YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తెలుగు రాష్ట్ర్రాల్లో టీడీపీ ఒంటరి పోరే

తెలుగు రాష్ట్ర్రాల్లో టీడీపీ ఒంటరి పోరే

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు జాతీయ పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఏపీలోనూ, తెలంగాణలోనూ ఎవరితో పొత్తులతో చంద్రబాబు వెళతారా? అన్న ఆసక్తి తెలుగు తమ్ముళ్లలో నెలకొంది. మహానాడులో ఎక్కడ నలుగురు కలిసినా దీని గురించే చర్చించుకోవటం విన్పించింది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ నెగ్గుకు రాగలదా? అన్న సందేహం కూడా తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. ప్రధానంగా తెలంగాణ, ఏపీకి చెందిన ముఖ్య నేతలు కలుసుకున్నప్పుడు ఇదే చర్చించుకుంటూ కన్పించారు.ఆంధ్రప్రదేశ్ లో ఈసారి తెలుగుదేశం పార్టీది విచిత్రమైన పరిస్థితి. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల మద్దతుతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి ఈసారి ఆ ఛాన్స్ లేదు. బీజేపీతో ఇటీవలే కటీఫ్ చెప్పేయడంతో ఆ పార్టీనే ప్రధాన శత్రువుగా పరిగణిస్తోంది. కాంగ్రెస్ తో తొలి నుంచి కొంత సఖ్యతగా ఉన్నా రాష్ట్ర విభజన చేసిన పార్టీతో పెట్టుకుంటే అది తెలుగుదేశం పార్టీకి దెబ్బేనన్నది అందరికీ తెలిసిందే. ఇప్పటికీ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ పైన ఏపీ ప్రజలుకోపంగా ఉన్నారు. దీంతో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తుకు వెళ్లే ఛాన్స్ లేదు. జనసేన కూడా తనకు మద్దతు తెలపదని తేలిపోయింది.జనసేనాని పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీనే తన టార్గెట్ గా పెట్టుకున్నారు. సో…జనసేనపై ఆ ఆశలు లేవు. ఇక మిగిలింది కమ్యునిస్టులే.కమ్యునిస్టులు ఇప్పటి వరకూ ఎటూ తేల్చకపోయినా… వారు జనసేన వైపే మొగ్గు చూపుతున్నారు. చంద్రబాబు తో కలసి వెళ్లినందున తమకు ప్రత్యేకంగా ఒరిగేదేమీ లేదని కామ్రేడ్లు భావిస్తున్నారు. అందువల్ల ఏపీలో ఖచ్చితంగా ఒంటరిగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. చంద్రబాబు కూడా మానసికంగా అందుకు సిద్ధమయినట్లే కన్పిస్తోంది. తెలంగాణలోనూ చంద్రబాబు పార్టీది అదే పరిస్థితి. తెలంగాణలో టీడీపీతో పొత్తుకు కాంగ్రెస్ సిద్ధమవుతున్నా చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారు. తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే ఆ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ పార్టీపై పడుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ అదే పార్టీతో జత కడితే తప్పుడు సంకేతాలు వెళతాయని కూడా భావిస్తున్నారు. ఇక బీజేపీతో కూడా తెలంగాణలో రాంరాం చెప్పేశారు. ఇక మిగిలింది అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కటే. అయితే కేసీఆర్ కు కొంత సానుకూలత వాతావరణం కన్పిస్తోంది. చంద్రబాబు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమయినా కేసీఆర్ అందుకు అంగీకరిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే తెలుగుదేశంలో బలమైన నేతలు కారు పార్టీలోకి వచ్చేశారు. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే ఆంధ్రాపార్టీతో పొత్తుపెట్టుకున్నారన్న అపప్రథను తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందుకే టీఆర్ఎస్ కూడా పొత్తు విషయమై ఆలోచించి అడుగులేస్తుందంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు పార్టీ రెండు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి.

Related Posts