కమిటీలో వైసీపీ ఎంపీలు సభ్యులుగా ఉన్నా సక్రమంగా ముడిసరుకు సరఫరాపై వీరు గట్టిగా ప్రయత్నించలేదు.విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఆర్థికంగా ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచి బకాయిలు వెంటనే చెల్లించాలని కర్మాగారంపై ఒత్తిడి తెస్తోంది. నెలకు రూ. 500 కోట్ల చొప్పున నాలుగు నెలలకు సంబంధించి రూ. 2 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కోరింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించే కార్యాలయాలకు, గృహాలకు విశాఖ ప్లాంట్ స్టీల్‌ను వినియోగించాలని యాజమాన్యం కోరగా జగన్ సర్కార్ కంటితుడుపుగా ఒక కమిటీని వేసి మమ అనిపించింది.గంగవరం పోర్టులో పది శాతాన్ని జగన్ సర్కారు అదానీకి కట్టబెట్టడంతో వారు పోర్టులో హ్యాండ్లింగ్ చార్జీలను పెంచడంతో దానిపై ఆధారపడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్‌కనష్టం కలుగుతోంది. ప్లాంట్ ఆర్థిక ప్రయోజనాలకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.‘25 మంది ఎంపీలను గెలిపించి ఇవ్వండి. కేంద్రం మెడలు వంచి రాష్ట్ర హక్కులను కాపాడుతా. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో మాట్లాడి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించేలా చూస్తా’నని 2019 ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారు. ఆయన అధికారంలోకి వచ్చాక తనపై ఉన్న కేసుల ప్రభావంతో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఏమాత్రం ప్రశ్నించకుండా విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అన్నివిధాలా అన్యాయం చేశారు.ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవడానికి అన్ని రాజకీయపక్షాలు తమ జెండాలను, ఎజెండాలను పక్కనపెట్టి ఒక వేదిక మీదకు వచ్చి న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేయాలి. నిర్వాసితులందరికీ శాశ్వత ఉపాధి కల్పించి భూములను పంచాలి, విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత ఇనుప గనులు కేటాయించాలి, కర్మాగారాన్ని పూర్తి సామర్థ్యంతో నడిపించేందుకు తక్షణం 6 వేల కోట్ల రూపాయల రుణ సౌకర్యం కల్పించాలి. క్యాపిటల్ రీస్ట్రక్చర్ చేస్తూ ఐదు సంవత్సరాలు టాక్స్ హాలీడే ప్రకటించాలి. వీటితోపాటు అనేక విభాగాల్లో ఉన్న సుమారు ఐదు వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి.న్యాయమైన డిమాండ్ల సాధనకు స్వంత ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల హక్కు అయిన విశాఖస్టీల్ ప్లాంటును కాపాడుకోవడానికి ప్రతీ ఒక్కరు ‘‘ఉక్కు సంకల్పం’’తో ముందుకు సాగుతూ విశాఖ స్టీల్ పరిరక్షణే లక్ష్యంగా ఆంధ్రులు, ఉత్తరాంధ్ర ప్రజలు వజ్రాయుధమైన తమ ఓటుతో సరైన తీర్పునిచ్చి కేంద్రప్రభుత్వ రాష్ట్రాల కళ్లు తెరిపించాలి