శ్రీకాకుళం, ఫిబ్రవరి 9
ఎచ్చెర్ల వైసీపీలో ఇంటి పోరు దాదాపుగా సద్దుమణిగింది. అభ్యర్థి మార్పు విషయంలో హైకమాండ్ ఎలాంటి సూచనలు ఇవ్వకపోవడంతో ఇతర నేతలు తమ ప్రయత్నాలు మానుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల వైసీపీలో ఇంటి పోరు సిటింగ్ ఎమ్మెల్యేకు చుక్కలు చూపిస్తోంది. గడిచిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి గొర్లె కిరణ్ కుమార్.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుపై విజయం సాధించారు. సుమారు 18 వేల ఓట్లకుపైగా తేడాతో ఆయన ఘన విజయాన్ని నమోదు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ గొర్లె కిరణ్ కుమార్ మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ, ఆయనకు ఇంటి పోరు పెద్ద సమస్యగా పరిణమించింది. గొర్లె కిరణ్ కుమార్ బావమరిది రణస్థలం ఎంపీపీ పిన్నింటి సాయి కుమార్, మేనల్లుడు కంది నాని రూపంలో ఆయనకు ఇబ్బందికర పరిస్థితి ఎదువుతోంది. వీరిద్దరూ కిరణ్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతుండడంతో ఏం జరుగుతుందన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది. రాజ్యసభ ఎన్నికలు ఉండడంతో ఈ జిల్లాలోని సీట్ల వ్యవహారంపై వైసీపీ అధిష్టానం చర్చలు జరపడం లేదు. సిటింగ్‌లకే అవకాశాలు కల్పించినట్టు అధిష్టానం నుంచి హామీ లభించినట్టు చెబుతున్నారు. కానీ, రాజ్యసభ ఎన్నికలు పూర్తయ్యేంత వరకు సైలెంట్‌గా ఉండాలని భావించిన వైసీపీ అధిష్టానం.. వ్యూహాత్మకంగానే సిటింగ్‌లకు సీట్లు అన్న అంశాన్ని తెరపైకి తీసువచ్చినట్టు చెబుతున్నారు. రాజ్యసభ ఎన్నికలు తరువాత జిల్లాలోని రెండు, మూడు స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఖాయమని చెబుతున్నారు. అందులో ఎచ్చెర్ల ఉంటుందని కిరణ్ వ్యతిరేక వర్గీయులు ప్రచారం చేస్తుంటే.. కిరణ్‌కు టికెట్ కన్ఫార్మ్ అయినట్టు ఆయన వర్గీలు చెబుతున్నారు. కిరణ్‌కు టికెట్ ఇవ్వవద్దంటూ నియోజకవర్గంలోని పలువురు నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేశారు. వీరిలో లుకలాపు అప్పలనాయుడు వంటి నేతలు తమకు టికెట్ కేటాయించాలంటూ కీలక నేతలు చుట్టూ తిరుగుతున్నారు. సొంత బావ మరిది పిన్నింటి సాయి కుమార్ అయితే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమాంతరంగా మరో వర్గాన్ని నడుపుతున్నారు. ఈయన విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఆయన చుట్టూ తన అనుయాయులను వెంట బెట్టుకుని తిరుగుతున్నారు. కొద్దిరోజులు నుంచి సైలెంట్‌గా ఉన్నప్పటికీ తన ప్రయత్నాలను మాత్రం ఆయన వెనుక నుంచి కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే మరో బంధువు కంది నాని కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నించారు. మంత్రి బొత్స అండదండలు తనకు పుష్కలంగా ఉన్నాయని, తనకు టికెట్ ఖాయమని అని చెబుతూ వస్తున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించలేదు గానీ.. తనకు టికెట్ కోసం మాత్రం ఈయన సైలెంట్‌గా పని చేసుకుంటూ వెళ్లారు. కానీ, వైసీపీ అధిష్టానం జిల్లాలో మార్పులు చేయడం లేదన్న ప్రకటనతో ఈయన సైలెంట్ అయిపోయారు. ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానం నుంచి కిరణ్ కుమార్ పోటీకి గ్రీన్ సిగ్నల్‌ను అధిష్టానం ఇచ్చిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే తన అనుచరులు వద్ద అదే చెబుతున్నారు. కానీ, రాజ్యసభ ఎన్నికలు నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఈ మాటను చెప్పిందా.? లేక నిజంగానే ఖరారు చేసిందా..? అన్న విషయం తేలాల్సి ఉంది. ఈ నియోజకవర్గంపై ఇద్దరు కీలక నేతలు కర్చీప్ వేసి ఉంచారు. ఇది కూడా అభ్యర్థి మార్పుపై ఊహాగానాలకు తీవిస్తోంది. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు మండలాలకు చెందిన నేతలతో ఆయన టచ్‌లో ఉన్నారు. కానీ, ఆయన ఎక్కడా ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పడం లేదు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయన బరిలో దిగే చాన్స్ ఉంది. ఒకవేళ ఎంపీ స్థానానికి చిన్న శ్రీను వెళ్లాల్సి వస్తే.. సిటింగ్ ఎంపీకి స్థానం చలనం కల్పించి.. ఇక్కడకు పంపించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎంపీకి ఈ నియోజకవర్గంలో బంధు వర్గం కూడా ఉందని చెబుతున్నారు. ఇవన్నీ, సిటింగ్ ఎమ్మెల్యే కిరణ్ కుమార్‌కు ఇబ్బందిగా పరిణమిస్తున్నాయి. కిరణ్ మాత్రం తనకే టికెట్ వస్తుందని బలంగా చెబుతున్నారు. ఒకవేళ టికెట్ రాకపోతే మాత్రం.. ఇంటిపోరే కిరణ్ కొంప ముంచినట్టు అవుతుందని పార్టీ ముఖ్య నాయకులే పేర్కొంటున్నారు.