YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జర్నలిస్ట్ నుంచి ప్రధాని దాకా

జర్నలిస్ట్ నుంచి ప్రధాని దాకా

కరీంనగర్, ఫిబ్రవరి 9
మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న'ను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఆయన పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. తెలంగాణలోని వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో 1921, జూన్ 28న రుక్నాబాయి, సీతారామారావు దంపతులకు పీవీ జన్మించారు. ఆ తర్వాత పూర్వపు కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు అతన్ని దత్తత తీసుకోవడంతో పాములపర్తి వెంకట నరసింహారావు అయ్యారు. చదువుల అనంతరం ఆయన రాజకీయాలపై అడుగులు వేశారు. 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా  మంథని నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1962, 1967, 1972లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన అనంతరం ఆయనకు మంత్రి పదవి దక్కింది. తొమ్మిదేళ్ల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పని చేశారు.
1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఏపీ సీఎంగా నియమించింది. రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన.. రాష్ట్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. 1977లో హనుమకొండ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఎన్నికైన అనంతరం పీవీ కేంద్ర కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. 1991లో దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించి.. 1996 వరకూ సేవలందించారు. దేశ అత్యున్నత పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. దేశం విదేశీ నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో పీవీ.. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ వంటి ఆర్థిక సంస్కరణలతో గాడిన పెట్టారు.

నూతన ఆర్ధిక శకానికి  నాంది
ప్రధాని పదవిని అలంకరించిన తొలి దక్షిణ భారతీయులు, ఒకేఒక తెలుగువారు పీవీ నరసింహా రావు. 1991 నుండి 1995 వరకు ఆన ప్రధానిగా ఉన్నారు. బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు బీజంవేసిన అపర చాణక్యులు. కుంటుతున్న భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరణ విధానాల ద్వారా పట్టాలెక్కించిన వారు. నాడు తగిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడిపంచారు. మన్మోహన్ సింగ్ సహకారంతో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల దేశం ముందుకు సాగేందుకు ఉపయోగపడ్డాయి.పీవీ నర్సింహా రావు భారత తొమ్మిదవ ప్రధాని. హిందీయేతర బెల్ట్ నుండి రెండో ప్రధాని. దక్షిణాది నుండి తొలి ప్రధాని. రాజీవ్ గాంధీ హత్య అనంతరం కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోవడంతో పీవీ నర్సింహా రావు ఆమోదయోగ్యుడిగా కనిపించారు. అప్పటికి ఆయన దాదాపు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, నంద్యాల నుండి గంగుల ప్రతాప్ రెడ్డితో రాజీనామా చేయించి, లోకసభకు పంపించారు. తెలుగువాడు కావడంతో ఎన్టీఆర్ నాడు టీడీపీ తరఫున పోటీ పెట్టలేదు. నెహ్రూ-గాంధీయేతర కుటుంబం నుండి క్లిష్ట సమయంలో పూర్తికాలం పూర్తి చేసుకున్న మొదటి ప్రధాని పీవీ.  1990 చివరి నాటికి భారత ఆర్థికపరిస్థితులు దారుణంగా ఉన్నాయి.ద్రవ్యోల్భణం ఆకాశాన్ని అంటింది. చమురు ఖరీదుగా మారింది. దిగుమతికి తగినంత విదేశీ మారకద్రవ్యం లేదు. చేతిలోని విదేశీ మారకద్రవ్యపు నిల్వలు మూడు వారాలకే సరిపోతాయి. 1991 జనవరి నాటికి ప్రభుత్వం దివాళా తీసే పరిస్థితి. రుపాయి విలువ పడిపోయింది. అప్పులు పుట్టలేదు.పీవీకి ముందు  బంగారాన్ని తనఖా పెట్టి కొంత సొమ్ము తెచ్చి, అప్పులు తీర్చాల్సిన దుస్థితి.  67 టన్నుల బంగారాన్ని విమానాంలో ఇంగ్లాండ్‌కు పంపి  ఐఎంఎఫ్ వద్ద కుదువపెట్టి 2.2 బిలియన్ డాలర్ల రుణం తెచ్చారు. ద్రవ్యలోటు 12.7 చారిత్రక గరిష్టానికి చేరుకుంది. ప్రభుత్వ రుణం జీడీపీలో 53 శాతానికి చేరుకుంది. అప్పటి నుంచి సంస్కరణలు అమలు చేశారు.  దేశాన్ని ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించేందుకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులకు అవకాశం కల్పించారు. చెల్లింపుల సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు రూపాయి విలువ తగ్గించారు. దీనిని రెండు విడతలుగా తగ్గించారు. 1991 జూలై 1 9 పైసలు, ఆ తర్వాత రెండు రోజులకు మరో 11 పైసలు తగ్గించారు. ఆయన సంస్కరణల వల్ల దీంతో ద్రవ్యోల్భణం తగ్గి, ఎగుమతులు పెరగడానికి అవకాశం ఏర్పడింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల ఉపసంహరణను ప్రతిపాదించారు. పన్ను సంస్కరణలు తెచ్చారు. ఇవి ఆదాయం పెరిగి, ఖర్చులు తగ్గేందుకు దోహదపడ్డాయి. మన్మోహన్ సింగ్‌ను కేంద్ర ఆర్థికమంత్రిగా నియమించారు.వడ్డీ రేట్లకు సంబంధించి బ్యాంకులకు స్వేచ్ఛ ఇచ్చారు. ప్రయివేటు బ్యాంకుల ఏర్పాటుకు వీలు కల్పించి పోటీతత్వాన్ని నింపారు. సెబికి 1992లో చట్టబద్దత కల్పించారు. 1991లో నూతన పారిశ్రామిక విధానం తెచ్చారు. ఎనిమిది రంగాలు మినహా మిగతా అన్ని రంగాల్లో ప్రయివేటు అడుగు పెట్టేందుకు అవకాశం కల్పించారు. విదేశీ పెట్టుబడులకు అనుమతి, కొన్నింట 100 శాతం వరకు అనుమతించారు. పీవీ సంస్కరణలతో కరెంట్ ఖాతా లోటు తగ్గుముఖం పట్టింది. ద్రవ్యోల్భణం అదుపులోకి వచ్చింది. ప్రయివేటు పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు పెరిగింది. పీవీ నరసింహా రావు సంస్కరణలు, ఆ తర్వాత నరేంద్ర మోడీ వరకు వచ్చిన ప్రభుత్వాల దూరదృష్టి కారణంగా 1991లో ఈ మూడు దశాబ్దాల్లో విదేశీ మారకపు నిల్వలు 500 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. లైసెన్స్ రాజ్‌కు చెల్లుచీటీ పాడారు.పీవీ అమలు చేసిన  సంస్కరణలే నేడు.. దేశానికి వెన్నుముకగా నిలిచాయి. అందుకే ఆయనకు  భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ అన్ని వర్గాల నుంచి వచ్చింది. చివరికి కేంద్రం ఆ డిమాండ్ ను నెరవేర్చింది.

Related Posts