YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కష్టాల ఎదురీ'గీ'త

కష్టాల ఎదురీ'గీ'త
విశాఖపట్నం, మే 30, 2018 (న్యూస్ పల్స్)    
విశాఖపట్నం జిల్లాలో కల్లుగీతపై ఆధారపడ్డ కార్మికులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గుర్తింపు కార్డులు ఉన్నవారు 15వేల మంది ఉన్నారు. వాస్తవానికి కల్లుగీత ఓటర్లు 8 లక్షల 50వేల మంది ఉన్నారు. వీరందరికి ప్రభుత్వం తరపున అందాల్సిన సహాయసహకారాలు పూర్తి స్థాయిలో అందడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో 13 జిల్లాల్లో 2,200 సొసైటీలు ఉన్నాయి. 2500లు పిఎఫ్‌టిలు ఉన్నాయి. గీత వృత్తినే నమ్ముకొని ఐదు లక్షల కుటుంబాలు జీవనాధారంగా జీవిస్తున్నారు. 50 ఏళ్లు దాటిన వారికి 350 జిఒ ప్రకారం ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలి. కానీ అరకొరగా మంజూరు చేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. అనాధిగా కులవృత్తినే నమ్ముకున్నతమ బతుకులు దినదినగండంగా మారిందని  కల్లుగీత కార్మికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వేసవి కాలంలో మాత్రమే ఉపాధి లభించే కల్లు గీతతో కుటుంబపోషణ పెనుభారంగా మారిందని అంటున్నారు. ఏడాది అంతటా పూట గడవక పస్తులు ఉండాల్సి వస్తోందని అంటున్నారు. మొత్తంగా జిల్లాలో కల్లుగీత కార్మికులు అభివృద్ధికి దూరంగా ఉంటున్న పరిస్థితి నెలకొంది.
 
వేసవి కాలంలో 3, 4 నెలలు కల్లు లభించే సమయంలోనే గీత కార్మికులకు ఎంతోకొంత దక్కుతుంది. మిగిలిన కాలమంతా వారికి కష్టాలే. కల్లు వ్యాపారంలో భార్యాభర్తలిద్దరూ రోజంతా కష్టపడితే రూ.300 మాత్రమే వస్తోంది. దీంతో కుటుంబాలు నెట్టుకురావడం భారంగా మారిందని కార్మికులు అంటున్నారు. రైతుల పొలాల్లోని తాటి చెట్లను గీత కార్మికులు ఏడాదికి గీతకు లీజుకు తీసుకుంటారు. చెట్టుకు రూ.300 వరకు లీజు చెల్లిస్తారు. ఈ చెట్టు నుంచి తీసిన కల్లును విక్రయించుకోవాలంటే ఎక్సైజ్‌శాఖకు శిస్తు చెల్లించాలి. ఎంతో కాలంగా శిస్తు రద్దు చేయాలని గీత కార్మికులు కోరుతున్నా ఈ విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలేదని కార్మికులు చెప్తున్నారు. ఇలా లీజులు, శిస్తులు చెల్లించగా చేతిలో మిగులుతున్నది కొద్ది మొత్తమే అని వాపోతున్నారు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా రోజు గడవడం కష్టంగా మారుతోందని చెప్తున్నారు. వృత్తినే నమ్ముకుంటే పొట్ట కూటి కోసం కష్టాలు తప్పడం లేదని అందుకే కూలీ పనులకు వెళ్తున్నామని పలువురు చెప్తున్నారు. మరోవైపు ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి కిందపడి గాయపడితే వైద్యసాయం పొందేందుకూ కార్మికులు నానాపాట్లు పడుతున్నారు. అధికారులు అనేక షరతులు పెడుతుండడం వల్లే ఈ సమస్య అని అంటున్నారు. ఇక ప్రాణాలు పోతే దిక్కేలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి గీత కార్మికుల జీవితాలు మెరుగుపరచేందుకు చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.

Related Posts