YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాళేశ్వరం తర్వాత సెక్రటేరియెట్

కాళేశ్వరం తర్వాత సెక్రటేరియెట్

హైదరాబాద్, ఫిబ్రవరి 9
తెలంగాణ పరిపాలనా సౌధం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ నూతన సచివాలయం నిర్మాణంలో అవినీతి  జరిగిందని  ప్రభుత్వం అనుమానిస్తోంది.  ఆ భవనానికి అయిన ఖర్చు విషయంలో క్లారిటీ లేదు.  ఈ భారీ నిర్మాణానికి అయిన ఖర్చెంత అంటే ఇతమిద్దంగా ఇంత అని చెప్పలేని పరిస్థితి ఇప్పుడు అధికారవర్గాల్లో కనిపిస్తున్నది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక భవనానికి చేసిన వ్యయం విషయంలో అవినీతి, అక్రమాలు జరిగాయనే ఆరోపణలను  చాలా సార్లు కాంగ్రెస్ చేసింది. తాము అధికారంలోకి వచ్చాక  విచారణ చేయిస్తామని చెప్పింది. ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు.  సచివాలయం నిర్మాణం లో జరిగిన కొన్ని పనులకు అసలు టెండర్లే పిలవక పోవడంతో అవినీతి జరిగిందని విచారణ జరిపించడనికి రేవంత్ రెడ్డి సర్కార్‌కు ఓ అవకాశం లభించినట్లయింది.   ప్రధానంగా ఐటీకి సంబంధమైన పనుల విషయంలో వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుని అమలుచేశారనే అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయం సెక్యూరిటీతోపాటు అంతర్గతంగా అవసరమైన ఎలక్ట్రానిక్‌, కంప్యూటర్‌ సంబంధమైన నెట్‌వర్కింగ్‌ పరికరాలు, సాఫ్ట్‌వేర్‌, ఇతరాలకు దాదాపు రూ. 300 కోట్లు ఖర్చు చేశారు. అంత భారీగా ఖర్చవడానికి అవకాశం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎంత అత్యాధునికమైన నెట్ వర్క్ కోసం ఖర్చు పెట్టినా యాభై కోట్ల లోపే ఉంటుందంటున్నారు. సెక్రటేరియట్  భవనానికి తొలుత వ్యయం రూ.550 కోట్లుగా డీపీఆర్‌లో పేర్కొన్నారు. అందులో జీఎస్‌టీ మొత్తం కూడా ఉన్నట్టు అప్పట్లో ఆర్‌అండ్‌బీ అధికారులు చెప్పారు.  ఆ తర్వాత రూ. 611 కోట్లకు అంచనాలు పెంచారు. శంకుస్థాపన చేసిన తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పెద్దలు భవనానికి సంబంధించి పలు అంశాల్లో సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు పోయారు. సచవాలయ భవనం ప్లాన్‌ అనేక మార్పులు, చేర్పులు చేశారు.   ఆస్కార్‌ అర్కిటెక్స్‌ కంపెనీ సచివాలయాన్ని డిజైన్‌ చేసింది. షాపూర్జీ-పల్లోంజీ సంస్థ నిర్మించింది. తొలుత 2022 , అక్టోబర్‌ దసరా పండుగ రోజున సచివాలయాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. అయితే నిర్మాణం ఆలస్యం కావడంతో గత ఏడాది ఏప్రిల్‌ 30 ప్రారంభించారు. మే 30 నుంచి సచివాలయం అధికారికంగా విధుల్లోకి వచ్చింది. సచివాలయం చుట్టుతా నిర్మించిన దేవాలయం, మసీదు, చర్చీ ఖర్చు కూడా తొలుత డీపీఆర్‌లో చేర్చలేదు. కొత్తగా రోడ్లు సైతం చివరలో వేయాల్సి వచ్చిందనీ, దీంతో సచివాలయం భవన నిర్మాణం ఖర్చు తడిసిమోపెడైందని అంచనా వేస్తున్నారు. సెక్రటేరియట్ నిర్మాణం మొత్తం ఖర్చు రూ.1440 కోట్ల దాకా అయినట్టేనని అధికారులు అంటున్నారు. ఇదిలావుండగా సచివాలయంలో ఇప్పటికీ చేయాల్సిన పనులు ఇంకా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం  ఖర్చులో   రూ.100 కోట్లు ఫర్నీచర్‌కే ఖర్చు చేయడం గమనార్హం. అలాగే జీఎస్టీ మొత్తం రూ. 100 నుంచి రూ. 150 కోట్లు ఉందని చెబుతున్నారు. కీలకమైన నెట్‌వర్కింగ్‌ ఖర్చు మాత్రం రూ.300 కోట్లు ..  నిధులు ఎలాంటి టెండర్లు లేకుండా ఖర్చుపెట్టారని అంటున్నారు.  సచివాలయం ప్రారంభానికి అప్పటి ప్రభుత్వం తొందరపడిందనీ, పనులు పూర్తి కాకముందే చేసిందనే వ్యాఖ్యానాలు అప్పట్లోనే వచ్చాయి. టెండర్లు పిలిచే సమయం లేకపోవడంతో కంపెనీల నుంచి నేరుగా కంప్యూటర్లు, ఇతర పరికరాలు కొనాల్సి వచ్చిందని ఐటీ శాఖ ఉన్నతాధికారులు కంగారు పడుతున్నారు. విచారణకు ఆదేశిస్తే.. కొంత మంది అధికారులు ఇబ్బంది  పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related Posts