న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13,
డిజిటల్ చెల్లింపుల్లో భారతదేశాన్ని అగ్రరాజ్యంగా నిలబెట్టడంలో యూపీఐలది అతి పెద్ద పాత్ర. ఇప్పుడు భారతదేశం వెలుపల కూడా యూపీఐ బలపడుతోంది. నగదు లావాదేవీలు మాత్రమే కాదు, బ్యాంకింగ్ సేవల డిజిటలైజేషన్‌లోనూ భారత్ నానాటికీ పురోగతి సాధిస్తోంది. మన పొరుగు దేశాలైన శ్రీలంక, మారిషస్‌లోనూ యూపీఐ సర్వీస్ ప్రారంభమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్‌నాథ్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే సమక్షంలో.. శ్రీలంక, మారిషస్‌లో యూపీఐ సేవలను ప్రారంభించారు. దీంతో పాటు, శ్రీలంక, మారిషస్ రెండింటిలోనూ రూపే కార్డ్ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. మీరు శ్రీలంక లేదా మారిషస్ వెళితే.. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా యూపీఐ ద్వారా డబ్బులు చెల్లించొచ్చు. లేదా, రూపే కార్డ్‌ను వాడొచ్చు. కొన్ని రోజుల క్రితం, ఫ్రాన్స్‌లోనూ యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి.భారతదేశ చెల్లింపుల నియంత్రణ సంస్థ 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూపీఐ రూపొందించింది. ఇది తక్షణ చెల్లింపు వ్యవస్థ కాబట్టి భారత్‌లో విపరీతమైన ప్రజాదరణ లభించింది. కూరగాయల బండి నుంచి కిరాణా షాప్ వరకు, టీ కొట్టు నుంచి స్టార్ హోటల్ వరకు ప్రతిచోటా యూపీఐ ఉనికి ఉంది. దీనివల్ల చిల్లర సమస్య కూడా తొలగిపోయింది. అత్యంత సులభంగా, రెప్పపాటు కాలంలో ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో బ్యాంకు ఖాతాకు డబ్బు పంపే సౌలభ్యం కారణంగా గ్రామీణ జనం కూడా యూపీఐకి బాగా అలవాటు పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా యూపీఐని ఆమోదింపజేసేందుకు భారత ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెలలో, ప్రధాన యూరోపియన్ దేశం ఫ్రాన్స్‌లో యూపీఐ సర్వీస్‌ను లాంచ్ చేశారు. మీరు పారిస్‌లోని ఐఫిల్ టవర్ దగ్గర మీరు ఏదైనా షాపింగ్ చేస్తే, ఇప్పుడు యూపీఐ ద్వారా చెల్లింపు చేయొచ్చు. ఐఫిల్ టవర్ వెబ్‌సైట్‌లోనూ QR కోడ్ ఇచ్చారు. యూపీఐతో అనుసంధానమైన యాప్‌నుంచి దీనిని స్కాన్ చేసి, డబ్బు చెల్లించొచ్చు.కొంత కాలం ముందు, సింగపూర్‌లోనూ యూపీఐ అందుబాటులోకి వచ్చింది. సింగపూర్‌కు చెందిన ఇన్‌స్టాంట్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ 'పేనౌ'తో ఇండియన్ యూపీఐ లింక్ అయింది. ఈ లింకేజీ వల్ల.. సింగపూర్ నుంచి భారతదేశానికి. భారతదేశం నుంచి సింగపూర్‌నకు రియల్ టైమ్‌లో నగదు బదిలీ సాధ్యమైంది. అంతేకాదు..అరమ్ ఎమిరేట్స్, నేపాల్, భూటాన్ సహా భారతదేశం వెలుపల చాలా దేశాల్లో కూడా యూపీఐ సేవలు అందుబాటులో ఉన్నాయి.ఇండియన్ యూపీఐ గ్లోబల్ యూపీఐగా మారుతున్న ఈ అద్భుతమైన ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయి సాధ్యమైంది. అది.. అంతర్జాతీయ మొబైల్ నంబర్‌ల ద్వారా యూపీఐ యాక్సెస్ అందుబాటులో ఉండటం. యూపీఐని దాదాపు డజను దేశాల్లో అంతర్జాతీయ నంబర్‌ల నుంచి యాక్సెస్ చేయవచ్చు, ఉపయోగించవచ్చని ఒక రిపోర్ట్ వెల్లడించింది. మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంగ్ కాంగ్, ఒమన్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్రిటన్‌లో ఈ సేవ అందుబాటులో ఉందని ఆ రిపోర్ట్ వెల్లడించింది. ఈ దేశాలలో అంతర్జాతీయ నంబర్‌ల ద్వారా, భారతీయ ప్రజలు NRE & NRO అకౌంట్ల నుంచి UPIని ఉపయోగించవచ్చు.