YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీఎం షేరింగ్ అంటే...

సీఎం షేరింగ్ అంటే...

తిరుపతి, ఫిబ్రవరి 9
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తుకు సిద్దమయ్యారు. ఆయన ఎప్పటి నుంచో బీజేపీతో కలసి ప్రయాణం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆయన టోన్ మార్చేశారు. అప్పటి వరకూ ప్రత్యేక హోదా ఇవ్వని ఎన్డీఏ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు మోదీపై ఎన్నికల సందర్భంగా వ్యక్తిగత విమర్శలకు కూడా దిగారు. అప్పటి ఎన్నికల ప్రచారంలో అమిత్ షా సయితం చంద్రబాబును తమ పంచన చేరనీయమని తెగేసి చెప్పారు. అయితే రాజకీయాలు కాబట్టి ఏవైనా జరగొచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చు. అందులో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. దాదాపు కొన్నేళ్ల పాటు ఢిల్లీ వైపు కూడా చూసేందుకు చంద్రబాబు ఇష్టపడలేదు. మోదీ అండ్ కో కు తన ఫేస్ ను చూపించలేక ఆయన ఏపీకే పరిమితమయ్యారు. ఆ తర్వాత వివిధ సమావేశాలకు హాజరవుతూ దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. తాజాగా చంద్రబాబు ఢిల్లీ ప్రయాణమవుతున్నారు. ఈరోజు ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. అయితే మోదీని కలిసే అవకాశం ఉండకపోవచ్చు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ, కుదిరితే అమిత్ షాతో సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఎల్లుండి ఆయన వారితో సమావేశమై వచ్చే ఎన్నికల్లో పొత్తులు, సీట్లు సర్దుబాటు వంటి అంశాలపై చర్చించనున్నారు.  కాకుంటే ఇప్పుడు బీజేపీతో పొత్తు వల్ల చంద్రబాబుకు ఎంత మేరకు లాభం? ఏ విధంగా నష్టమన్న చర్చ జరుగుతుంది. లీడర్ల నుంచి క్యాడర్ వరకూ పొత్తు వద్దే వద్దంటున్నారు. అయితే పొత్తు కుదుర్చుకోవడానికి బీజేపీ ఎలాంటి షరతులు విధిస్తుందన్న టెన్షన్ టీడీపీలో ఉంది. ఒకవేళ బీజేపీ ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అంటుందేమోనన్న బెంగ కూడా లేకపోలేదు. చంద్రబాబు రెండున్నరేళ్లు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండున్నరేళ్ల పాటు సీఎం పదవి ఉంటేనే తాము పొత్తుకు సిద్ధమవుతామని చెప్పే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం. ఎందుకంటే పొత్తు బీజేపీ కంటే చంద్రబాబుకే అవసరం ఎక్కువగా కనిపిస్తుంది. ఎలక్షనీరింగ్ చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు తప్పనిసరి. జగన్ ను ఎదుర్కొనాలంటే మోదీ మద్దతు తప్పనిసరి. అయితే సీఎం పదవి షేరింగ్ కు చంద్రబాబు అంగీకరించరని సైకిల్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  అవసరమైతే సీట్లు ఎక్కువగా ఇస్తారమో కాని, షేరింగ్ ను మాత్రం అంగీకరించబోరంటున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పై ఎంత వ్యతిరేకత ఉందో? బీజేపీపై కూడా అదే స్థాయిలో వ్యతిరేకత ఉంది. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించకపోవడం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ వంటి అంశాలతో బీజేపీ ఓట్ల శాతం కూడా ఒక శాతానికి మించవు. అలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని వర్గాలు దూరమవ్వడమే కాకుండా, చంద్రబాబు అండ్ కో కు మరింత ఇబ్బంది అని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం కమలానికి ఓట్లు లేకపోయినా.. ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుకునేందుకు తమకు సానుకూల వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Related Posts