న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9,
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశంలోనే అత్యంత సంక్లిష్టంగా కనిపిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రింగ్ మాస్టర్ గా మారింది. అన్ని పార్టీలు బీజేపీతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటున్నాయి. ఎవరూ బీజేపీని వ్యతిరేకించడం లేదు. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో బీజేపీతో కలిసి అధికారిక మిత్రపక్షంగా మారాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. వైఎస్ఆర్‌సీపీ కూటమిలో చేరకపోయినా టీడీపీ కంటే నమ్మకమైన మిత్రపక్షంగా ఉంటామని సంకేతాలు పంపుతోంది. ఇలాంటి సమయంలో బీజేపీ హైకమాండ్ చంద్రబాబు, జగన్ లో రెండు రోజుల్లో వేర్వేరుగా సమావేశం కావడం సంచలనంగా మారింది.బీజేపీతో పొత్తులపై టీడీపీ ఇప్పటి వరకూ బహిరంగంగా ఒక్క మాట మాట్లాడలేదు. ఎన్డీఏలో చేరే అంశంపైనా స్పందించలేదు. గతంలో ఓ సారి అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. ఆ సమావేశం వివరాలు కూడా బయటకు రాలేదు. ఇప్పుడు ఎన్నికలకు ముందు మరోసారి ఢిల్లీ వెళ్లి వారిద్దరితో సమావేశం అయ్యారు. కానీ అంతర్గతంగా జరుగుతున్న చర్చల వివరాలు బయటకు రాలేదు. కేంద్రంలో వచ్చే సారి కూడా బీజేపీ గెలవడం ఖాయమని అంచనా వేస్తున్న సమయంలో బీజేపీ మద్దతు అవసరమని భావించి ఎన్డీఏ కూటమిలో చేరేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని చెబుతున్నారు. కానీ ఈ విషయంలో ఏ అడుగూ స్మూత్ గా పడటం లేదని .. టీడీపీ వైపు నుంచి పాజిటివ్ గా ఒక్క ప్రకటన కూడా రాకపోవడాన్ని అర్థం చేసుకోవచ్చు.మరో వైపు బీజేపీతో తెగదెంపులు అనే మాటను వినడానికి పవన్ కల్యాణ్ ఇష్టపడటం లేదు. కానీ ఆయన అధికారికంగా టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ కూడా కూటమిలోకి రావాలని గట్టిగా కోరుతున్నారు. ఏపీలో ఓ సారి పొత్తులపై పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశం తర్వాత పొత్తులు కావాలంటే చంద్రబాబుతో చెప్పించాలని పవన్ కు.. బీజేపీ నేత సత్యకుమార్ సలహా ఇచ్చారు. ఆ తర్వాత అంతర్గతంగా జరిగిన పరిణామాలేమిటో తెలియదు కానీ చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. పవన్ కూడా వెళ్లనున్నారు. అయితే చంద్రబాబుతో భేటీ ముగిసిన తర్వాత.. ఎం జరిగిందో బయటకు రాక ముందే ఏపీ సీఎం జగన్ కు ఆహ్వానం పలికారు అమిత్ షా, ప్రధానమంత్రి మోదీ. అమిత్ షా , జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీ ముగిసిన తర్వాతి రోజే సీఎం జగన్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ ఖరారైందని ఆయనకు సమాచారం వచ్చింది. దీంతో గురువారం సాయంత్రం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ప్రధానితో భేటీ అని ప్రచారం జరిగినప్పటికీ అమిత్ షాను కూడా కలిశారు. అక్కడే అసలు రాజకీయం ఉందన్న అభిప్రాయం ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని.. చంద్రబాబుతో భేటీ విషయంలో అంత సంతృప్తికరంగా లేకపోవడంతోనే ఉన్న పళంగా జగన్ కు అపాయింట్ మెంట్లు ఖరారు చేశారని అంటున్నారు. వైసీపీ అధనేత, సీఎం జగన్ తో ఖచ్చితంగా రాజకీయాలే చర్చించి ఉంటారని.. అంచనా వేస్తున్నారు. ఏపీలో ఇరవై ఐదు లోక్ సభ సీట్లు ఉన్నాయి. ఏ పార్టీ గెలిచినా ఆ సీట్లన్నీ బీజేపీకే మద్దతుగా ఉంటాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లుగా నేరుగా చెప్పకపోయినా అదే విధంగా మద్దతు ఇచ్చారు. బేషరతతు మద్దతు ఇచ్చి బీజేపీ హైకమాండ్ పెద్దల అబిమానాన్ని చూరగొన్నారు. ఈ విషయంలో జగన్ పై వ్యతిరేకత పెంచుకోవాల్ిన అవసరం బీజేపీ హైకమాండ్ కు లేదు. ఇప్పటికిప్పుడు టీడీపీతో జత కట్టడం ద్వారా వైసీపీకి వ్యతిరేకవ్వాల్సిన అవసరం ఏముందన్న ఆలోచన కూడా బీజేపీ హైకమాండ్ కు ఉండొచ్చని చెబుతున్నారు. ఏదో ఓ పార్టీతో పొత్తులో వెళ్లడం వల్ల మరో పార్టీ వ్యతిరేకం అవుతుంది. అలాంటి పరిస్థితిని ఎందుకు కల్పించుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో బలపడటం బీజేపీ టార్గెట్. దాని కోసం ఎలాంటి చిన్న అవకాశాన్ని వదిలే అవకాశం లేదు. పొత్తుల్లో భాగంగా అత్యధిక ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తే టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆ పార్టీ ముఖ్య నేతలందరికీ ఎంపీ టిక్కెట్లు లభిస్తే.. మొగ్గు ఉంటుందని అంటున్నారు. మొత్తంగా ఏపీలో బీజేపీ హైకమాండ్ ఎవరూ ఊహించని పొలిటికల్ గేమ్ ఆడుతోందన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది.